బుగ్గల్లో కొవ్వు పేరుకుపోకుండా..!

చెక్కిళ్లు లావుగా ఉంటే.. కిందికి వేలాడి వయసు పైబడినట్లుగా, అందవిహీనంగా కనిపిస్తాయి. దీనికి కారణం చెక్కిళ్లలో పేరుకుపోయిన అనవసర కొవ్వులే! దీన్ని వీలైనంత త్వరగా తగ్గించుకుంటేనే ముఖం అందాన్ని తిరిగి పొందగలుగుతాం....

Updated : 27 Oct 2023 14:43 IST

చెక్కిళ్లు లావుగా ఉంటే.. కిందికి వేలాడి వయసు పైబడినట్లుగా, అందవిహీనంగా కనిపిస్తాయి. దీనికి కారణం చెక్కిళ్లలో పేరుకుపోయిన అనవసర కొవ్వులే! దీన్ని వీలైనంత త్వరగా తగ్గించుకుంటేనే ముఖం అందాన్ని తిరిగి పొందగలుగుతాం. ఈ క్రమంలో చెక్కిళ్లలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలున్నాయి.

మసాజ్‌తో..

ఫేషియల్ మసాజ్ చేసుకోవడం వల్ల ముఖంపై ఆయా భాగాల్లో పేరుకుపోయిన కొవ్వుల్ని సులభంగా కరిగించుకోవచ్చు. చెక్కిళ్లలో పేరుకున్న కొవ్వుల్ని కరిగించుకోవడానికి.. ముందుగా ఫేషియల్ మసాజ్ క్రీం లేదా ఆయిల్‌ను కొద్దిగా చేతిలోకి తీసుకుని దాన్ని చేతివేళ్ల సహాయంతో చెక్కిళ్లపై రాసుకోవాలి. ఆ తర్వాత చేతివేళ్లతో గుండ్రంగా, గడ్డం భాగం నుంచి పైదిశగా నెమ్మదిగా, మృదువుగా మసాజ్ చేయాలి. ఈ ప్రక్రియను ఐదారు సార్లు చేయాలి. అనంతరం మునివేళ్లతో పెదాల చివర్ల నుంచి చెవుల వరకు పైదిశగా కనీసం పదిసార్లు మసాజ్ చేయాలి. తర్వాత దవడ భాగంలో చేతివేళ్ల సహాయంతో పైదిశగా నెమ్మదిగా స్ట్రోక్స్ ఇవ్వాలి. ఈ విధంగా ఐదారుసార్లు చేయాలి. ఇలా బుగ్గలపై ఒకదాని తర్వాత మరొకటి చొప్పున మసాజ్ చేస్తే త్వరలోనే మంచి ఫలితాన్ని పొందచ్చు.

గాలి ఊదడం..

బుగ్గల్లో పేరుకున్న కొవ్వు కరిగి.. నాజూగ్గా తయారు కావడానికి గాలి ఊదే ప్రక్రియ ఎంతగానో తోడ్పడుతుంది. ఈ ప్రక్రియను రోజూ కనీసం పదిసార్లు చేస్తే త్వరలోనే చక్కటి ఫలితం లభిస్తుంది. బెలూన్‌లోకి గాలి ఊదే క్రమంలో చెక్కిళ్లలోని కండరాలు వ్యాకోచ, సంకోచాలకు గురవుతాయి. ఫలితంగా ఆ భాగంపై ఒత్తిడి పడి అక్కడ పేరుకున్న కొవ్వులు సులభంగా కరిగిపోతాయి. కాబట్టి లావుపాటి చెక్కిళ్లు ఉన్న వారు ఈ ప్రక్రియను తరచూ పాటించడం ద్వారా సమస్య నుంచి అతి త్వరలోనే విముక్తి పొందచ్చు.

ఇలా చేస్తున్నారా?

చూయింగ్ గమ్.. నోటి దుర్వాసనను పోగొట్టడానికి మాత్రమే కాదు.. బుగ్గల్లో పేరుకున్న కొవ్వుల్ని కరిగించడానికి కూడా ఉపయోగపడుతుంది. రోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసిన తర్వాత ఓ అరగంట పాటు చూయింగ్ గమ్‌ని నమలడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే ఎంచుకునే చూయింగ్‌గమ్ మాత్రం షుగర్ ఫ్రీగా ఉండేలా చూసుకోవడం ఉత్తమం. ఈ నమిలే ప్రక్రియ వల్ల చెక్కిళ్లకు మంచి వ్యాయామం జరిగి ఆ భాగంలోని కొవ్వులు సత్వరమే కరిగిపోతాయి. దీంతో పాటు మనం సాధారణంగా ఏదైనా తింటున్నప్పుడు ఎలాగైతే దవడలు కదిలిస్తామో.. అలాగే ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా కాసేపు చేయడం వల్ల చెక్కిళ్లలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చట!

ఇవి కూడా..

భోజనం తర్వాత నీటితో నోటిని పుక్కిలించడం చాలా మంచి ప్రక్రియ. ఇలా చేయడం ద్వారా నోట్లో చిక్కుకున్న ఆహార పదార్థాల అవశేషాలను తొలగించడం మాత్రమే కాదు.. బుగ్గలను నాజూగ్గానూ తయారుచేసుకోవచ్చు. కాబట్టి రోజుకు నాలుగైదుసార్లు నోటి నిండా నీరు తీసుకుని బాగా పుక్కిలించి కాసేపటి తర్వాత ఉమ్మేయాలి. ఫలితంగా చెక్కిళ్లను నాజూగ్గా చేసుకోవచ్చు.
అలాగే జంక్‌ఫుడ్, చక్కెరలు, నూనె పదార్థాలు.. మొదలైన వాటికి దూరంగా ఉండడం మంచిది.
మధ్యాహ్నం నిద్రపోకపోవడం, రాత్రి పడుకోవడానికి దాదాపు రెండు గంటల ముందుగానే తినడం, రోజూ కాసేపు స్కిప్పింగ్ రోప్ వ్యాయామం చేయడం.. వంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా బుగ్గల్లో కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్తపడచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్