నగరాల్లో గదులు అద్దెకిస్తూ.. కోట్లు సంపాదిస్తోంది!

పైచదువుల కోసం, ఉద్యోగ రీత్యా సిటీలకు వెళ్లినప్పుడు అక్కడ ఇల్లు అద్దెకు తీసుకోవడమో లేదంటే పేయింగ్‌ గెస్ట్‌గా ఉండడమో చేస్తుంటారు చాలామంది. అయితే ఈ క్రమంలో నెలల తరబడి అద్దెను అడ్వాన్స్‌డ్‌గా చెల్లించడం, నెలనెలా ఎక్కువ మొత్తంలో అద్దె కట్టాల్సి రావడంతో ఖర్చు తడిసి మోపెడవుతుంటుంది.

Updated : 05 Apr 2024 19:13 IST

(Photos: Instagram)

పైచదువుల కోసం, ఉద్యోగ రీత్యా సిటీలకు వెళ్లినప్పుడు అక్కడ ఇల్లు అద్దెకు తీసుకోవడమో లేదంటే పేయింగ్‌ గెస్ట్‌గా ఉండడమో చేస్తుంటారు చాలామంది. అయితే ఈ క్రమంలో నెలల తరబడి అద్దెను అడ్వాన్స్‌డ్‌గా చెల్లించడం, నెలనెలా ఎక్కువ మొత్తంలో అద్దె కట్టాల్సి రావడంతో ఖర్చు తడిసి మోపెడవుతుంటుంది. ఈ ఖర్చుల్ని భరించలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. వచ్చిన జీతంలో చాలావరకు అద్దెకే సరిపోతుందని బాధపడడం చూస్తుంటాం. అలాంటి వారికి తన స్టార్టప్‌తో పరిష్కార మార్గం చూపుతోంది స్నేహా ఛౌదరి. చవక ధరల్లోనే గదుల్ని, ఇళ్లను, అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్స్‌ని అద్దెకిస్తూ.. ఎంతోమందికి సమస్యలు లేని వసతి  సౌకర్యాన్ని అందిస్తోంది. ప్రస్తుతం సుమారు పది మహా నగరాల్లో సేవలందిస్తోన్న తన సంస్థ గురించి స్నేహ పంచుకున్న విశేషాలు మీకోసం..!

స్నేహది బెంగళూరు. ఐఐఎం-కోజికోడ్‌లో చదువు పూర్తిచేసి బంగారు పతకం అందుకున్న ఆమె.. పదేళ్ల పాటు ప్రముఖ కంపెనీల్లో ‘స్ట్రాటజీ అండ్‌ ఆపరేషన్స్‌ కన్సల్టెంట్‌’గా పనిచేసింది. భవిష్యత్తులో వ్యాపారవేత్తగా స్థిరపడాలని నిర్ణయించుకున్న ఆమె.. తొలుత కృత్రిమ మేధ ఆధారంగా చిన్నారుల్లో మానసిక పరిణతిని పెంచేందుకు ఓ ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌ను ప్రారంభించింది. అయితే అది అనుకున్నంత సక్సెస్‌ కాకపోయేసరికి ఆ వ్యాపారాన్ని మూసేయాల్సి వచ్చిందామె.

సోదరి అనుభవంతో..!

ఇలా వ్యాపారంలో తాను ఆశించిన ఫలితం రాకపోయినా నిరాశ చెందలేదు స్నేహ. మరో వ్యాపారం ప్రారంభించాలన్న అన్వేషణలో, ఆలోచనలో మునిగిపోయింది. ఈ సమయంలోనే తన సోదరి ఉద్యోగ రీత్యా మరో ప్రాంతానికి వెళ్లడంతో అక్కడ వసతి సదుపాయాలు వెతికే క్రమంలోనే తనకు మరో వ్యాపార ఆలోచన తట్టిందంటున్నారామె.

‘మా సోదరి ఉద్యోగ రీత్యా మరో పట్టణానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ వసతి సదుపాయాలు వెతికే క్రమంలో తనకు సహాయం చేద్దామని తనతో వెళ్లాను. ఈ క్రమంలోనే కొన్ని పేయింగ్‌ గెస్ట్‌ హౌసెస్, హాస్టల్స్‌ చూశాం. ఇక్కడ వసతి సదుపాయాల మాటెలా ఉన్నా.. నెలల కొద్దీ అడ్వాన్స్, నెలనెలా బోలెడంత అద్దె కట్టాలన్న విషయం మాత్రం స్పష్టమైంది. కాస్త లోతుగా పరిశీలిస్తే.. మన దేశంలో చదువు, ఉద్యోగ రీత్యా ఊళ్ల నుంచి నగరాలకు వలస వచ్చేవారు ఎక్కువమంది ఉన్నట్లు.. వాళ్లు ఇంత భారీ మొత్తంలో అద్దె కట్ట లేక ఇబ్బందులు పడుతున్నట్లు గ్రహించా. ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించాలనిపించింది. వ్యాపారమంటే మార్కెట్లో ఉన్న సమస్యను అర్థం చేసుకొని దానికి తక్షణ పరిష్కారం చూపించడంతో పాటు.. అది ఎంతోమంది జీవితాల్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేసేలా ఉండాలనేది నా ఆలోచన..’ అంటోన్న స్నేహ.. తన స్నేహితులు నిఖిల్‌ సిక్రి, అఖిల్‌ సిక్రితో కలిసి ‘జోలో స్టేస్‌’ అనే సంస్థను స్థాపించారు. ఆ తర్వాత తన కో-ఫౌండర్‌ నిఖిల్‌నే వివాహం చేసుకున్నారామె.

సకల సదుపాయాలతో..!

2015లో జోలో స్టేస్‌ ప్రారంభమైంది. కో-లివింగ్‌ సదుపాయాల్ని అందించే ఆన్‌లైన్‌ వేదిక ఇది. ఇందులో భాగంగా.. ఆయా మహానగరాల్లో తక్కువ ధరకే ఇళ్లను/అపార్ట్‌మెంట్లను, పేయింగ్‌ గెస్ట్‌ హౌసెస్‌ని అద్దెకిస్తూ.. చాలామందికి నాణ్యమైన, సౌకర్యవంతమైన వసతిని అందిస్తోంది స్నేహ. ఈ క్రమంలో ‘జోలో సెలక్ట్‌’ ప్రోగ్రామ్‌ కింద బిల్డర్స్‌ దగ్గర్నుంచి రెసిడెన్షియల్‌ టవర్స్‌ని లీజుకు తీసుకొని వాటిని సకల సదుపాయాలతో కూడిన అద్దె గృహాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఇక ‘జోలో స్టాండర్డ్‌’ కాన్సెప్ట్‌ కింద G+4, G+5 ఇండిపెండెంట్‌ ఇళ్లను లీజుకు తీసుకొని.. వాటిలో స్విమ్మింగ్‌ పూల్స్, టెన్నిస్‌ కోర్టు, క్లబ్.. వంటి సదుపాయాల్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెబుతున్నారు స్నేహ.

వాటికి మేం విరుద్ధం!

‘మా జోలో గదుల్ని అద్దెకు తీసుకునే వారికి కచ్చితంగా ఇన్ని రోజులు ఉండాలన్న నియమనిబంధనలేవీ మేం పెట్టట్లేదు. తమకు కావాల్సినప్పుడు రావచ్చు.. పని పూర్తి కాగానే వెళ్లిపోవచ్చు. అలాగే పెద్ద మొత్తంలో డిపాజిట్లు వసూలు చేయడం, మధ్యవర్తిత్వం.. వంటి వాటికీ మేం విరుద్ధం. అంతేకాదు.. మా సేవల్ని వినియోగించుకునే వారు ఒక సిటీ నుంచి మరో సిటీకి మారినప్పుడు వసతి రీత్యా ఇబ్బందులు పడకుండా.. అక్కడా వారికి వసతి సదుపాయాలు కల్పించడంలో తక్షణమే చొరవ చూపుతున్నాం. ఇక మేం అద్దెకిచ్చే గదుల్ని పూర్తి ఫర్నిషింగ్ చేయిస్తాం.. అలాగే ఆయా గదుల పరిశుభ్రత, నిర్వహణ, ఆహార సేవలు, వై-ఫై, డీటీహెచ్, ఏవైనా రిపేర్లొస్తే తక్షణమే స్పందించి చేయించడం.. వంటి సేవలన్నీ వినియోగదారులకు నిరంతరాయంగా అందేలా తగిన ఏర్పాట్లన్నీ చేశాం.. ఇక అద్దెకుండే వారి ఆహారపుటలవాట్లను దృష్టిలో ఉంచుకొని ఉత్తర, దక్షిణ భారత దేశపు వంటకాల్నీ అందిస్తున్నాం..’ అంటున్నారామె. ఇలా తమ సంస్థ ద్వారా అందరికీ సమస్యలు లేని వసతి  సౌకర్యాన్ని అందించడమే కాదు.. తమ జోలో కమ్యూనిటీలో ఉత్సాహం నింపడానికి అకేషనల్‌గా ‘జోలో ప్రిమియర్‌ లీగ్’, ‘చెస్’, ‘క్యారమ్స్’.. వంటి ఆటలతో పాటు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇతర పండగ సెలబ్రేషన్స్.. వంటివన్నీ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు స్నేహ.

10 సిటీలు.. 450 స్టేస్!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 మహానగరాల్లో జోలో స్టేస్‌ సేవలందిస్తున్నారు స్నేహ. ఈ క్రమంలో ఇప్పటికే బెంగళూరు, చెన్నై, కోటా, గురుగ్రామ్, హైదరాబాద్, పుణే, ముంబయి, నోయిడా, దిల్లీ, కోయంబత్తూరు.. తదితర సిటీల్లో దాదాపు 450కి పైగా జోలో నివాస స్థలాల్ని ఏర్పాటుచేశారామె. వీటి ద్వారా ఇప్పటికే సుమారు 50 వేల మందికి పైగా కస్టమర్లు లబ్ధి పొందారు. ప్రస్తుతం వెబ్‌సైట్‌తో పాటు యాప్‌ సేవల్నీ అందుబాటులో ఉంచిన ఆమె.. వినియోగదారులు ఈ వేదికగా తమ అద్దె ఇళ్లను సులభంగా బుక్‌ చేసుకొనే సౌలభ్యాన్ని కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా.. జోలో ప్రాపర్టీ బుక్‌ చేసుకోవాలంటే.. సంబంధిత వెబ్‌సైట్/యాప్‌లో ఉండాలనుకుంటోన్న ప్రాంతాన్ని సెలక్ట్‌ చేసుకోవాలి. కొంత మొత్తం చెల్లించి అక్కడి అద్దె గదిని / ఇంటిని బుక్‌ చేసుకోవచ్చు. ఆ అద్దె ఇంట్లోకి వెళ్లడానికి మూడు రోజుల ముందు ఓటీపీతో కూడిన రెంటల్‌ కన్మఫర్మేషన్‌ సందేశం వస్తుంది. ఆ ఓటీపీని జోలో ప్రాపర్టీ మేనేజర్‌కు పంపించడంతో రూమ్‌ బుక్‌ అయిపోతుంది. దేశంలోని ప్రముఖ పెట్టుబడి సంస్థల మద్దతుతో ఇప్పటివరకు కొన్ని వందల కోట్ల నిధులను సమకూర్చుకున్న ఈ సంస్థ.. ప్రస్తుతం సిరీస్-డి నిధుల్ని పొందే ప్రక్రియలో ఉంది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ. 500 కోట్ల ఆదాయం ఆర్జించడమే లక్ష్యంగా పెట్టుకుందీ సంస్థ.

మహిళల శాతం పెరగాలి!

‘మేం అందించే సేవల్లో వినియోగదారుల అవసరాలు, సౌకర్యాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నాం. మా సంస్థ ద్వారా డిజిటల్‌ లావాదేవీల్ని ప్రోత్సహిస్తూ వినియోగదారులతో మరింత పారదర్శకంగా వ్యవహరించేలా చర్యలు తీసుకుంటున్నాం. అయితే వ్యాపారం విషయానికొస్తే ఇప్పటికీ ఈ రంగంలో మహిళల శాతం తక్కువగానే ఉంది. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌లో రాణిస్తోన్న మహిళల సంఖ్యను వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. ఈ సమీకరణం మారాలంటే మరింతమంది మహిళలు పురుషాధిపత్యం ఉన్న ఇలాంటి వ్యాపారాల్ని తమ కెరీర్‌గా మలచుకోవాలి. అలాగే వ్యాపారంలో రాణించాలంటే.. సంబంధిత నైపుణ్యాల్ని మెరుగుపరచుకోవడంతో పాటు.. మన వ్యక్తిగత అభిరుచులకూ ప్రాధాన్యమివ్వాలి. ఇక ప్రాధాన్యతల్ని బట్టి ఆయా పనుల్ని విభజించుకుంటే వర్క్-లైఫ్‌ బ్యాలన్స్‌ చేయడం సులభమవుతుంది..’ అంటోన్న స్నేహ త్వరలో జోలో స్టేస్‌ వ్యాపారాన్ని విదేశాలకూ విస్తరించే ఆలోచన చేస్తున్నానంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్