‘నన్ను ఓడిస్తే పెళ్లి చేసుకుంటా’ నంటూ మట్టి కరిపించేది!

రెజ్లింగ్‌.. ఇప్పటికీ మన దేశంలో చాలాచోట్ల ఇది పురుషాధిపత్యం ఉన్న క్రీడే! అలాంటిది 1940-50 కాలం నాటి పరిస్థితులు ఎలా ఉండేవో మనం ఊహించుకోగలం. అమ్మాయిలు మల్లయుద్ధాన్ని ఎంచుకోవడం కాదు.. కనీసం ఈ ఆలోచన చేసినా ఏదో నేరం చేసినట్లుగా భావించేది అప్పటి సమాజం.

Published : 04 May 2024 20:41 IST

(Photos: Twitter)

రెజ్లింగ్‌.. ఇప్పటికీ మన దేశంలో చాలాచోట్ల ఇది పురుషాధిపత్యం ఉన్న క్రీడే! అలాంటిది 1940-50 కాలం నాటి పరిస్థితులు ఎలా ఉండేవో మనం ఊహించుకోగలం. అమ్మాయిలు మల్లయుద్ధాన్ని ఎంచుకోవడం కాదు.. కనీసం ఈ ఆలోచన చేసినా ఏదో నేరం చేసినట్లుగా భావించేది అప్పటి సమాజం. అలాంటి మూసధోరణుల్ని, కట్టుబాట్లను బద్దలుకొట్టి.. రెజ్లింగ్‌ క్రీడను ఎంచుకున్నారు హమీదా బాను. తద్వారా ‘భారత తొలి మహిళా ప్రొఫెషనల్‌ రెజ్లర్‌’గా కీర్తి పుటల్లో నిలిచిపోయారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎంతోమంది పురుష రెజ్లర్లను మట్టి కరిపించిన ఘనతను సొంతం చేసుకున్న ఆమె.. ఈ క్రీడలో భారతీయ మహిళలందరికీ మార్గదర్శకురాలయ్యారు. ఆటలోనే కాదు.. నిజ జీవితంలోనూ డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ ఉమన్‌గా పేరు తెచ్చుకున్న ఈ మహిళా రెజ్లర్‌కు నివాళిగా నేడు గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌ రూపొందించింది. ఈ నేపథ్యంలో ఈ రెజ్లింగ్‌ క్వీన్ గురించి తెలుసుకుందాం..

1900లో ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో పుట్టారు హమీదా. ఆమెది రెజ్లింగ్‌ నేపథ్యమున్న కుటుంబం. ఈ స్ఫూర్తితోనే తానూ ఈ క్రీడనే కెరీర్‌గా ఎంచుకోవాలనుకున్నారు. కానీ పురుషాధిపత్యం, సామాజిక కట్టుబాట్లు ఇందుకు అడ్డుపడాలని చూశాయి. అయినా ఇవేవీ పట్టించుకోకుండా తన మనసు మాటే విన్నారు హమీదా. ఆ రోజుల్లో మహిళా రెజ్లర్లు ఎవరూ లేకపోయేసరికి.. శిక్షణ సమయంలో పురుష రెజ్లర్లతోనే కుస్తీ పట్టేవారు. 1940ల్లో రెజ్లర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆమె.. ‘భారత తొలి మహిళా ప్రొఫెషనల్‌ రెజ్లర్‌’గా చరిత్రకెక్కారు.

నన్ను ఓడిస్తే పెళ్లి చేసుకుంటా!

1940-50 వరకు సుమారు దశాబ్ద కాలం పాటు తన రెజ్లింగ్‌ కెరీర్‌ను కొనసాగించారు హమీదా. ఈ క్రమంలో స్త్రీపురుష ప్రత్యర్థులతో కలుపుకొని దాదాపు 300ల పైచిలుకు కాంపిటీషన్స్‌లో పోటీపడ్డారామె. ప్రత్యర్థి ఎవరైనా, ఎంత సమర్థులైనా సరే.. నిమిషాల్లోనే మట్టి కరిపించేవారు హమీదా. ఇక పురుష ప్రత్యర్థులకు.. ‘తనను తొలి బౌట్‌లోనే ఓడించిన వారిని పెళ్లాడతా’నంటూ సవాల్‌ విసిరేవారామె. ఆమె ఛాలెంజ్‌ను స్వీకరించి పాటియాలా, కోల్‌కతా నుంచి ఇద్దరు పురుష ఛాంపియన్లు ఆమెతో పోటీపడి ఓడిపోయారు. దేశీయ ఛాంపియన్లతోనే కాదు.. అంతర్జాతీయంగానూ ఎంతోమంది రెజ్లర్లతో పోటీ పడ్డారు హమీదా. రష్యా ‘ఫీమేల్‌ బియర్‌’గా పేరొందిన వెరా ఛిస్లిన్‌ అనే రెజ్లర్‌ను రెండు నిమిషాల్లోనే ఓడించారామె. దాంతో హమీదా పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. కొన్నేళ్ల పాటు ఆమె పేరు వార్తాపత్రికల్లో హెడ్‌లైన్లలో వచ్చింది. ఇలా తనదైన ఆటతీరుతోనే విమర్శకుల నోళ్లు మూయించిన ఈ మహిళా రెజ్లర్‌ ‘అమెజాన్‌ ఆఫ్‌ అలీగఢ్‌’గానూ గుర్తింపు పొందారు.

అదే ఈ రోజు ప్రత్యేకత!

రెజ్లింగ్‌ పోటీల్లో భాగంగా 1954, మే 4న ప్రముఖ పురుష రెజ్లర్‌ బాబా పహిల్వాన్‌తో పోటీ పడ్డారు హమీదా. కేవలం ఒకటిన్నర నిమిషంలోనే అతడిని మట్టి కరిపించి.. తనకెదురులేదనిపించారు. ఈ పోటీ తర్వాత బాబా పహిల్వాన్‌ తన కెరీర్‌కు ముగింపు పలికారు. ఇలా ఈ రోజు హమీదా కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఆమెకు మరింతగా గుర్తింపు తెచ్చిపెట్టిన ఈ రోజును పురస్కరించుకొని.. తన ఫొటోతో కూడిన డూడుల్‌ని రూపొందించింది గూగుల్‌ సంస్థ. బెంగళూరుకు చెందిన విజువల్‌ డిజైనర్‌, ఇలస్ట్రేటర్‌ దివ్యా నేగి ఈ డూడుల్‌ని రూపొందించారు. ఈ పోటీలో ఆమె ధరించిన పోల్కా డాట్‌ డ్రస్‌ను ప్రతిబింబించేలా దీన్ని తీర్చిదిద్దారామె.

కోచ్‌ చేతిలో చిత్రహింసలు!

అయితే రష్యా క్రీడాకారిణి వెరా ఛిస్లిన్‌ను ఓడించాక.. షెడ్యూల్‌ ప్రకారం హమీదా యూరప్‌కెళ్లి అక్కడి రెజ్లర్లతో పోటీ పడాల్సింది. కానీ అలా జరగలేదు. అదే సమయంలో తానెంతో ప్రేమించిన తన కోచ్‌ సలామ్‌ పహిల్వాన్‌ చేతిలో చిత్రహింసలు ఎదుర్కొన్నట్లు ఆమె మనవడు (దత్త పుత్రుడి కొడుకు) ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఆపై క్రమంగా ఆటకు దూరమైన ఆమె.. తన చివరి రోజుల్లో అష్టకష్టాలు ఎదుర్కొన్నారట! ఒకానొక దశలో చేతిలో డబ్బు లేక.. పాలు, తినుబండారాలు వంటివి అమ్ముతూ జీవనం సాగించారట హమీదా. ఇలా తన రెజ్లింగ్‌ క్రీడతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని.. ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచిన ‘అమెజాన్‌ ఆఫ్‌ అలీగఢ్‌’ 1986లో కన్నుమూశారు.


ఆమె కండల వెనుక..!

తన క్రీడా నైపుణ్యాలతోనే కాదు.. తన ఆహార్యంతోనూ ఆకట్టుకునేవారు హమీదా. 5’3’’ అడుగులతో, 108 కిలోల బరువు, దృఢమైన శరీరాకృతితో కనిపించే ఆమె.. తాను పాటించే ఆహార నియమాలతోనూ తరచూ వార్తల్లో నిలిచేవారు. రోజూ సుమారు ౬ లీటర్ల పాలు, 3 లీటర్ల సూప్, 2 లీటర్ల పండ్ల రసాలు, కిలో మటన్‌, బాదం పప్పులు, అరకిలో బటర్‌, ఆరు గుడ్లు, రెండు పెద్ద పెద్ద బ్రెడ్‌ ముక్కలు, రెండు ప్లేట్ల బిర్యానీ.. తీసుకునేవారట హమీదా. రోజుకు ఆరు గంటల పాటు రెజ్లింగ్‌ సాధన చేసే ఆమె.. తొమ్మిది గంటలు నిద్రపోయేవారట! ఇలా కండలు తిరిగిన శరీరంతో పోటీకి ముందే ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించేవారీ రెజ్లింగ్‌ క్వీన్‌. హమీదా వ్యక్తిగత జీవితం, కెరీర్‌లోని పలు కీలక అంశాల్ని స్పృశిస్తూ 1987లో రచయిత మహేశ్వర్‌ దయాల్‌ ఓ పుస్తకం కూడా రాశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్