Solo Travel: ఒంటరిగానే ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు..!

ఒకప్పుడు మహిళలు మగ తోడు లేకుండా బయటకు వెళ్లే వారు కాదు. కానీ, కాలం వేగంగా మారుతోంది. ప్రస్తుత రోజుల్లో చాలామంది మహిళలు ఒంటరిగా ప్రయాణాలు చేయడానికి సైతం వెనుకాడడం లేదు. ‘సోలో ట్రావెల్ సో బెటర్’ అంటూ చాలామంది వివిధ ప్రాంతాలను....

Published : 19 Jul 2022 12:28 IST

(Photos: Instagram)

ఒకప్పుడు మహిళలు మగ తోడు లేకుండా బయటకు వెళ్లే వారు కాదు. కానీ, కాలం వేగంగా మారుతోంది. ప్రస్తుత రోజుల్లో చాలామంది మహిళలు ఒంటరిగా ప్రయాణాలు చేయడానికి సైతం వెనుకాడడం లేదు. ‘సోలో ట్రావెల్ సో బెటర్’ అంటూ చాలామంది వివిధ ప్రాంతాలను ఒంటరిగానే  చుట్టేస్తున్నారు. కొంతమంది విదేశాలకు కూడా వెళ్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అంతేకాకుండా తమ పర్యటన విశేషాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఎంతోమందికి ఆయా ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు. వివిధ పర్యాటక ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక బ్లాగ్స్, వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు నిర్వహిస్తూ ఆదాయాన్నీ ఆర్జిస్తున్నారు. అభిమానులనూ సంపాదించుకుంటున్నారు. తోటి వారిలో ఎనలేని స్ఫూర్తిని నింపుతున్నారు. ఈ నలుగురూ కూడా ఇదే కోవకు చెందుతారు.

25 దేశాలు చుట్టొచ్చింది!

చాలామంది ఖాళీగా ఉన్నప్పుడో, ఒత్తిళ్ల నుంచి బయటపడి కాస్త విశ్రాంతి పొందడం కోసమో విహారయాత్రలకు వెళ్తుంటారు. కానీ, తనకు మాత్రం అలా కాదంటోంది ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన శివానీ సింగ్‌. ఆమె ఇంగ్లీష్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్. ఎంబీయేలో డబుల్‌ మాస్టర్స్‌ చేసింది. ఆ తర్వాత ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగం సంపాదించింది. పుట్టింది ఉత్తర్‌ప్రదేశ్‌లో అయినా 16 ఏళ్ల క్రితమే భాగ్యనగరానికి వచ్చి స్థిరపడింది. అయితే శివానీ తాను పని చేస్తున్న సంస్థ తరపున ఆఫీసు పని నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లింది. అలా ట్రావెలింగ్‌పై ఇష్టం పెంచుకుంది. ఈ క్రమంలోనే కొత్త వ్యక్తులను కలవడం, వారి సంప్రదాయాలను తెలుసుకోవడంపై మక్కువ పెంచుకుంది. ఒంటరిగానే వివిధ ప్రాంతాలను చుట్టేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ‘విమ్స్‌ దట్‌ వూ’ అనే ట్రావెల్‌ బ్లాగ్‌ని కూడా ప్రారంభించింది. తన ప్రయాణ విశేషాలను ఎప్పటికప్పుడు తన బ్లాగ్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే శివానీ ఇన్‌స్టాగ్రామ్‌లో 50 వేలకు పైగా అభిమానులను సొంతం చేసుకుంది. శివానీ ఇప్పటివరకు 25 దేశాలను సందర్శించింది. ఇంకా 170 దేశాలను చుట్టేయాలనుందని తన బ్లాగ్‌లో రాసుకొచ్చింది.


ప్రపంచమే ఇల్లుగా..

అర్థశాస్త్రంలో మాస్టర్స్‌ చేసిన కామ్య అకడమిక్స్‌లో మంచి విజయాలను అందుకుంది. అయినా జీవితంలో ఏదో కోల్పోతున్నాననే భావన ఆమెలో కలిగింది. దానిని అధిగమించడానికి ప్రపంచాన్ని అన్వేషించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత అందులోనే సంతోషాన్ని వెతుక్కుంది. ఇక అప్పటి నుంచి ఎన్నో ప్రాంతాలను సందర్శిస్తోంది. ఆధ్యాత్మికతను ఇష్టపడే కామ్య దేశంలోని ఎన్నో దేవాలయాలను సందర్శించింది. ప్రపంచమే తన ఇల్లు అనేట్టుగా ఇప్పటివరకు ఎన్నో దేశాలు తిరిగింది. ట్రావెలింగ్ ప్రారంభించిన దగ్గర్నుంచి ఆమె ఎప్పుడూ ఒక్కచోట ఉండలేదు. 2015 తర్వాత ఓసారి బాలిలో మాత్రం అత్యధికంగా 45 రోజులు గడిపింది. ఇక తన టూర్లకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకునే కామ్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు లక్షలకు పైగా అభిమానులు ఉన్నారు. ఈక్రమంలో ప్రయాణం అంటే తనను తాను ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచుకోవడం అంటుంది కామ్య.


పెప్పి ట్రావెల్‌ గర్ల్‌గా..

ముంబయికి చెందిన ప్రీతి ఎంబీయే మార్కెటింగ్‌ చేసి ప్రముఖ బ్యాంక్‌లో ఉద్యోగం సంపాదించింది. మంచి వేతనంతో సాఫీగా సాగుతున్న ప్రయాణంలో ఆమెకు ఏదో వెలితి కనిపించింది. దానిని దూరం చేసుకోవడానికి చిన్నప్పటి నుంచి ఇష్టమున్న రైటింగ్‌ను మొదలుపెట్టింది. అలా ‘పెప్పి ట్రావెల్‌ గర్ల్‌’ అనే ట్రావెల్‌ బ్లాగ్‌ను మొదలుపెట్టింది. దానికోసం వివిధ ప్రాంతాలను సందర్శించడం ప్రారంభించింది. అయితే ఒకవైపు ట్రావెలింగ్‌ చేస్తూ మరోవైపు ఉద్యోగం చేయడం కుదరదని భావించింది. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో పంచుకుంది. వారు కూడా తన ఆలోచనకు మద్దతు తెలపడంతో ఉద్యోగానికి స్వస్తి చెప్పి ప్రకృతిని ఆస్వాదించడం మొదలుపెట్టింది. అప్పటినుంచి వివిధ ప్రాంతాలు, దేశాలు తిరుగుతూ కొత్త కొత్త సంస్కృతులను తెలుసుకుంటోంది. వాటికి సంబంధించిన విషయాలను కూడా అంతే హృద్యంగా తన బ్లాగ్‌లో అక్షరీకరిస్తోంది. అలాగే తన టూర్లకు సంబంధించిన ఫొటోలను, ట్రావెల్ టిప్స్‌ని ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు లక్ష మంది ఫాలోవర్లు ఉన్నారు.


పేరును సాకారం చేసుకుంటోంది..

దిల్లీకి చెందిన ప్రకృతి వర్షిణి ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది. ఆమెకు పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. పేరులోనే ప్రకృతిని, వర్షాన్ని నింపుకొన్న ఆమె తన ఇష్టాన్ని సాకారం చేసుకోవడం కోసం ఉద్యోగాన్ని సైతం వదులుకుంది. ఆ తర్వాత మనాలీకి మకాం మార్చిన ఆమె ట్రెక్కింగ్‌ చేయడం మొదలుపెట్టింది. అలా ఆ ప్రాంతంలో ఉన్న వివిధ పర్వతాలను అధిరోహించింది. ప్రకృతి పదిహేనేళ్ల వయసులోనే ఎవరెస్ట్‌ ఎక్కాలని కలలు కంది. కానీ, ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకుంది. ఇటీవలే ఆ కలను కూడా సాకారం చేసుకుంది. పిరియడ్స్ సమయంలో మహిళలు పలు సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. కానీ, ప్రకృతి పిరియడ్స్‌ సమయంలోనే దాదాపు ఏడు వేల మీటర్ల ఎత్తున్న అమా దబ్లం (నేపాల్‌) పర్వతాన్ని అధిరోహించింది. ఇలా దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల్లోని పర్వతాలను ఒంటరిగానే ఎక్కేసింది. పర్వతారోహణ అంటే శారీరకంగా బలంగా ఉండాలి. అందుకోసం బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. కానీ, ప్రకృతి మాత్రం వీగన్‌ డైట్‌ని ఫాలో అవుతూనే కొండల్ని ఎక్కేస్తుంది. ఈ క్రమంలో నచ్చిన పని చేయడంలోనే సంతృప్తి ఉందని అంటోంది. తన యాత్రలకు సంబంధించిన వివరాలను ప్రకృతి ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటోంది. ఇలా ఇప్పటివరకు లక్షకు పైగా అభిమానులను సంపాదించుకుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్