చనుబాలతో చిన్నారుల ప్రాణాలు నిలుపుతోంది!

బిడ్డకు ఆరు నెలల వయసొచ్చే దాకా తల్లిపాలే అన్నపానీయాలు. అయితే కొంతమంది పసి పిల్లలకు ఇవి అందక బాలారిష్టాల బారిన పడుతుంటారు. ఇందుకు కారణం.. వారి తల్లుల్లో పాల ఉత్పత్తి సరిపడినంతగా లేకపోవడమే! కానీ కొంతమంది తల్లుల్లో అవసరానికి మించి పాలు....

Published : 09 Nov 2022 13:11 IST

(Photos: Instagram)

బిడ్డకు ఆరు నెలల వయసొచ్చే దాకా తల్లిపాలే అన్నపానీయాలు. అయితే కొంతమంది పసి పిల్లలకు ఇవి అందక బాలారిష్టాల బారిన పడుతుంటారు. ఇందుకు కారణం.. వారి తల్లుల్లో పాల ఉత్పత్తి సరిపడినంతగా లేకపోవడమే! కానీ కొంతమంది తల్లుల్లో అవసరానికి మించి పాలు ఉత్పత్తవుతుంటాయి. ‘హైపర్‌ ల్యాక్టేషన్‌’గా పిలిచే ఈ అధిక పాల ఉత్పత్తే తనకు రెండు రికార్డులు సంపాదించి పెట్టిందంటోంది కోయంబత్తూరుకు చెందిన సింధు మోనిక. ఏడాదిన్నర పాపకు తల్లైన ఆమె.. తన చిన్నారికి పాలిస్తూనే.. అదనంగా ఉత్పత్తయ్యే పాలను తీసి దగ్గర్లోని స్వచ్ఛంద సంస్థ సహాయంతో వందలాది మంది చిన్నారులకు అందించింది. అలా ఏడు నెలల్లో 42 లీటర్ల పాలను దానం చేసి.. అత్యధికంగా చనుబాలు దానం చేసిన మహిళగా.. ‘ఏషియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు’, ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు’ల్ని సొంతం చేసుకుంది. వీటికి సంబంధించిన ఫొటోల్ని ఆ ఎన్జీవో ఇటీవలే సోషల్‌ మీడియాలో పంచుకోగా.. ప్రస్తుతం అవి వైరలవుతున్నాయి. రక్తదానం, అవయవదానం ఎలాగైతే ఓ ప్రాణాన్ని నిలబెడుతుందో.. తల్లిపాలు కూడా పసిబిడ్డను ప్రాణసంకటం నుంచి బయటపడేస్తాయంటోన్న మోనిక స్ఫూర్తిదాయక కథనమిది!

తమిళనాడులోని కోయంబత్తూరులో ఉండే సింధు మోనిక.. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌. పెళ్లయ్యాక గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న ఆమెకు ప్రస్తుతం 18 నెలల వెంబా అనే పాప ఉంది. మోనిక భర్త మహేశ్వరన్‌.. స్థానిక ఇంజినీరింగ్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇంట్లో తన చిన్నారి ఆలనా పాలన చూసుకునే ఆమెకు సమాజ సేవ చేయడమన్నా మక్కువే! అయితే చనుబాల ద్వారా తనకు ఈ అవకాశం దొరికిందంటోంది మోనిక.

అది తెలియక మొక్కలకు పోసేదాన్ని!

 ‘పాప పుట్టినప్పట్నుంచీ నాలో చనుబాల ఉత్పత్తి ఎక్కువగానే ఉంది. మొదట్లో పాప తాగగా మిగిలిన పాలను తీసి మొక్కలకు పోసేదాన్ని. కానీ తర్వాత ఈ పాలను దానం చేయచ్చన్న విషయం తెలిసింది. ఇక అప్పట్నుంచి చనుబాలను వృథా చేయకూడదని నిర్ణయించుకున్నా. నా బిడ్డ వంద రోజులకు చేరుకున్నప్పట్నుంచి చనుబాలు దానం చేయడం మొదలుపెట్టా. పాప కడుపు నిండా పాలు తాగాక.. అదనంగా ఉత్పత్తయ్యే పాలను బ్రెస్ట్‌ పంప్‌ సహాయంతో సేకరించేదాన్ని. వీటిని దగ్గర్లోని ‘Amirtham’ అనే తల్లిపాల బ్యాంకుకు/స్వచ్ఛంద సంస్థకు అందించేదాన్ని. వాళ్లు ఈ పాలతో ఇక్కడి ప్రభుత్వాసుపత్రిలోని NICUలో చికిత్స పొందుతోన్న చిన్నారుల కడుపు నింపేవారు. అలా గతేడాది జులై నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ దాకా.. సుమారు 42 లీటర్లకు పైగా చనుబాలు అందించాను. ఈ పాలతో దాదాపు 1400 మందికి పైగా పిల్లల కడుపు నింపగలిగాను..’ అంటూ గర్వంగా చెబుతోంది మోనిక.

రెండు రికార్డులు!

బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుందన్నట్లుగా.. లీటర్ల కొద్దీ చనుబాలు దానం చేస్తూ ఎంతోమంది అమ్మలకు ఆదర్శంగా నిలుస్తోంది మోనిక. ఈ క్రమంలోనే ఏడు నెలల్లో 42 లీటర్ల పాలు దానం చేసి.. ఎక్కువ మొత్తంలో తల్లిపాలు దానం చేసిన మహిళగా.. ‘ఏషియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు’, ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు’ల్లో చోటు సంపాదించిందామె. నిజానికి ఈ ఏడాది జులైలోనే ఈ ఘనతను సొంతం చేసుకున్నప్పటికీ.. దీనికి సంబంధించిన ఫొటోల్ని ‘Amirtham’ స్వచ్ఛంద సంస్థ ఇటీవలే సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో మోనిక సేవాదృక్పథం గురించి దేశవ్యాప్తంగా తెలిసింది. అయితే అంతటితో ఆగకుండా.. నేటికీ చనుబాలు దానం చేస్తూనే ఉంది మోనిక. ఈ క్రమంలోనే ఇటీవలే 50 లీటర్ల మార్క్ని కూడా దాటేసింది.

ఇదీ రక్తదానం లాంటిదే!

సాధారణంగా కొన్ని కుటుంబాల్లో ఉండే అపోహలు, మూఢ నమ్మకాల వల్ల తల్లిపాలు దానం చేయడానికి ఒప్పుకోరు. కానీ తన కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయంలో తనకు పూర్తిగా మద్దతు తెలిపారంటోంది మోనిక. ‘చనుబాలు దానం చేసే క్రమంలో నేను బోలెడన్ని విషయాలు తెలుసుకున్నా. ఇవి శిశు మరణాల రేటును తగ్గిస్తాయి.. అలాగే నవజాత శిశువుల ఆరోగ్యానికి, ఎదుగుదలకు ఇవి కీలకం! ఒక మనిషి ప్రాణాలు నిలబెట్టడానికి రక్తదానం, అవయవదానం ఎంత ముఖ్యమో.. శిశువుల్ని వివిధ ప్రాణ సంకటాల నుంచి బయటపడేయడానికి తల్లిపాలూ అంతే ముఖ్యం. కాబట్టి పాల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న తల్లులు ఈ మంచి పనిలో పాలుపంచుకోవాలి. తల్లిపాల దానం, వాటి ఉపయోగం గురించి సమాజంలో అవగాహన పెరగాలి.. చనుబాల దానం గురించి ముందు నేను ఇంట్లో చెప్పినప్పుడు అందరూ సంతోషించారు. ఈ క్రమంలో మావారు నాకు పూర్తి అండగా నిలిచారు. చనుబాలు దానం చేస్తానని ముందుకొచ్చిన మహిళల్ని తమ కుటుంబ సభ్యులూ ఇలాగే వెన్నుతట్టాలి.. అప్పుడే వారు ప్రశాంతంగా ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కాగలుగుతారు..’ అంటూ చెప్పుకొచ్చింది మోనిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్