వీటితో ఆ నొప్పుల నుంచి ఉపశమనం!

నెలసరి దగ్గర్లో ఉందంటే చాలు.. చాలామంది మహిళల్లో ఏదో తెలియని నిరుత్సాహం, నిస్సత్తువ ఆవహిస్తుంటాయి. ఇందుకు కారణం ఆ సమయంలో తలెత్తే సమస్యలే! ముఖ్యంగా పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి, మూడ్ స్వింగ్స్.. ఇలాంటివన్నీ నెలనెలా పిరియడ్స్‌ సమయంలో మనం ఎదుర్కొనేవే!

Published : 30 May 2024 12:42 IST

నెలసరి దగ్గర్లో ఉందంటే చాలు.. చాలామంది మహిళల్లో ఏదో తెలియని నిరుత్సాహం, నిస్సత్తువ ఆవహిస్తుంటాయి. ఇందుకు కారణం ఆ సమయంలో తలెత్తే సమస్యలే! ముఖ్యంగా పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి, మూడ్ స్వింగ్స్.. ఇలాంటివన్నీ నెలనెలా పిరియడ్స్‌ సమయంలో మనం ఎదుర్కొనేవే! అయితే ఈ సమయంలో ఎదురయ్యే శారీరక నొప్పుల్ని, మానసిక సమస్యల్ని తగ్గించుకోవడానికి ఒక్కొక్కరూ ఒక్కో రకమైన చిట్కాను ఫాలో అవుతుంటారు. ఈ క్రమంలో కొందరు ఆహారంలో మార్పులు చేసుకుంటే.. మరికొందరు వ్యాయామాన్ని ఆశ్రయిస్తుంటారు.. ఇంకొందరు వారికి నచ్చిన పనులతో ఈ సమయంలో ఎదురయ్యే మూడ్‌ స్వింగ్స్‌ని అధిగమిస్తుంటారు. అయితే నెలసరి సమయంలో తలెత్తే శారీరక నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే మన వంటింట్లో లభించే కొన్ని ఆహార పదార్థాలను రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందామా...

ఈ పదార్థాలతో ఆ అసౌకర్యం దూరం..!

ఎన్నో ఔషధ గుణాలను నింపుకొన్న పదార్థాలు మన వంటింట్లో బోలెడున్నాయి. అవన్నీ ఆరోగ్యాన్ని అందించడమే కాదు.. నెలసరి నొప్పుల్ని కూడా దూరం చేస్తాయి. అయితే చాలామంది నెలసరి సమయంలో అసౌకర్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో కొన్ని సందర్భాల్లో పిరియడ్స్‌ రాకుండా మాత్రలు వేసుకోవడం వంటివి చేస్తుంటారు. మరికొందరు తాము తీసుకునే ఆహారంలో సూక్ష్మ పోషకాలు కొరవడడంతో కూడా శారీరక నొప్పుల బారిన పడుతున్నారు. మరి, వీటన్నింటికీ చెక్‌ పెట్టాలన్నా, నెలసరి అసౌకర్యాన్ని దూరం చేసుకోవాలన్నా ఈ పదార్థాలు అందుకు దోహదం చేస్తాయి.

పరగడుపున..

కుంకుమ పువ్వు, నల్ల ఎండు ద్రాక్ష.. ఈ రెండూ నెలసరి నొప్పుల్ని దూరం చేయడంలో సమర్థంగా పనిచేస్తాయి. ఇందుకోసం రెండు వేర్వేరు గిన్నెలు తీసుకొని ఒక దాంట్లో నాలుగైదు ఎండుద్రాక్షలు, మరొక దాంట్లో రెండు కుంకుమపువ్వు రెబ్బలు వేసి కొన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఇక మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత బ్రష్‌ చేసుకొని గ్లాసు నీళ్లు తాగి.. ఆ తర్వాత నానబెట్టిన ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వు తీసుకోవాలి. ఇలా పరగడుపునే వీటిని తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో ఎదురయ్యే నొప్పులు, మూడ్‌ స్వింగ్స్‌ని దూరం చేసుకోవచ్చు.. ఎండు ద్రాక్ష లోని ఐరన్‌, ఫైబర్‌, ఖనిజాలు ఇందుకు దోహదం చేస్తాయి. అలాగే రక్తహీనత, మలబద్ధకం.. వంటి సమస్యలకూ దూరంగా ఉండచ్చు.

దుంపలతో..

నెలసరి నొప్పుల్ని, ఆ సమయంలో ఎదురయ్యే అసౌకర్యాన్ని దూరం చేసుకోవాలంటే వారానికి మూడు నాలుగు రోజులు కొన్ని దుంప కూరలను తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. ముఖ్యంగా చేమ దుంప, చిలగడదుంప, బంగాళాదుంప.. వంటి దుంప జాతికి చెందిన కాయగూరలు ఈ సమయంలో నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటిలో ఫైబర్‌, పాలీఫినాల్స్‌.. వంటివి అధికంగా ఉంటాయి. అలాగే నెలసరి సమయంలో చాలామందిలో మొటిమలు, జుట్టు రాలిపోవడం.. వంటి సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టి చర్మ ఆరోగ్యాన్ని, జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలంటే దుంపలు కచ్చితంగా తీసుకోవాల్సిందే.

‘అరటి’ అన్ని రకాలుగా!

అరటిపండు నెలసరి నొప్పులకు అద్భుతమైన ఔషధంగా పని చేస్తుంది. సాయంత్రం పూట 4-6 గంటల మధ్యలో స్నాక్స్‌ సమయంలో దీన్ని తీసుకోవడం వల్ల రాత్రి పూట మితంగా ఆహారం తీసుకునే వీలుంటుంది. తద్వారా రాత్రుళ్లు హాయిగా నిద్ర కూడా పడుతుంది. శరీరంలో హార్మోన్లను సమతులంగా ఉంచుకోవడానికి ఇదీ ఓ ప్రక్రియే! అంతేకాదు.. సాయంత్రం పూట ఒక అరటిపండు తీసుకుంటే.. ఆకలిని తగ్గించే టీ, కాఫీ.. వంటి పానీయాలకు దూరంగా ఉండచ్చు.. స్నాక్స్‌ పేరుతో నూనె సంబంధిత పదార్థాలను తీసుకోకుండానూ జాగ్రత్తపడచ్చు. ఫైబర్‌, పొటాషియం, విటమిన్‌-బి.. వంటివి పుష్కలంగా లభించే ఈ పండు కడుపు ఉబ్బరం నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. దీన్ని పండు రూపంలోనే కాకుండా అరటి కాయ, అరటి పువ్వు రూపంలో కూడా తీసుకోవచ్చు. ఈ క్రమంలోనే అరటికాయతో సబ్జీ, చిప్స్‌.. ఇలా విభిన్న రకాల వంటకాలు చేసుకొని తీసుకోవచ్చు. అరటి పువ్వు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. హార్మోన్లను సమతులంగా ఉంచడంలో దీన్ని మించింది మరొకటి లేదంటే అది అతిశయోక్తి కాదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్