Jamuna : ముక్కు మీద కోపం.. ఆమె నటనకే వన్నెతెచ్చింది!

రాజసం, వీరత్వం, అమాయకత్వం, అహంకారం.. ఇలా నటనలోని వైవిధ్యాలతో తెరపై పాత్రలకు ప్రాణం పోశారు అలనాటి నటీమణి జమున. సినీ చరిత్రపై ఆమెది చెరిగిపోని సంతకం! సుమారు మూడు దశాబ్దాలకు పైగా నట ప్రస్థానాన్ని కొనసాగించిన ఆమె.. ఎన్నో మరపురాని చిత్రాలకు....

Published : 27 Jan 2023 21:12 IST

రాజసం, వీరత్వం, అమాయకత్వం, అహంకారం.. ఇలా నటనలోని వైవిధ్యాలతో తెరపై పాత్రలకు ప్రాణం పోశారు అలనాటి నటీమణి జమున. సినీ చరిత్రపై ఆమెది చెరిగిపోని సంతకం! సుమారు మూడు దశాబ్దాలకు పైగా నట ప్రస్థానాన్ని కొనసాగించిన ఆమె.. ఎన్నో మరపురాని చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు. కొన్ని పాత్రలైతే తనకోసమే పుట్టాయేమో అన్నట్లుగా వాటిలో ఒదిగిపోయారామె. సత్యభామగా తెలుగువారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జమున దివికేగిన సందర్భంగా.. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి పలు సందర్భాల్లో ఆమె పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..!

ఎత్తుకొని తీసుకెళ్లమన్నా!

కర్ణాటకలోని హంపిలో జన్మించిన నన్ను.. ఆ రోజుల్లో చాలామంది హంపీ సుందరి అని పిలిచేవారు. చిన్న వయసు నుంచే నాకు కళాభిరుచి ఎక్కువ. స్కూల్లో చదువుకునేటప్పుడు డ్యాన్సులు, నాటకాల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. ఈ అనుభవమే నాకు ‘పుట్టిల్లు’ అనే సినిమాలో తొలి అవకాశం అందించింది. అయితే మా గురువు గారు జగ్గయ్య నన్ను ఓ నాటకం కోసం మండూరు తీసుకెళ్లారు. తెనాలి వరకు జట్కా బండిలో వెళ్లాం. అక్కడ్నుంచి పడవలో అవతలి ఒడ్డుకు దిగాక నన్ను నడిపించడం మొదలుపెట్టారు. అసలే పెంకి పిల్లను.. పైగా చిన్నతనం నుంచి గారాబంగా పెరిగా.. పొలాల గట్ల మీద నుంచి నడుస్తున్నప్పుడు ఒక చిన్న పాము కనిపించింది. అంతే.. ఇక నడవనని మొండికేశాను. కావాలంటే ఎత్తుకొని తీసుకెళ్లండి.. లేదంటే రానే రానని మారాం చేశా. ఆ జ్ఞాపకాలు తలచుకుంటే ఇప్పటికీ నవ్వొస్తుంటుంది.

అద్దం ముందు రిహార్సల్స్‌ చేశా!

ఆ రోజుల్లో ‘జమునంటే సత్యభామ.. సత్యభామ అంటే జమున’ అనే వారు. అంతలా పేరు తెచ్చిందీ పాత్ర. రాజసం, వీరత్వం, అమాయకత్వం, అహంకారం.. ఇలా అన్ని రకాల షేడ్స్‌ కలిగిన సత్యభామగా మూడు సినిమాల్లో నటించాను. మొదటిసారి ‘వినాయక చవితి’లో గర్వం, అమాయకత్వం కలగలిసిన సత్యభామగా నటించి మంచి పేరు తెచ్చుకున్నా. ఆ తర్వాత చేసిన ‘శ్రీకృష్ణ తులాభారం’ కోసం కాస్త కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే అదే సమయంలో హిందీలో మిలన్‌ (తెలుగులో మూగమనసులు) షూటింగ్‌కి కూడా హాజరవుతున్నా. పగలంతా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనడం.. రాత్రుళ్లు సత్యభామ పాత్ర కోసం ఇంట్లో రిహార్సల్స్‌ చేసేదాన్ని. అద్దం ముందు నిల్చొని పద్యాలు పాడుతూ సత్యభామగా నన్ను నేను ఊహించుకునేదాన్ని. ఇక మూడోసారి ‘శ్రీకృష్ణ విజయం’లో నటించాను. ఒక్కో పాత్రకు నటనలో పరిణతి ప్రదర్శిస్తూ చేసిన ఈ మూడు పాత్రలు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

ఆ నాలుగేళ్లూ నిరాశ పడలేదు!

పెద్ద హీరోల పక్కనే నటించాలని నేనెప్పుడూ నియమం పెట్టుకోలేదు. పాత్రలకే ఎక్కువగా ప్రాధాన్యమిచ్చేదాన్ని. అందుకేనేమో ఎక్కువ కాలం పాటు ఈ పరిశ్రమలో కొనసాగే అదృష్టం నన్ను వరించింది. అయితే జీవితంలో సుఖదుఃఖాలున్నట్లే.. కెరీర్‌లోనూ ఎత్తుపల్లాలుంటాయి. నా సినీ జీవితంలోనూ అలాంటి పలు ఘటనలున్నాయి. ఓ దశలో అగ్ర కథానాయకులిద్దరూ నాతో నటించకూడదని భీష్మించుక్కూర్చున్నారు. అయినా ఓ హీరోయిన్‌గా నేను ఏనాడూ నిరాశ పడలేదు.  నిజానికి ఈ నాలుగేళ్లు నా నటనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే అవకాశం నాకు దొరికింది. కొంతమంది నిర్మాతలు నన్ను హీరోయిన్‌గా పెట్టి మహిళా ప్రాధాన్య చిత్రాలు తీశారు.. మరికొన్ని సార్లు కొత్తగా వచ్చిన హీరోల సరసన నటించాల్సి వచ్చింది. అలా నేను చేసిన ‘లేత మనసులు’, ‘పాల మనసులు’, ‘పెళ్లి తాంబూలం’.. వంటి చిత్రాలు నాకు మరిన్ని విజయాలు అందించాయి.

పెళ్లయ్యాక అందం పెరిగింది!

ఇప్పుడే కాదు.. పెళ్లయ్యాక సినిమా తారలకు కెరీర్‌ ఉండదని, లావెక్కిపోతారని, అందం తగ్గిపోతుందని అప్పట్లో కూడా ఒక రూమర్‌ ఉండేది. కానీ నా విషయంలో మాత్రం అలా జరగలేదు. ఇంకా చెప్పాలంటే పెళ్లయ్యాక నా అందం రెట్టింపైందనే వారు. ఈ క్రమంలోనే పెళ్లయ్యాక నేను నటించిన ‘శ్రీకృష్ణ తులాభారం’, పిల్లలు పుట్టాక ‘శ్రీకృష్ణ విజయం’.. వంటి చిత్రాలు నాకు మరపురాని విజయాలను తెచ్చిపెట్టాయి.


అమ్మతో జ్ఞాపకాలు ప్రత్యేకం!

తెరపైనే కాదు.. నిజ జీవితంలోనూ ఎంతో సరదాగా, యాక్టివ్‌గా ఉండేవారు జమున. తాను నటించిన సినిమాల్లోని పాత్రల్ని, సన్నివేశాల్ని తమకు చేసి చూపిస్తూ ఎంతో ఆనందించేవారని ఆమె కూతురు స్రవంతి ఓ సందర్భంలో పంచుకున్నారు. ఇలా తన తల్లి జ్ఞాపకాల్ని ఎప్పటికప్పుడు వీడియోల రూపంలో బంధిస్తూ సోషల్‌ మీడియాలో పంచుకునేవారు స్రవంతి. అలా మొన్నామధ్య ‘మిస్సమ్మ’ సినిమాలో ‘బాలనురా మదనా’ అనే పాటను అనుకరిస్తూ సరదాగా డ్యాన్స్‌ చేస్తోన్న తన తల్లి నాట్యాన్ని వీడియోలో బంధించిన స్రవంతి.. దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ‘84 ఏళ్ల వయసులోనూ అమ్మ ఇంత ఎనర్జిటిక్‌గా ఉండడం చూస్తుంటే ముచ్చటేస్తుంది. తనతో సమయం గడపడం నాకెంతో ప్రత్యేకం. తన నటనతో ఎంతోమందికి వినోదాన్ని పంచిన అమ్మ.. తన సినిమాలు తాను చూస్తూ.. నచ్చిన సన్నివేశాల్ని, పాటలు-డ్యాన్సుల్ని అనుకరిస్తూ ఇలా మాకూ సరదాను పంచుతున్నారు..’ అంటూ చెప్పుకొచ్చారామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్