Celebrity Fashion: అందమైన బ్యాగులు.. ఆకాశాన్నంటే ధరలు..!
వేడుకేదైనా పోటీపడి మరీ రడీ అయిపోతుంటారు మన తారలు. కేవలం దుస్తుల విషయంలోనే కాదు.. వాటికి మ్యాచింగ్‌గా ధరించే యాక్సెసరీస్ విషయంలోనూ ఫ్యాషన్ కోషెంట్ తగ్గకుండా జాగ్రత్తపడతారు. ఈ క్రమంలో వాటి కోసం లక్షలు....
(Photos: Instagram)
వేడుకేదైనా పోటీపడి మరీ రడీ అయిపోతుంటారు మన తారలు. కేవలం దుస్తుల విషయంలోనే కాదు.. వాటికి మ్యాచింగ్‌గా ధరించే యాక్సెసరీస్ విషయంలోనూ ఫ్యాషన్ కోషెంట్ తగ్గకుండా జాగ్రత్తపడతారు. ఈ క్రమంలో వాటి కోసం లక్షలు ఖర్చు పెట్టడానికీ వెనకాడరు. అంబానీ ప్రిన్సెస్ ఈషా అంబానీ కూడా ఇదే ఫ్యాషన్ ఫార్ములాను ఫాలో అయింది. ఇటీవలే జరిగిన ‘మెట్ గాలా’ ఈవెంట్లో పాల్గొన్న ఈ చక్కనమ్మ.. నలుపు రంగు శాటిన్ శారీ గౌన్‌లో మెరిసింది. ఇక తన అవుట్‌ఫిట్‌కు మ్యాచింగ్‌గా ఆమె ఎంచుకున్న డాల్ బ్యాగ్ గురించే ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. దేశీ బ్రైడ్‌ను పోలినట్లుగా ఉన్న ఈ బొమ్మ బ్యాగు అందానికి ముగ్ధులవడమే కాదు.. ధర చూసి అవాక్కవుతున్నారు కూడా! ఎందుకంటే దీని ధర అక్షరాలా పాతిక లక్షలట! ఈషా మాదిరిగానే.. గతంలోనూ పలు సందర్భాల్లో కొంతమంది ముద్దుగుమ్మలు ధరించిన ఖరీదైన బ్యాగులు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. మరి, వాటి గురించి తెలుసుకుందాం రండి..
బొమ్మ బ్యాగు.. అందం చూడు!
‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’గా పేరుతెచ్చుకుంది అంబానీ వారసురాలు ఈషా అంబానీ. ప్రతి వేడుకలోనూ ఫ్యాషనబుల్‌గా మెరిసిపోయే ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల జరిగిన మెట్ గాలా ఈవెంట్లోనూ అదరగొట్టింది. నేపాలీస్-అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ ప్రభల్ గురుంగ్ రూపొందించిన నలుపు రంగు శాటిన్-బ్లాక్ క్రేప్ శారీ గౌన్‌లో ముస్తాబైన ఈషా.. స్టేట్‌మెంట్ డైమండ్ జ్యుయలరీ, లేయర్డ్ నెక్లెస్‌తో మరింత గ్లామరస్‌గా కనిపించింది. ఇక ఆమె చేతిలో ఉన్న డాల్ బ్యాగ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఛానెల్ అనే ఫ్యాషన్ కంపెనీ విడుదల చేసిన ‘ప్యారిస్ బాంబే కలెక్షన్’ నుంచి ఈ యాక్సెసరీని ఎంచుకుంది ఈషా. మెరిసే బొట్టు, ముత్యాలతో రూపొందించిన పాపిడ బిళ్ల.. వంటి అదనపు హంగులద్ది.. అచ్చం భారతీయ బ్రైడ్‌ను పోలినట్లుగా ఉన్న ఈ బొమ్మను డిజైన్ చేశారు. ఇలా దీని అందం గురించే కాదు.. ధర గురించీ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తెగ చర్చిస్తున్నారు. కారణం.. దీని ధర రూ. 24 లక్షలకు పైమాటేనట! ఇలా తనదైన ఫ్యాషన్ సెన్స్‌ను ప్రదర్శించి.. మెట్ గాలా వేడుకలో మరోసారి మెరుపులు మెరిపించిందీ ఫ్యాషన్ క్వీన్.
గ్యాసోలిన్ పర్సు.. ప్రత్యేకత అదే!
విభిన్న ఫ్యాషన్లను తన వార్డ్‌రోబ్‌లో చేర్చుకోవడానికి ఉవ్విళ్లూరుతుంటుంది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. దుస్తుల దగ్గర్నుంచి యాక్సెసరీస్ దాకా.. అంతర్జాతీయ ఫ్యాషన్ మార్కెట్లో విడుదల చేసిన ప్రత్యేకమైన ఫ్యాషన్ పీసెస్‌ను తన సొంతం చేసుకోవడానికి ఎంతైనా ఖర్చు పెడుతుందీ బ్యూటీ. ‘ఛానల్ జెర్రీ క్యాన్ ప్లెక్సీగ్లాస్ బ్యాగ్’ కూడా అందులో ఒకటి. ఫ్రాన్స్‌కు చెందిన ఛానల్ ఫ్యాషన్ బ్రాండ్ రూపొందించిన ఈ పర్సును.. పారదర్శకంగా, గ్యాసోలిన్ క్యాన్ ఆకృతిలో తీర్చిదిద్దారు. బంగారం, రోజ్ గోల్డ్ మెటీరియల్స్‌తో రూపొందించిన చెయిన్, ఇరువైపులా ఉన్న బటన్స్ దీనికి అదనపు ఆకర్షణ. ఓ వేడుకలో తన ఊదా రంగు అవుట్‌ఫిట్‌కు మ్యాచింగ్‌గా ఈ బ్యాగ్‌ను ధరించి మెరిసిపోయిన ప్రియాంక.. అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ బ్యాగు ధర రూ. 8.24 లక్షలట! ఇదే కాదు.. ఇలాంటి ఖరీదైన విభిన్న బ్యాగులు ఈ ముద్దుగుమ్మ వార్డ్‌రోబ్‌లో బోలెడున్నాయట!
అరచేయంత బ్యాగు.. అరకోటి!
కొన్ని వస్తువులు చూడ్డానికి చిన్నగా ఉంటాయి.. కానీ వాటి ధర ఆకాశాన్నంటుతుంది. అంబానీ కుటుంబానికి కాబోయే చిన్న కోడలు రాధికా మర్చంట్ ఇటీవలే ధరించిన హ్యాండ్ క్లచ్ కూడా అదే కోవకు చెందుతుంది. ముకేశ్-నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీతో రాధిక నిశ్చితార్థం ఈమధ్యే జరిగిన సంగతి తెలిసిందే! అయితే ఇటీవలే NMACC ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆమె.. నలుపు రంగు ఇండో-వెస్ట్రన్ లేస్ శారీలో దర్శనమిచ్చింది. అవుట్‌ఫిట్‌కు జతగా సిల్వర్ కలర్ హ్యాండ్ క్లచ్ ధరించిన ఆమె.. తన లుక్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. ముఖ్యంగా ఆమె అరచేతిలో ఇమిడిపోయేంత చిన్నగా ఉన్న ఆ చిన్ని బ్యాగు ధర రూ. 52 లక్షలకు పైగానే ఉంటుందని తెలుసుకున్న ఫ్యాషన్ ప్రియులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అమెరికాకు చెందిన ‘హెర్మెస్’ అనే బ్యాగ్ బ్రాండ్ దీన్ని ‘హెర్మెస్ కెల్లీమార్ఫోస్ మినీ బ్యాగ్’ పేరుతో రూపొందించింది. దీనికి ఉన్న షార్ట్ స్ట్రాప్‌ను ఉపయోగించి చేత్తో పట్టుకోవచ్చు.. లేదంటే స్లింగ్ చెయిన్‌ను అనుసంధానించి భుజానికీ తగిలించుకోవచ్చు. ఇలా రాధిక స్టైలిష్ లుక్ చూసిన చాలామంది.. ‘అంబానీ కోడలా.. మజాకా!’ అంటూ ఈ ఫ్యాషన్ క్వీన్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు.
శాడిల్ బ్యాగ్‌తో.. స్టైలిష్‌గా..!
ఫ్యాషనబుల్ దుస్తులతోనే కాదు.. స్టైలిష్ యాక్సెసరీస్‌తోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది బాలీవుడ్ టాల్ బ్యూటీ కృతీ సనన్. మొన్నామధ్య ఓ సందర్భంలో ట్రెండీగా దర్శనమిచ్చిందీ ముద్దుగుమ్మ. హై-వెయిస్ట్ ఫ్లేర్‌డ్ ప్యాంట్స్, మ్యాచింగ్ క్రాప్‌టాప్ వేసుకున్న ఈ చక్కనమ్మ ధరించిన బ్యాగ్ కెమెరా కంటికి చిక్కింది. శాడిల్ బ్యాగ్‌గా పిలిచే దీన్ని డియోర్ కలెక్షన్ నుంచి ఎంచుకుంది కృతి. చేత్తో పట్టుకునేలా లేదంటే భుజానికి తగిలించుకునేలా.. ఇలా రెండు విధాలుగా రూపొందించిన ఈ బ్యాగ్ ఎలాంటి అవుట్‌ఫిట్‌కైనా అదనపు స్టైల్‌ను జోడిస్తుంది. ఇక ఈ బ్యాగ్ ధర రూ. 3 లక్షలకు పైగానే ఉంటుందంటున్నారు ఫ్యాషన్ నిపుణులు.
అట్టపెట్టె కాదు.. అందమైన బ్యాగు!
తన అరుదైన ఫ్యాషన్స్‌తో బాలీవుడ్ ఫ్యాషనిస్టాగా పేరుతెచ్చుకుంది సొగసరి సోనమ్ కపూర్. తాను ఎంచుకునే దుస్తులు ఎంత ఫ్యాషనబుల్‌గా ఉండాలని కోరుకుంటుందో.. తన యాక్సెసరీస్ కూడా అంతే ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తపడుతుందామె. అలా ఓ సందర్భంలో వింటేజ్ స్టైల్ బాక్స్ బ్యాగ్‌లో దర్శనమిచ్చిందామె. బ్యాంకాక్‌కు చెందిన S’uvimol అనే బ్యాగ్ కలెక్షన్ నుంచి ఎంచుకున్న ఈ నీలం రంగు బ్యాగ్ అంచుల్లో స్నేక్ ప్రింట్ దారంతో హంగులద్దారు. ఇలా మొత్తానికి చేత్తో అందంగా రూపొందించిన ఈ బ్యాగు ధర. లక్ష వరకు ఉంటుందట!
ఇది ‘శ్లోకా’ స్టైల్!
ప్రతి వేడుకలో తన ఫ్యాషన్స్‌తో ఆకట్టుకునే అంబానీ కోడలు శ్లోకా మెహతా.. ఓ ఈవెంట్లో వింటేజ్ స్టైల్ హ్యాండ్‌బ్యాగ్‌తో దర్శనమిచ్చింది. 90ల కాలం నాటి టేప్ రికార్డర్ స్టైల్‌ను పోలి ఉన్నట్లుగా రూపొందించిన ఈ బ్యాగ్‌ను అమెరికన్ లగ్జరీ బ్యాగ్ బ్రాండ్ జుదిత్ లైబెర్ నుంచి ఎంచుకుంది శ్లోక. ‘బూమ్‌బాక్స్ బ్రూక్లిన్ మూకీ పర్స్’గా పిలిచే ఈ హ్యాండ్ పర్స్‌పై.. రంగురంగుల రాళ్లతో హంగులద్దారు. ఇక ఈ వెరైటీ పర్స్ ధర రూ. 4.57 లక్షలకు పైమాటేనట!
వేడుకకు తగ్గట్లుగా.. క్లచ్!
వేడుకకు తగ్గట్లుగానే అటు సంప్రదాయబద్ధంగా, ఇటు స్టైలిష్‌గా మెరిసిపోతుంటారు ప్రముఖ వ్యాపారవేత్త నీతా అంబానీ. సంప్రదాయబద్ధంగా ముస్తాబైనప్పుడు యాక్సెసరీస్‌ని కూడా ట్రెడిషనల్‌గానే ఎంచుకుంటారామె. అలా నీతా వార్డ్‌రోబ్‌లో చేరింది ఈ వింటేజ్ ఎలిఫెంట్ క్లచ్. వినాయకుడి ప్రతిమ స్ఫూర్తితో అమెరికన్ బ్యాగ్ బ్రాండ్ జుదిత్ లైబెర్ ఈ హ్యాండ్ క్లచ్‌ను రూపొందించింది. మెటాలిక్ లెదర్, రంగురంగుల రాళ్లు, బంగారు వర్ణపు మెటీరియల్‌తో.. ప్రత్యేకంగా దీన్ని డిజైన్ చేయించుకుంది నీతా. ఉన్నత స్థాయిలో జరిగే ఈవెంట్లకు ఎక్కువగా ఈ పర్సును ఎంచుకునే ఆమె.. ఓసారి అలా ఓ సందర్భంలో ఈ పర్సుతో దర్శనమిచ్చింది. దాంతో ఇది అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక దీని ధర రూ. 2.46 లక్షలట!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.