ఈ మాస్క్‌తో మెరిసిపోతారా?

అందంగా కనిపించేందుకు క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్‌తో పాటు అప్పుడప్పుడూ ఫేస్‌మాస్క్‌లు వేసుకోవడం, ఫేషియల్స్ చేయించుకోవడం వంటివి మామూలే. ఇటు ఇంట్లో అందుబాటులో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే కాదు.. అటు మార్కెట్లో లభ్యమయ్యే ఫేషియల్ క్రీమ్‌లతోనూ మాస్క్‌లు వేసుకుంటూ ఉంటాం.

Published : 06 Apr 2024 11:32 IST

అందంగా కనిపించేందుకు క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్‌తో పాటు అప్పుడప్పుడూ ఫేస్‌మాస్క్‌లు వేసుకోవడం, ఫేషియల్స్ చేయించుకోవడం వంటివి మామూలే. ఇటు ఇంట్లో అందుబాటులో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే కాదు.. అటు మార్కెట్లో లభ్యమయ్యే ఫేషియల్ క్రీమ్‌లతోనూ మాస్క్‌లు వేసుకుంటూ ఉంటాం. అయితే వీటి కంటే షీట్‌మాస్క్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందంటున్నారు సౌందర్య నిపుణులు.. సంప్రదాయ మాస్కుల కంటే వీటిని ఉపయోగించి చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా, మృదువుగా మార్చుకునే వీలుంటుందట. అదెలాగో తెలుసుకుందాం రండి..!

ఏంటీ మాస్కులు?

షీట్ మాస్కులంటే ముఖం ఆకృతిలో ఉన్న ఫ్యాబ్రిక్ షీట్.. దీనిపై కళ్లు, ముక్కు, పెదాల దగ్గర ఆయా ఆకృతుల్లో రంధ్రాలుంటాయి. పేపర్, ఫ్యాబ్రిక్ వంటివి కలిపి తయారుచేసిన ఈ మాస్క్‌ని పోషకాలు నిండిన సీరంలో నానబెట్టి తర్వాత ఆరబెడతారు. మనం చూసే జెల్ లేదా పేస్ట్‌లాంటి ఫేస్‌మాస్క్‌లకి ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. సాధారణంగా ఫేస్‌మాస్క్ వేసుకోవడం కాస్త శ్రమతో కూడుకున్న పని. అదే షీట్‌మాస్క్‌ని నేరుగా ముఖంపై అమర్చుకుంటే సరిపోతుంది. అయితే షీట్ పెట్టుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకొని ఆపై షీట్‌ను అతికించుకోవాలి. అరగంట తర్వాత తీసేస్తే సరిపోతుంది. షీట్‌ మాస్క్‌ పెట్టుకొని మన పనులు మనం చేసుకోవచ్చు కూడా!

ఎన్నో ప్రయోజనాలు..

ఈ షీట్ మాస్కులు దక్షిణ కొరియాలో పుట్టినా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తమయ్యాయి. ఎంతోమంది సెలబ్రిటీలు వీటిని తరచూ ఉపయోగిస్తూ తమ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడం చూస్తుంటాం. విటమిన్లు, చర్మానికి మేలు చేసే పదార్థాల్లో ముంచి ఆరబెట్టిన ఈ తరహా మాస్కుల వల్ల చర్మానికి సాధారణ మాస్కుల కంటే మరింత మేలు జరుగుతుందట. సాధారణ మాస్కులు చాలా త్వరగా ఆరిపోతాయి. కానీ ఈ షీట్ మాస్కుల్లో ఉన్న ఫ్యాబ్రిక్ తేమను బయటకు పోకుండా కాపాడుతుంది. దీంతో ఎక్కువసేపు మాస్కుని ధరించి ఉంచుకునే వీలుంటుంది. దీనివల్ల ఎక్కువ మోతాదులో చర్మానికి అవసరమైన విటమిన్లు, ఇతర పదార్థాలు చర్మం లోపలి పొరల్లోకి వెళ్లి సాధారణం కంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

షీట్ మాస్కులు ఎంత ప్రయోజనకరమైనవి అయినా.. వాటి వినియోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మాస్క్ వేసుకోవడానికి ముందు మన చర్మాన్ని చక్కటి క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోవాలి. కావాలంటే స్క్రబ్బింగ్‌ కూడా ముందే చేసుకోవచ్చు. తద్వారా చర్మంపై పేరుకున్న మలినాలు తొలగిపోయి.. మాస్క్‌లో ఉన్న పోషకాలు చర్మంలోకి సులభంగా ఇంకుతాయి. అలాగే మాస్క్‌ని తొలగించిన తర్వాత పదే పదే ముఖాన్ని తుడుచుకోవడం, నీటితో శుభ్రం చేసుకోవడం.. వంటివి చేయకూడదు. ఇక ఒకసారి మాస్క్ వేసి తొలగించిన తర్వాత కనీసం రెండు, మూడు రోజుల వరకు స్క్రబ్బింగ్‌ జోలికి వెళ్లకూడదంటున్నారు నిపుణులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్