Beyonce : ఆమె పాటకు ‘గ్రామీ’ పట్టాభిషేకం!

‘నే పాడితే లోకమే పాడదా.. నే ఆడితే లోకమే ఆడదా..’ అంటూ.. తన హుషారెత్తించే పాటలకు తోడు అదరగొట్టే స్టెప్పులతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సంగీతాభిమానుల్ని సంపాదించుకుంది అమెరికన్‌ పాప్‌ గాయని బియాన్స్‌ నోల్స్‌. చిన్న వయసు నుంచి పాటనే ప్రేమించి....

Updated : 07 Feb 2023 14:56 IST

(Photos: Instagram)

‘నే పాడితే లోకమే పాడదా.. నే ఆడితే లోకమే ఆడదా..’ అంటూ.. తన హుషారెత్తించే పాటలకు తోడు అదరగొట్టే స్టెప్పులతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సంగీతాభిమానుల్ని సంపాదించుకుంది అమెరికన్‌ పాప్‌ గాయని బియాన్స్‌ నోల్స్‌. చిన్న వయసు నుంచి పాటనే ప్రేమించి ఆరాధించిన ఆమె.. తన సింగింగ్‌ నైపుణ్యాలతో అనతి కాలంలోనే పాప్‌ క్వీన్‌గా ఎదిగింది. తన జీవితానుభవాల్నే పాటలుగా మలిచి సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ పాటల రారాణి తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సంగీత రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే గ్రామీ పురస్కారానికి ఎక్కువ సార్లు నామినేట్‌ అయిన గాయనిగా ఇప్పటికే రికార్డు సృష్టించిన బియాన్స్‌.. ఎక్కువ గ్రామీ అవార్డులు అందుకున్న సింగర్‌గా తాజాగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. తాజాగా నిర్వహించిన ఈ అవార్డుల వేడుకలో 32వ గ్రామీ పురస్కారం అందుకొని ఈ ఘనత సాధించింది ‘క్వీన్‌ బీ’. ఈ నేపథ్యంలో ఆమె జీవితంలోని కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!

సంగీతంపై మక్కువతో..!

బియాన్స్‌ పూర్తి పేరు బియాన్స్‌ గిసెల్లే నోల్స్‌ కార్టర్‌. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో జన్మించిన ఆమెకు చిన్న వయసు నుంచే సంగీతమంటే మక్కువ. ఈ ఇష్టంతోనే పెరిగి పెద్దయ్యే క్రమంలో పలు పాటల-నృత్య పోటీల్లో పాల్గొంది. 1990లో అమెరికాలోనే పేరు మోసిన ‘ఆర్‌ అండ్‌ బి గర్ల్‌ గ్రూప్‌-డెస్టినీస్‌ ఛైల్డ్‌’లో చేరిన ఆమె.. 2003లో ‘డేంజరెస్లీ ఇన్‌ లవ్‌’ అనే తొలి సోలో ఆల్బమ్‌ను విడుదల చేసింది. ఇది ‘యూఎస్‌ బిల్‌బోర్డ్‌ 200’ జాబితాలో చోటు సంపాదించింది. అంతేకాదు.. విడుదలైన వారం రోజుల్లోనే మూడు లక్షలకు పైగా కాపీలు అమ్ముడై.. తక్కువ సమయంలోనే ఎక్కువ కాపీలు అమ్ముడు పోయిన ఆల్బమ్‌గా నిలిచింది. ఆపై ‘క్రేజీ ఇన్‌ లవ్‌’, ‘బేబీ బాయ్‌’, ‘ఇర్రిప్లేసబుల్‌’, ‘బ్యూటిఫుల్‌ లయర్‌’.. వంటి ఆల్బమ్స్‌తో మరింత పాపులారిటీని సంపాదించుకుందామె. తన జీవితంలోని పలు అనుభవాలను రంగరించి ‘ఇఫ్‌ ఐ వర్‌ ఎ బాయ్‌’, ‘స్వీట్‌ డ్రీమ్స్‌’, ‘డ్రంక్‌ ఇన్‌ లవ్‌’, ‘డాడీ లెసన్స్‌’.. వంటి ఆల్బమ్స్‌నూ రూపొందించిందీ సింగింగ్‌ క్వీన్‌. కేవలం పాటలు పాడడమే కాదు.. ట్యూన్‌కు తగ్గట్లుగా స్టేజ్‌పై హుషారెత్తించేలా డ్యాన్స్‌ చేస్తూ ప్రేక్షకుల్ని ఓలలాడించడం ఈ ముద్దుగుమ్మ ప్రత్యేకత. అంతేనా.. పాటల రచయిత్రిగానూ ఆమెకు మంచి పేరుంది. మరోవైపు నటిగానూ తనను తాను నిరూపించుకుందీ పాప్‌ తార. ‘ది పింక్‌ పాంథర్‌’, ‘డ్రీమ్‌గర్ల్స్‌’, ‘అబ్‌సెస్‌డ్‌’, ‘ది లయన్‌ కింగ్‌’.. వంటి చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించింది.

అత్యధిక ‘గ్రామీ’లు ఆమెవే!

ఇలా రెండు దశాబ్దాలకు పైగా తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు, గుర్తింపులు సొంతం చేసుకున్న బియాన్స్‌.. సంగీత రంగంలోనే అత్యున్నతంగా భావించే ‘గ్రామీ’ పురస్కారం అందుకుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు 79 సార్లు ఈ అవార్డుకు నామినేట్‌ అయిన ఆమెకు ఇది 32వ గ్రామీ పురస్కారం. తద్వారా ఎక్కువసార్లు నామినేట్‌ అవడమే కాకుండా ఎక్కువ గ్రామీలు అందుకున్న సింగర్‌గా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుందీ పాప్‌ స్టార్‌. ‘RENAISSANCE’ అనే ఆల్బమ్‌కి గానూ ‘ఉత్తమ డ్యాన్స్‌/ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌’ కేటగిరీలో ఈ అవార్డు అందుకుంది బియాన్స్‌. ఇప్పటివరకు 31 గ్రామీ అవార్డులతో బుడాపెస్ట్‌కు చెందిన సంగీత కళాకారుడు జార్జ్‌ సోల్తీ ముందున్నారు. తాజా అవార్డుతో ఆయన్ని అధిగమించి సరికొత్త చరిత్రను లఖించిందీ సంగీత రారాణి. బియాన్స్‌ను తన ఫ్యాన్స్‌ ముద్దుగా ‘క్వీన్‌ బీ’ అని పిలుచుకుంటారు.

ఏడేళ్లకే గెలుపు రుచి!

బియాన్స్‌లో గాత్ర నైపుణ్యాల్ని ముందుగా గుర్తించింది ఆమె డ్యాన్స్‌ టీచర్‌ డార్లెట్టే జాన్సన్‌. ‘నేను హమ్‌ చేస్తే చాలు.. తాను పాట పూర్తిచేసేది.. ఎంతో అద్భుతంగా పాడేది.. చాలాసార్లు బియాన్స్‌ తల్లిదండ్రులతోనూ ఇదే మాట చెప్పా..’ అంటూ ఓ సందర్భంలో పంచుకున్న ఈ టీచర్‌.. ఆ తర్వాత్తర్వాత తన శిష్యురాలి ప్రతిభ, పాపులారిటీని చూసి మురిసిపోయేవారట! ఏడేళ్ల వయసులోనే తొలిసారి ఓ ట్యాలెంట్‌ షోలో పాల్గొని విజేతగా నిలిచిన బియాన్స్‌ ప్రతిభకు అక్కడున్న వారంతా నిల్చొని మరీ చప్పట్లు కొట్టారట! ‘ఇది నా జీవితంలోనే అమూల్యమైన క్షణం’ అంటూ ఓ కార్యక్రమంలో చెబుతూ ఎమోషనల్‌ అయిందీ ట్యాలెంటెడ్‌ సింగర్‌. అమెరికన్‌ ర్యాపర్‌, రికార్డ్‌ ప్రొడ్యూసర్‌ జే-జడ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది బియాన్స్‌. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. ఇక బియాన్స్‌, జే-జడ్‌.. వీరిద్దరూ కలిసి పలు వేదికలపైనా ప్రదర్శనలిచ్చారు.

అందుకే ‘4’ నా లక్కీ నంబర్‌!

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక లక్కీ నంబర్‌ ఉంటుంది. అలాగే తన విషయానికొస్తే.. ‘4’ తన లక్కీ నంబర్‌ అంటోంది బియాన్స్‌. దీని వెనుక ఓ పెద్ద కథే ఉందంటోంది. ‘చాలామంది తాము పుట్టిన తేదీని లక్కీగా భావిస్తారు. నా పుట్టిన రోజు సెప్టెంబర్‌ 4. ఇదనే కాదు.. నా భర్త జే-జడ్‌ పుట్టినరోజు డిసెంబర్‌ 4, మా పెళ్లి రోజు ఏప్రిల్‌ 4, అమ్మ బర్త్‌డే జనవరి 4.. నా కూతురి పేరులోనూ (Blue Ivy) రోమన్‌ సంఖ్య 4 కలిసేలా పెట్టుకున్నా. ఇలా ఈ సంఖ్యకు నా జీవితంలో ఓ ప్రత్యేక స్థానం అంది. అందుకే దీన్ని నా లక్కీ నంబర్‌గా భావిస్తా. అందుకే నేను, నా భర్త మా ఎడమచేతి ఉంగరపు వేళ్లపై 4 సంఖ్యను ట్యాటూగా వేయించుకున్నాం..’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ పాప్‌ తార.

డిప్రెషన్‌తో బాధపడ్డా!

కెరీర్‌లో ఎదిగే క్రమంలో ఎత్తుపల్లాలు సహజం. ఈ క్రమంలో ప్రతికూలతల్ని పాజిటివ్‌గా తీసుకున్నప్పుడే ముందుకెళ్లగలం. తన కెరీర్‌లోనూ ఒక దశలో డిప్రెషన్‌కి గురయ్యానని, స్వయంగా రియలైజ్‌ అవడం వల్ల ఆ దశ నుంచి బయటపడ్డానంటూ ఓ సందర్భంలో పంచుకుంది బియాన్స్‌. ‘నేను డెస్టినీస్‌ ఛైల్డ్‌ గ్రూప్‌లో చేరిన కొన్నాళ్లకు.. ఇందులో నుంచి ఇద్దరు బయటికి వెళ్లిపోయారు. దీనికి మూల కారణం నేనేనని చాలామంది నన్ను నిందించారు. ఆ సమయంలో చాలా బాధపడ్డా. గదిలో నన్ను నేను బంధించుకొని ఒంటరిగా ఫీలయ్యేదాన్ని. ఈ ఆందోళనతో సరిగ్గా ఆహారం తీసుకోకపోయేదాన్ని. ఎవరితోనూ మాట్లాడకపోయేదాన్ని. ఆ తర్వాత కొన్నాళ్లకు ‘నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నా’నంటూ స్వయంగా రియలైజ్ అయ్యా. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయంతో ఈ దశ నుంచి బయటపడగలిగా..’ అంటూ తన జీవితంలో తానెదుర్కొన్న ఓ కఠిన పరిస్థితి గురించి చెప్పుకొచ్చిందీ అమెరికన్‌ స్టార్‌.

 


ప్రెగ్నెన్సీతో ‘గిన్నిస్‌’ రికార్డ్‌!

పెళ్లి తర్వాత ఓసారి గర్భస్రావమయ్యాక తన కూతురు బ్లూ ఐవీకి జన్మనిచ్చిన బియాన్స్‌.. రెండోసారి గర్భం ధరించినప్పుడు.. ఈ మధుర క్షణాన్ని ప్రకటిస్తూ ఓ అందమైన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. దీనికి ఎనిమిది గంటల్లోపే 63 లక్షలకు పైగా లైక్స్‌ రావడంతో.. ‘ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది లైక్‌ చేసిన ఫొటో’గా గిన్నిస్ వరల్డ్‌ రికార్డ్‌ నెలకొల్పిందీ పాప్‌ తార.

బియాన్స్‌కు అన్ని రకాల పెర్‌ఫ్యూమ్స్‌ పడవట! అందుకే రసాయనాలు ఉపయోగించకుండా తయారుచేసే ఉత్పత్తుల్నే ఎంచుకునే ఆమె.. ఈ క్రమంలోనే ‘బియాన్స్‌ హీట్‌’ పేరుతో ఓ పెర్‌ఫ్యూమ్‌ బ్రాండ్‌ను కూడా నెలకొల్పింది. తద్వారా వ్యాపారవేత్తగానూ తనను తాను నిరూపించుకుంటోందీ ముద్దుగుమ్మ.

పిజ్జాలంటే ఈ పాప్‌ స్టార్‌ చెవికోసుకుంటుందట! పిజ్జా తిననిదే రోజు గడవదంటోన్న బియాన్స్‌.. ఛీజ్‌తో గార్నిష్‌ చేసిన పిజ్జాను మరింత ఇష్టంగా లాగించేస్తానంటోంది. అంతెందుకు.. 2013లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె.. పిజ్జా థీమ్‌తో రూపొందించిన అవుట్‌ఫిట్‌లో దర్శనమిచ్చి.. ఈ వంటకంపై తనకున్న మక్కువను చాటుకుంది.

ఈ పాప్‌ తారకు సామాజిక స్పృహా ఎక్కువే! ఈ క్రమంలోనే అమెరికాలోని సుమారు 37కి పైగా స్వచ్ఛంద సంస్థలతో కలిసి.. వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ప్రపంచంలోనే టాప్‌-10 అందగత్తెల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న బియాన్స్‌ పెంపుడు జంతువు ఫెండీ అనే కొండచిలువ. టీనేజ్‌లో ఉన్నప్పట్నుంచే దీన్ని పెంచుకుంటోందామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్