Published : 11/01/2023 20:28 IST

మేకప్.. ఇవి లేకున్నా ఓకే!

సాధారణంగా మేకప్ అనగానే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులు మన దగ్గర ఉండాల్సిందే అని భావిస్తారు కొంతమంది. అయితే ఈ అభిప్రాయం అంత సరైనది కాదంటున్నారు నిపుణులు. కొన్ని రకాల ఉత్పత్తులు లేకపోయినా సౌందర్య పోషణలో వచ్చే లోటేమీ ఉండదంటున్నారు.

మేకప్‌ వేసుకునే క్రమంలో ప్రైమర్‌, కన్సీలర్‌, బ్లష్‌, హైలైటర్‌.. ఇలా చాలా ఉత్పత్తులు వినియోగిస్తుంటారు. అయితే వీటన్నింటికి బదులుగా కాస్త ప్రైమర్‌ రాసుకొని సాధారణ టాల్కమ్‌ పౌడర్‌ వేసుకున్నా మంచి లుక్‌ని సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.

వెంటనే ఉపయోగించే విధంగా ఫేస్‌మాస్కుల్ని కొంతమంది బయటి నుంచి కొనుగోలు చేస్తారు. నిజానికి వాటి కంటే ఎవరి చర్మతత్వాలకు అనుగుణంగా వారు వీటిని ఇంట్లోనే తయారుచేసుకోవడం వల్ల చర్మానికి హాని కలగదు. ఖర్చూ కలిసొస్తుంది.

బరువు తగ్గిన వారు, బాలింతలకు చర్మంపై స్ట్రెచ్‌మార్క్స్‌ రావడం సహజమే! అయితే ఇందుకోసం యాంటీ-స్ట్రెచ్‌మార్క్స్‌ క్రీమ్‌ కొనాల్సిన అవసరం లేదు. దానికి బదులు కొకోవా బటర్‌, పెట్రోలియం జెల్లీ, మాయిశ్చరైజర్‌.. వంటివీ సమాన ఫలితాల్నిస్తాయంటున్నారు నిపుణులు.

కంటికి కాటుకే అందం.. కాబట్టి అదొక్కటి కిట్‌లో ఉంచుకుంటే సరిపోతుంది. ఇక మరీ అత్యవసరం కాకపోతే ఐషాడో, ఐలైనర్‌, ఐబ్రో ఉత్పత్తులు.. వంటివన్నీ కొనకపోవడమే మంచిది. తద్వారా వాటిలోని రసాయనాల ప్రభావం కంటిపై పడకుండా జాగ్రత్తపడచ్చు. దాంతో పాటు ఖర్చూ తగ్గించుకోవచ్చు.

వేలకు వేలు పోసి హెయిర్‌ మాస్కులు, హెయిర్‌ క్రీమ్‌, హెయిర్‌ వ్యాక్స్‌, హెయిర్‌ జెల్‌, హెయిర్‌ స్ప్రే.. వంటివి కొనాల్సిన అవసరమే లేదు. వాటికి బదులుగా జుట్టుతత్వానికి సరిపడే నాణ్యమైన షాంపూ, కండిషనర్‌ ఉంటే సరిపోతుంది. ఇక కేశాలకు తేమనందించడానికి కొబ్బరి నూనె, ఇంట్లో తయారుచేసుకునే హెయిర్‌ మాస్కులు.. వంటి సహజసిద్ధమైన ప్రత్యామ్నాయాలు ఉండనే ఉన్నాయి.

అయితే ఒక్క విషయం.. మీ అవసరాలకు అనుగుణంగా మీరు ఏ మేకప్‌ ఉత్పత్తి ఎంచుకున్నా సరే.. అది నాణ్యమైనదైతేనే ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తకుండా అందాన్ని సంరక్షించుకోవచ్చు. ఈ క్రమంలో మీకేమైనా సందేహాలున్నా, సలహాలు కావాలన్నా నిపుణుల్ని అడగడానికి వెనకాడకండి. అలాగే మీ మేకప్‌ కిట్‌లో ఉన్న వస్తువుల ఎక్స్‌పైరీ తేదీని ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకొని వాటిని మార్చుకోవడం మర్చిపోవద్దు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని