Menstrual Hygiene Day: మౌనమేలనోయి!

‘హుష్‌.. మెల్లగా’.. పీరియడ్‌ అన్న పదం పెదవి దాటగానే వచ్చే మాట ఇది! అమ్మాయిల్లో కనిపించే ఈ సహజ ప్రక్రియను తప్పుగా, దోషంగా చూసే వారే ఎక్కువ.

Updated : 28 May 2023 08:22 IST

‘హుష్‌.. మెల్లగా’.. పీరియడ్‌ అన్న పదం పెదవి దాటగానే వచ్చే మాట ఇది! అమ్మాయిల్లో కనిపించే ఈ సహజ ప్రక్రియను తప్పుగా, దోషంగా చూసే వారే ఎక్కువ. మరి ఈ విషయాన్ని చర్చించకపోతే అవగాహన పెరిగేదెలా? అందుకే, నోరు విప్పండి అంటున్నారు కొందరు. వాళ్ల స్వీయానుభవాలనే వివరిస్తూ మార్పుకీ ప్రయత్నిస్తున్నారు.. ‘రుతు పరిశుభ్రతా’ దినోత్సవం సందర్భంగా వారిని మీరూ కలుసుకోండి.


ఇంట్లోనే నేర్చుకోవాలి
- మిథిలా పాల్కర్‌

‘బోర్డు ఎగ్జామ్‌ రాస్తుండగా మొదటి నెలసరి! కంగారు పడ్డా కానీ.. తర్వాత నింపాదిగా పరీక్ష రాస్తూ వెళ్లా. పేపర్‌ ఇచ్చి బయటకు వస్తున్నప్పుడు ఎదురైన వింత చూపులు నాకిప్పటికీ గుర్తే. అయినా భయపడలేదంటే.. ఇది సహజమన్న స్పృహే కారణం. హార్మోన్లలో మార్పులు, ఆ సమయంలో కలిగే చిరాకు మొదలైనవన్నీ మా అక్కతో మాట్లాడే వీలు, చనువు ఉన్నాయి నాకు. అందువల్లే చెడ్డది, అపవిత్రం అన్న భావన నాకు మొదట్నుంచీ లేదు. నెలసరి ఇబ్బందిని ఇంట్లో మామూలు విషయంగానే మాట్లాడే చనువుంది. అబ్బాయైనా, అమ్మాయైనా చిన్నతనంలోనే వీటిపై ఇంట్లోనే అవగాహన కలిగించాలి. అప్పుడే బయటా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు’ అంటుంది మిథిలా పాల్కర్‌. యూనిసెఫ్‌ తరఫున నెలసరి శుభ్రతపై అవగాహనా కలిగిస్తోంది.


ఎందుకు వెనకడుగు వేయాలని
- స్మృతి ఇరానీ

రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు స్మృతి ఇరానీ. మోడలింగ్‌లోకి ప్రవేశించిన తొలిరోజుల్లో.. ‘పీరియడ్‌.. నువ్వు ఎదిగావు, తెలివితేటల్ని సంపాదించావు అని దేవుడు ఇచ్చే సూచన’ంటూ పాతికేళ్ల క్రితమే నెలసరిపై నిర్భయంగా కెమెరా ముందు మాట్లాడి ఆశ్చర్యపరిచారామె. ‘ఈ తరహా ప్రకటనల్లో నటించడానికి తారలు జంకేవారు. కెరియరే వదులుకోవాల్సి వస్తుందేమోనని భయపడేవారు. నాకా భయం లేదు. ఎందుకు నెలసరి గురించి మాట్లాడకూడదు అనే అనిపించింది. నెలసరి జాగ్రత్త.. దాని గురించి అందరికీ చెప్పాల్సిన అవసరముంది అనుకున్నా. అందుకే చేశా. ఇప్పటికీ అదే చెబుతా’ అంటారామె. పాతికేళ్ల క్రితం తను నటించిన ఈ ప్రకటనను ఇన్‌స్టా వేదికగా పంచుకోగా వైరలైంది కూడా.


గర్వంగా భావించా
- రాధిక ఆప్టే

మొదటి నెలసరి వచ్చే వరకూ ప్రతి అమ్మాయికీ అది రహస్యమే. కానీ వాళ్లమ్మ కారణంగా అది తనకు ముందే పరిచయమైంది అంటుంది రాధిక ఆప్టే. ‘నెలసరి ప్రారంభమవకముందే మా అమ్మ నన్ను సిద్ధం చేసింది. లక్షణాలతోపాటు.. ‘అది ప్రతిసృష్టికి చిహ్నం, కేవలం అమ్మాయికే దక్కే బాధ్యత’ని చెప్పింది. స్కూల్లో మొదటి పీరియడ్‌ మొదలైంది నాకు. అయినా భయపడలేదు. గర్వంగా భావించానంటే కారణం అమ్మ బోధనే. ఓసారి ఇంటికి రక్తపు మరకతో వెళితే నా స్థానంలో మా తమ్ముడు ఇబ్బంది పడటం గమనించి.. ‘ఇందులో సిగ్గుపడేదేముంది? దీని గురించి నువ్వూ తెలుసుకోవా’లని చెప్పింది. అలాంటి వాతావరణం ప్రతి ఇంట్లో ఉంటే ఎంత బాగుండు’అనే రాధిక.. ప్రకటనల్లో ప్యాడ్‌లపై నీలిరంగు చూపించే విధానానికి స్వస్తి పలికింది.


ఆ అనుభవం సాయపడింది
- దీపిక పదుకొణె

‘మా అమ్మ, నా స్నేహితురాలు దివ్య వాళ్లమ్మ ఇద్దరూ ఓ రోజు మమ్మల్ని పిలిచి ‘మీతో ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి’ అన్నారు. తర్వాత నా స్నేహితురాలి అమ్మ మమ్మల్ని ఇద్దరినీ కూర్చోబెట్టి.. పీరియడ్‌ అంటే ఏంటి? ఎందుకొస్తుంది? వచ్చినపుడు ఎలా ఉంటుంది? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి వంటివన్నీ మాట్లాడారు. ఆరోజును నేనెప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే మొత్తం సంభాషణలో మేం ఇబ్బంది లేదా భయపడిన క్షణమే లేదు. పైగా మొత్తం విన్నాక గౌరవం పెరిగింది. అందుకే నేను ఎదిగిన క్రమంలో దాన్ని ప్రత్యేకమైన రోజుగా గుర్తుంచుకుంటా. ఆమె మాకు అవగాహన కల్పించిన రీతిలోనే ప్రపంచానికీ దానిపై అవగాహన కలిగించాలనుకున్నా’ అనే దీపిక ఆ అమ్మల స్ఫూర్తితో భవిష్యత్తులో తన పిల్లలతోనూ చర్చిస్తానంటోంది. గత కేన్స్‌ ఉత్సవాల్లో ప్రపంచం ముందు తన ‘నెలసరి’ అనుభవాన్ని ఉంచి, దీన్నో తప్పుగా చూడొద్దంటూ కోరింది. స్కూలు కన్నా ముందు ఇంట్లోనే ఇది చర్చకు రావాలని చెబుతోంది దీపిక పదుకొణె.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్