ఆ మచ్చలకు ఇలా చెక్ పెట్టేయండి..!

గర్భం ధరించినప్పుడు శారీరకంగా వివిధ మార్పులు వస్తుంటాయి. పిగ్మెంటేషన్ కూడా ఇలాంటి వాటిలో ఒకటి. బుగ్గలు, నుదురు పైన ఏర్పడే నల్లటి మచ్చల కారణంగా ఒక్కోసారి ముఖంలో కళ లోపిస్తుంది. అయితే  ఇంట్లోనే సులభంగా లభించే కొన్ని పదార్థాల ద్వారా....

Published : 20 Oct 2022 18:59 IST

గర్భం ధరించినప్పుడు శారీరకంగా వివిధ మార్పులు వస్తుంటాయి. పిగ్మెంటేషన్ కూడా ఇలాంటి వాటిలో ఒకటి. బుగ్గలు, నుదురు పైన ఏర్పడే నల్లటి మచ్చల కారణంగా ఒక్కోసారి ముఖంలో కళ లోపిస్తుంది. అయితే  ఇంట్లోనే సులభంగా లభించే కొన్ని పదార్థాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చంటున్నారు నిపుణులు.

✭ గుప్పెడు పుదీనా ఆకులకు నీళ్లు కలుపుతూ మెత్తటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని సమస్య ఉన్న చోట అప్త్లె చేసుకొని పావుగంట తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది. పిగ్మెంటేషన్ బారి నుంచి త్వరితగతిన ఉపశమనం పొందాలంటే రోజుకు రెండుసార్లు ఈ చిట్కా పాటిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

✭ టేబుల్‌స్పూన్ చొప్పున సోయా పాలు, నిమ్మరసం, టొమాటో గుజ్జు తీసుకొని ఈ మూడింటినీ మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని సమస్య ఉన్న చోట అప్త్లె చేసుకొని పది నిమిషాల పాటు మృదువుగా మర్దన చేసుకోవాలి. ఆరాక కడిగేసుకుంటే సమస్య ఇట్టే తగ్గిపోతుంది.

✭ టేబుల్‌స్పూన్ చొప్పున తేనె, కలబంద గుజ్జు తీసుకొని అందులో రెండు టేబుల్‌స్పూన్ల బొప్పాయి గుజ్జు వేసి ప్యాక్‌లాగా తయారుచేసుకోవాలి. దీన్ని పిగ్మెంటేషన్‌పై రాసి అరగంట పాటు ఆరనివ్వాలి. ఆపై కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల సమస్య తగ్గడంతో పాటు అక్కడ చర్మంపై ఏర్పడిన మృతకణాలు సైతం తొలగిపోయి చర్మం కాంతివంతమవుతుంది.

✭ కమలాఫలం తొక్కల్ని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో పచ్చి పాలను చేర్చి పేస్ట్‌లా తయారుచేసుకొని ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట అప్త్లె చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే పిగ్మెంటేషన్ సమస్య నుంచి బయటపడడమే కాదు.. చర్మ రంగు కూడా మెరుగుపడుతుంది.

✭ సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి బయటికి వెళ్లేటప్పుడు ఎస్పీఎఫ్ 30 సన్‌స్క్రీన్ రాసుకోవడం, ముఖాన్ని స్కార్ఫ్‌తో కవర్ చేసుకోవడం మాత్రం మరవద్దు.

✭ రెండు టేబుల్‌స్పూన్ల ఓట్‌మీల్, అర టేబుల్‌స్పూన్ టొమాటో రసం, టేబుల్‌స్పూన్ పెరుగు.. ఈ మూడింటిని కలుపుకొని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట రాసుకొని ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. టొమాటోలోని సహజసిద్ధమైన బ్లీచింగ్ గుణాలు చర్మాన్ని శుభ్రపరిస్తే, ఓట్‌మీల్ ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్‌గా పనిచేసి సమస్యను తగ్గిస్తుంది. పెరుగు ముఖాన్ని మృదువుగా మారుస్తుంది.

✭ అలాగే పిగ్మెంటేషన్‌ని తగ్గించుకోవడానికి ఆహారం విషయంలో కూడా శ్రద్ధ వహించడం అవసరం. దానిమ్మ, బెర్రీస్, నట్స్, బొప్పాయి.. వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పదార్థాలతో పాటు కివీ, నిమ్మ, స్ట్రాబెర్రీ, కమలాఫలం, ద్రాక్ష, క్రాన్‌బెర్రీస్.. వంటి విటమిన్-సి అధికంగా లభించే పండ్లను కూడా రోజూ తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటే సమస్య త్వరగా తగ్గుతుంది. ఇవి కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యానికి కూడా అవసరమే.

గర్భధారణ సమయంలో పిగ్మెంటేషన్‌ని దూరం చేయడానికి ఎలాంటి సహజసిద్ధమైన పదార్థాల్ని ఉపయోగించాలో తెలుసుకున్నారుగా! అయితే ఇవి సహజసిద్ధమైనవే అయినా ఒక్కోసారి ఇందులో కొన్ని పదార్థాలు అన్ని చర్మతత్వాల వారికి సరిపడకపోవచ్చు. తద్వారా అలర్జీల బారిన పడే అవకాశం ఉండచ్చు. కాబట్టి వీటిని వాడే ముందు ఓసారి మీరు తరచూ చెక్ చేయించుకునే డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్