750 మందిపల్లె బాలికల కల...ఆజాదీశాట్‌-2

ఆకాశం హద్దులు దాటాలి! ఎల్లలెరుగని అంతరిక్షంలోకి అడుగుపెట్టాలి.. ఇలా ఆకాంక్షించే ఆడపిల్లల కలలకు రెక్కలు తొడిగిన ప్రయోగమిది!

Updated : 13 Feb 2023 07:14 IST

ఆకాశం హద్దులు దాటాలి! ఎల్లలెరుగని అంతరిక్షంలోకి అడుగుపెట్టాలి.. ఇలా ఆకాంక్షించే ఆడపిల్లల కలలకు రెక్కలు తొడిగిన ప్రయోగమిది! కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ.. 750 మంది అమ్మాయిలు కలిసి తయారుచేసిన జాదీశాట్‌-2  ఉపగ్రహ విజయం కోట్లమంది అమ్మాయిలని సైన్స్‌వైపు నడిపించే స్ఫూర్తిమంత్రంగా నిలిచింది. ఆరు నెలల పాటు సాగిన  ఈ క్రతువుని ముందుండి నడిపించారు స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా సీఈవో శ్రీమతి కేశన్‌...

అంతరిక్ష ప్రయోగాలంటే ఆసక్తీ, ఇష్టం ఉన్నా ఈ చదువు ఖరీదైన వ్యవహారం అనుకుంటాం. దాంతో అమ్మాయిలను అంతరిక్ష శాస్త్రవేత్తలుగా ఊహించే ప్రయత్నం కూడా చెయ్యం. ఈ భావనకు చెక్‌ పెట్టాలనుకున్నారు చెన్నైలో ‘స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా’ స్టార్టప్‌ని నిర్వహిస్తున్న శ్రీమతి కేశన్‌. చిన్న ఉపగ్రహాలు, వాటి డిజైన్లకి సంబంధించి పనిచేసే సంస్థ ఇది. ‘నేను కొవిడ్‌ బారిన పడి, ఇంటెన్సివ్‌ కార్డియాక్‌ కేర్‌ యూనిట్‌లో ఉన్నా. ఇంతలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్భంగా నావంతుగా ఏదో చేయాలని ఆసుపత్రిలోనే అనుకున్నా. ఆడపిల్లలంటే చాలా ఇష్టం. అవకాశం వస్తే.. వాళ్లని ఓ వేదికపై చేర్చాలని ఉండేది. ఆ కల ఆజాదీశాట్‌తో నిజమైంది’ అంటారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీమతి. ఐక్యరాజ్యసమితి కూడా ఈ ఏడాది అంతరిక్షంలో మహిళలు అనే థీమ్‌తో అమ్మాయిలని ఈ దిశగా ప్రోత్సహించాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ స్ఫూర్తితోనే శ్రీమతి ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

గ్రామీణ అమ్మాయిలతో...

ఆజాదీశాట్‌- 2 ఉపగ్రహం తయారీలో 750 మంది గ్రామీణ విద్యార్థినులు పాల్గొన్నారు. వీరంతా.. 8 నుంచి 12వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల పిల్లలు. సామాన్య గ్రామీణ ఆడపిల్లలకీ అంతరిక్ష ప్రయోగాలపై అవగాహన కల్పించాలన్నదే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు 75 ప్రభుత్వ పాఠశాలలు ఎంచుకొని ఒక్కోదాని నుంచీ పదిమంది బాలికల చొప్పున ప్రయోగానికి ఎంపిక చేసుకున్నారు. ‘ఉపగ్రహం తయారీ కోసం 2- 3 సెన్సార్లతో చిన్న బోర్డును రూపొందించి ఎంపిక చేసిన పాఠశాలలకు పంపాం. అప్పట్నుంచీ మూడు నెలలపాటు విద్యార్థినులకు ఆన్‌లైన్‌లో అవగాహన కల్పించాం. ఇందులో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, పంజాబీ, తదితర భాషలు మాట్లాడే విద్యార్థినులు ఉన్నారు. మాకన్ని భాషలూ తెలియనప్పటికీ కష్టపడి ఇష్టంతో ఈ పనిచేసి పూర్తి చేశాం. విద్యార్థినుల పర్యవేక్షణ బాధ్యతను ఆయా పాఠశాలలకు చెందిన సైన్సు టీచర్లకే అప్పగించాం. తయారీ సమయంలో.. సెన్సార్లు పనిచేయకుండా మొరాయించేవి. మధ్యలో పిల్లలకు పరీక్షలు జరుగుతుండటంతో చాలాసార్లు తరగతులను రద్దు చేశాం. అలా చాలా సవాళ్ల మధ్య ఆరు నెలల్లో ఆజాదీశాట్‌2ని తయారుచేశాం. రూ.86 లక్షల వరకు ఖర్చయ్యింది. ఈ మొత్తాన్ని హెక్సావేర్‌ సంస్థ అందిస్తే.. లుమినా డేటామాటిక్స్‌, అనంత్‌ టెక్నాలజీస్‌ సంస్థలూ మాకు సాంకేతిక సహకారం అందించాయి. గత శుక్రవారం భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి చిన్న ఉపగ్రహ వాహకనౌక(ఎస్‌ఎస్‌ఎల్‌వీ) రాకెట్‌ ద్వారా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టాం. అది అనుకున్న సమయానికి కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో అధిపతి డాక్టర్‌ సోమనాథ్‌ చెప్పగానే నాకూ, పిల్లల ఆనందానికీ అవధుల్లేవు. వాళ్లు రూపొందించిన ఉపగ్రహం కక్ష్యలోకి వెళ్లడంతో అమ్మాయిలంతా ఒకరినొకరు కౌగిలించుకుని, కేకులు పంచుకుని పండగ చేసుకున్నారు. పాటలు పాడుతూ, డ్యాన్స్‌లు చేశారు. ఈ ఆనందాన్ని చూడాలన్నదే నా కల కూడా. ఆడపిల్లలు మెడిసిన్‌, ఇంజినీరింగ్‌ అంటూ ఆ రంగాలవైపు ఆకర్షితులవుతున్నారు. అంతేకానీ రిస్క్‌ తీసుకుని అంతరిక్ష శాస్త్రవేత్తగా వెళ్లాలన్న ఆలోచన వారిలో రావడం లేదు. దీనిని గుర్తించే ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టా. ఇందులో భాగస్వాములైన బాలికల్లో కొందరైనా అంతరిక్ష రంగంపైపు ఆసక్తి చూపుతారన్న కోరిక’ అంటున్నారు శ్రీమతి.


లక్ష్యాలివి...

రేడియో కమ్యూనికేషన్‌ సామర్థ్యాలను ప్రదర్శించడానికీ, అంతరిక్షంలో రేడియేషన్‌ స్థాయులను కొలవడానికీ, ఆరోగ్య డేటాను తెలుసుకోవడానికీ... ఆజాదీశాట్‌-2 ఉపయోగపడుతుంది.

- కల్లిపూడి దేవేంద్రరెడ్డి, శ్రీహరికోట


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు...ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్