మండే ఎండల్లో... ఫ్రెష్‌గా ఉండాలంటే..!

చర్మంపై ఎండ ప్రభావం పడటం వల్ల ముఖం, కళ్లు జీవం కోల్పోతాయి. కంటి చుట్టూ నల్లటి వలయాలు, ముఖంలో తాజాదనం లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి వాటన్నింటికీ చెక్‌ పెట్టాలంటే ఈ టిప్స్‌ పాటించాల్సిందే అంటున్నారు సౌందర్య నిపుణులు.

Published : 07 May 2024 13:02 IST

చర్మంపై ఎండ ప్రభావం పడటం వల్ల ముఖం, కళ్లు జీవం కోల్పోతాయి. కంటి చుట్టూ నల్లటి వలయాలు, ముఖంలో తాజాదనం లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి వాటన్నింటికీ చెక్‌ పెట్టాలంటే ఈ టిప్స్‌ పాటించాల్సిందే అంటున్నారు సౌందర్య నిపుణులు.

గ్రీన్‌ టీ బ్యాగులతో..

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లే కాదు.. కెఫీన్‌ కూడా ఉంటుంది. సాధారణంగా కళ్లు అలసినప్పుడు ఆ టీ బ్యాగుల్ని కళ్లపై పెట్టుకోవడం తెలిసిందే. అయితే వాటి కన్నా, గ్రీన్ టీని ఐసుముక్కల్లా చేసుకొని వాడితే త్వరగా ఫలితం ఉంటుంది. ఇందుకోసం ముందుగా గ్రీన్‌ టీని తయారు చేసుకోవాలి. దీన్ని ఐస్‌ ట్రేలో వేసి ఫ్రీజర్‌లో ఉంచాలి. ఐసు ముక్కల్లా తయారయ్యాక కళ్లపై పెట్టుకుంటే చాలు. లేదంటే ముఖానికి రాసుకొని కాసేపయ్యాక కడిగేసినా కళ తగ్గిన ముఖంలో ఎంతో మార్పు కనిపిస్తుంది.

ముఖంపై రుద్దుకోవాలి..

మేకప్‌ వేసుకోవడానికి చాలా సందర్భాల్లో సమయం ఉండకపోవచ్చు. అలాగని మేకప్‌ లేకుండా కొన్నిసార్లు బయటికి వెళ్లలేకపోవచ్చు. ఇలాంటప్పుడు ఒకటి లేదా రెండు ఐసు ముక్కల్ని తీసుకొని ముఖంపై రుద్దుకోవాలి. ముఖంలో రక్తప్రసరణ పెరిగి, చాలా తక్కువ సమయంలోనే తాజాగా మారిపోతుంది. ఇలా తరచూ చేయడం వల్ల ముడతల ప్రభావం కూడా తగ్గుతుంది. ఎండ వల్ల కమిలిన చర్మానికి సాంత్వన చేకూరుతుంది.

కీరదోసతో..

చర్మాన్ని మెరిపించాలనుకుంటున్నారా..? కీరదోస ఐసు వాడి చూడండి.. కీరదోస గుజ్జులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలపాలి. తర్వాత ఐస్‌ట్రేలో వేసి ఫ్రీజర్‌లో ఉంచేయాలి. ఈ మిశ్రమం ఐస్‌ముక్కల్లా అయ్యాక ముఖం, మెడకు రాసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చాలు. ఇది మురికిని తొలగించి, ముఖాన్ని శుభ్రపరుస్తుంది. తద్వారా చర్మం కాంతివంతమవుతుంది.

కలబంద గుజ్జుతో..

కలబంద గుజ్జును ఐస్‌ట్రేలో వేసి ఫ్రీజర్‌లో ఉంచేయాలి. కాసేపటి తర్వాత ముఖానికి రాసుకొని నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల ఎండ కారణంగా కమిలిన చర్మం తాజాగా మారుతుంది. చర్మంపై వేడి ప్రభావం కూడా తగ్గుతుంది.

గులాబీ నీటితో..

కళ్ల అడుగున నల్లటి వలయాలు ఇబ్బంది పెడుతున్నాయా..? అయితే ఓ పని చేయండి. గులాబీ నీటిని గోరువెచ్చగా చేసి అందులో కీరదోస రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐస్‌ట్రేలో వేసుకొని ఫ్రీజర్‌లో ఉంచాలి. తర్వాత ఆ ఐసు ముక్కలను కళ్లపై పెట్టుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల కళ్ల కింద ఏర్పడిన నల్లటి వలయాలు దూరమవడంతో పాటు ఉబ్బిన కళ్లకు సాంత్వన చేకూరుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్