అందాల శకుంతల ఆభరణాలు చేశా...!

పుట్టినరోజుకో, పెళ్లిరోజుకో ఓ చిన్న నగ చేయించుకోవాలనుకుంటే ఎంతో ఆలోచిస్తాం. ఎన్నో మార్పులు సూచిస్తాం. మరి ఇతిహాస పాత్రలను ఆభరణాలతో అందంగా మలచాలంటే...ఎంత కష్టమో కదా! ఆ పనిని అలవోకగా చేశారు... హైదరాబాద్‌కి చెందిన నేహా అనుమోలు. ప్రకృతి ఒడిలో పెరిగిన అందాల రాశి శకుంతల సౌందర్యాన్ని రెట్టింపు చేసేలా.

Published : 28 Mar 2023 00:24 IST

పుట్టినరోజుకో, పెళ్లిరోజుకో ఓ చిన్న నగ చేయించుకోవాలనుకుంటే ఎంతో ఆలోచిస్తాం. ఎన్నో మార్పులు సూచిస్తాం. మరి ఇతిహాస పాత్రలను ఆభరణాలతో అందంగా మలచాలంటే...ఎంత కష్టమో కదా! ఆ పనిని అలవోకగా చేశారు... హైదరాబాద్‌కి చెందిన నేహా అనుమోలు. ప్రకృతి ఒడిలో పెరిగిన అందాల రాశి శకుంతల సౌందర్యాన్ని రెట్టింపు చేసేలా, రాచరికపు దర్పానికి ప్రతీకలా దుశ్యంతుడి రూపం కళ్ల ముందు మెదిలేలా... ‘శాకుంతలం’ సినిమాకోసం ఆకట్టుకునేలా ఆభరణాలను తీర్చిదిద్దారు. ఆ సంగతులను వసుంధరతో పంచుకున్నారిలా...

ప్పుడంటే అన్ని రంగాల్లోనూ మహిళలు నిలదొక్కుకోగలుగుతున్నారు కానీ, కొన్నేళ్ల కిందట ఈ పరిస్థితులు లేవు. మా ఇంట్లో... ‘ఆడపిల్లలు బాగా చదువుకోవాలి...స్వతంత్రంగా ఎదగాలి’ అని ఎంత విశాలంగా ఆలోచించి మమ్మల్ని పెంచినా... సమాజం మాత్రం మేం వ్యాపారం చేస్తున్నామంటే త్వరగా ఒప్పుకోలేకపోయింది. ఏ రంగంలో అయినా మహిళలకు కొన్ని ప్రతికూలతలు ఉంటాయని మాకు మేము సర్దిచెప్పుకొని ముందడుగు వేశాం. కష్టనష్టాలను ఓర్చుకున్నాం. అవకాశాల్ని ఒడిసిపట్టుకున్నాం కాబట్టే ఈ రోజు మాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోగలిగాం. నేను పుట్టింది విజయవాడలో. కానీ, పెరిగింది... చదివింది అంతా హైదరాబాద్‌లోనే. నాన్న ఏవీ కోటేశ్వరరావు న్యాయమూర్తి, లా సెక్రటరీగా పనిచేశారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావుగారికి వ్యక్తిగత న్యాయ సలహాదారు కూడా. తాతయ్య అనుమోలు శేషగిరిరావు వ్యాపారవేత్త. క్రమశిక్షణ, నీతి నిజాయతీలతో గడిపిన వీరిద్దరి జీవితం మా ఆలోచనలపై ఎంతో ప్రభావం చూపించింది.

గుత్తాధిపత్యాన్ని ఎదిరించి...

నగల వ్యాపారంలోకి రావాలన్న ఆలోచన మా అక్క వసుంధరది. నేను మొదట పైలట్‌ అవ్వాలనుకున్నా...అయితే, ఆ దిశగా వెళ్లడానికి నేనే ప్రయత్నం చేయలేదు. దాంతో కళలూ, సృజనాత్మక అంశాల్లో దేన్నైనా కెరియర్‌గా ఎంచుకోవాలనుకున్నా. అప్పటికే అక్క నగల తయారీ మొదలుపెట్టడంతో బీకాం పూర్తయ్యాక నేనూ తన అడుగుజాడల్లో నడవడం మొదలుపెట్టా. ఆభరణాల తయారీ రంగంలో అమ్మాయిలు నిలదొక్కుకోవడం అంత సులువైన విషయం ఏమీ కాదు. తెలుగు వాళ్లు ఈ రంగంలోకి వచ్చారనే నిరసన, ఆడపిల్లలనే చిన్నచూపుతో అడుగడగునా మా దారికి అడ్డంకులు సృష్టించేవారు. మాకు సహాయ సహకారాలు అందకుండా చేసేవారు. వదంతులు పుట్టించేవారు... అయినా సరే, ఎక్కడా మేం వెనక్కి తగ్గలేదు. బంగారం స్వచ్ఛత నుంచి వజ్రాలు, నవరత్నాల సేకరణ వరకూ అన్నింటా నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చి కొత్త అవకాశాల్ని సృష్టించుకున్నాం.

ఇతిహాస కథల్ని చదివా...

ఏ పనిచేసినా అందులో మన అభిరుచి కనిపించాలనుకునే తత్వం నాది. అందుకే, చిన్న నల్లపూసల గొలుసు చేసినా, కోట్ల రూపాయల విలువైన ఆభరణాల తయారీ చేపట్టినా కూడా సంతృప్తి పొందగలను. అదే ‘శాకుంతలం’ సినిమాలోని పాత్రలకు నగలు అందించడానికి ఒప్పుకునేలా చేసింది. దర్శకుడు మా పనికి స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ...అత్యుత్తమంగా చేయాలనే తపనతో ఇతిహాస వృత్తాంత సినిమాలెన్నో చూశాం. పౌరాణిక పుస్తకాలూ చదివాం. తర్వాతే తుదిరూపు డిజైన్‌ చేసేవాళ్లం. సాధారణంగా మనం చూసినదాన్నే ఊహించుకోగలం అన్న సూత్రానికి అనుగుణంగా అడవిలో ఉన్న శకుంతల డ్రీమ్‌ సాంగ్‌ కోసం... ఆకులూ, పూలూ, జింకలు, నెమళ్ల ఆకృతిలోనే నగల్ని చేశా. తర్వాత క్వీన్‌ లుక్‌ ఆడంబరంగా, హుందాగా ఉండేలా తీర్చిదిద్దాం. మరో పాత్ర మేనక. దివి నుంచి భువికేగిన ఆమె ధగధగలాడిపోయేందుకు వజ్రాలతో ఆభరణాల్ని తయారు చేశాం. దుశ్యంతుడి మొహంలో రాజసం ఉట్టిపడేలా...ఎక్కువ గంటలు వేసుకున్నా ఇబ్బందిపడకుండా తేలిగ్గా తీర్చిదిద్దాం. ఇవన్నీ రూపొందించడానికి మాకు ఎనిమిది నెలలు పట్టింది. సుమారు పద్నాలుగుకోట్ల రూపాయల ఖర్చయ్యింది. థీమ్‌ బేస్డ్‌ జ్యువెలరీ చేయడంలో ఉన్న ప్రత్యేకత, నాణ్యత మీద పెట్టే శ్రద్ధ మాకు గడిచిన పాతికేళ్లలో ఎందరినో ఖాతాదారులుగా మార్చింది. తెలుగురాష్ట్రాల రాజకీయ, సినీ, క్రీడా కుటుంబాలకు చెందిన వారెందరో మా వినియోగదారులు. నాకు ఒకబ్బాయి రోహన్‌. మా కోడలు హర్షిత ఈ వ్యాపారంలోనే సాగుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్