Draupadi Murmu: ఆ అయిదేళ్లూ ఎంతో మానసిక క్షోభను అనుభవించా..!

కటిక పేదరికం తాండవించే ఓ మారుమూల గిరిజన కుటుంబంలో పుట్టిందామె. ఆడపిల్లలపై ఆంక్షలు, ఆర్థిక స్థోమత.. ఈ రెండూ ఆమె చదువుకు అడ్డుపడాలని చూశాయి. అయినా వాటికి ఎదురీది ఉన్నత విద్యనభ్యసించింది. సవాళ్లతో సహవాసం చేస్తూనే సాంత్వన పొందడానికి....

Published : 22 Jul 2022 14:39 IST

(Photo: Twitter)

కటిక పేదరికం తాండవించే ఓ మారుమూల గిరిజన కుటుంబంలో పుట్టిందామె. ఆడపిల్లలపై ఆంక్షలు, ఆర్థిక స్థోమత.. ఈ రెండూ ఆమె చదువుకు అడ్డుపడాలని చూశాయి. అయినా వాటికి ఎదురీది ఉన్నత విద్యనభ్యసించింది. సవాళ్లతో సహవాసం చేస్తూనే సాంత్వన పొందడానికి సమాజ సేవను ఎంచుకుంది. రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజల మనిషిగా మన్ననలందుకుంది. ఈ నిరాడంబరమైన వ్యక్తిత్వమే ఇప్పుడు ఆమెకు దేశ అత్యున్నత హోదా కట్టబెట్టింది. ఒక సాధారణ రాజకీయ నాయకురాలిగా జీవితాన్ని ప్రారంభించి.. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ద్రౌపది ముర్ము జీవితంలోని ప్రతి దశ ఓ సవాలే!

తాజా గెలుపుతో భారత రెండో మహిళా రాష్ట్రపతిగా అవతరించిన ముర్ము.. ఈ అత్యున్నత పదవిని అధిరోహించనున్న తొలి గిరిజన మహిళగా, అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక జన్మించి, రాష్ట్రపతిగా పదవి చేపట్టనున్న తొలి వ్యక్తిగానూ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారామె. ఈ నేపథ్యంలో టీచర్‌గా మొదలైన ఆమె కెరీర్‌ ప్రస్థానం.. దేశ ప్రథమ మహిళ స్థాయికి ఎలా చేరిందో తెలుసుకుందాం రండి..

ఆడపిల్లలపై ఆంక్షలెన్నో!

ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలోని ఉపర్‌బెడ గ్రామంలో 1958, జూన్‌ 20న జన్మించారు ముర్ము. వీరి కుటుంబం సంతాల్ అనే గిరిజన తెగకు చెందింది. సాధారణంగా గిరిజన గ్రామమంటేనే కనీస వసతులు కూడా ఉండవు! సంతాల్‌ తెగలోనూ అలాంటి దుస్థితే! కటిక పేదరికానికి తోడు.. కరెంట్‌కు కూడా నోచుకోని గ్రామమది. అలాంటి ఓ కుటుంబంలో పుట్టి చదువుకోవాలని కలలు కన్నారామె. వసతులే కాదు.. ఇక్కడ ఆడపిల్లలపై వివక్షా ఎక్కువే! మగవారిలా గడప దాటకూడదని, ఇంటి పట్టునే ఉంటూ వంటింటికే పరిమితమవ్వాలని.. ఇలా ఇక్కడి అమ్మాయిల అభివృద్ధికి ఎన్నో ఆంక్షలు అడ్డుపడేవి. అయితే ఇలాంటి కట్టుబాట్లను కాదని, ఆర్థిక కష్టాలను ఎదుర్కొని చదువు కొనసాగించారామె. ఈ క్రమంలోనే భువనేశ్వర్‌లోని రమాదేవి విమెన్స్‌ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసి.. తన కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడేందుకు టీచర్‌గా కెరీర్‌ ప్రారంభించారు ముర్ము.

సేవతో మెప్పించి..!

కెరీర్‌లో స్థిరపడక ముందే శ్యామ్‌ చరణ్‌ ముర్మును వివాహం చేసుకున్నారు ముర్ము. ఈ జంటకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు సంతానం. అయితే ఓవైపు టీచర్‌గా పనిచేస్తూనే, మరోవైపు సమాజ సేవ పైనా దృష్టి సారించారు.
‘నాకు సమాజ సేవ చేయడమంటే చిన్న వయసు నుంచే ఇష్టం. బహుశా నేను పెరిగిన ప్రతికూల పరిస్థితులే నాకు దీనిపై మక్కువ పెంచాయేమో అనిపిస్తుంటుంది. పిల్లలు పెద్దయ్యే కొద్దీ కుటుంబ బాధ్యతల నుంచి నాకు కాస్త విరామం దొరికేది. ఈ సమయాన్ని సమాజ సేవ కోసం వినియోగించేదాన్ని. ఓవైపు వృత్తిలో కొనసాగుతూనే.. మరోవైపు స్వచ్ఛంద సంస్థలతో కలిసి మారుమూల గ్రామాల అభివృద్ధికి పాటుపడేదాన్ని. రాజకీయాల్లోకి వస్తే ఈ సేవల్ని మరింత విస్తరించే అవకాశం దొరుకుతుందనిపించింది. అయితే నేను మహిళనన్న కారణంతో ఇక్కడా కొంతమంది అడ్డుపడాలని చూశారు. కానీ చాలామంది నాకు మద్దతుగా నిలిచారు..’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు ముర్ము. ఇలా తన సేవా నిరతితో ప్రజల మద్దతును కూడగట్టుకున్న ఆమె.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. 2000లో భాజపా తరఫున రాయ్‌రంగ్‌పుర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

కుంగుబాటు నుంచి బయటపడి..!

ఈ పదవిలో రెండు పర్యాయాలు పనిచేసిన ముర్ము.. భాజపా-బిజద సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పలు శాఖల్లో సేవలందించారు. 2015-21 వరకు జార్ఖండ్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తద్వారా ఆ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా ఘనత సాధించారామె. అయితే 2009-2014 వరకు తన జీవితంలో అత్యంత ప్రతికూల సమయాన్ని ఎదుర్కొన్నానని చెబుతారు ముర్ము.

‘ఈ ఐదేళ్ల కాలంలో నా భర్త, ఇద్దరు కొడుకులు నాకు శాశ్వతంగా దూరమయ్యారు. ఈ క్రమంలో ఎంతో మానసిక క్షోభను అనుభవించా.. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపా.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. ఇక జీవితం వ్యర్థం అనుకునే దశలో బ్రహ్మకుమారీలను కలిశాను. వారి ప్రేరణతోనే యోగా, ధ్యానం అలవాటు చేసుకున్నా.. ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకున్నా. నిపుణుల వద్ద కౌన్సెలింగ్‌ తీసుకున్నా. అలాగే సమాజ సేవనూ కొనసాగించా.. ఇవే నేను తిరిగి పునర్జన్మ ఎత్తేలా చేశాయి..’ అంటూ తన జీవితంలోని గడ్డు పరిస్థితుల గురించి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారామె. ప్రస్తుతం ఆమె కూతురు ఇతిశ్రీ ముర్ము పెళ్లి చేసుకొని భువనేశ్వర్‌లో స్థిరపడ్డారు.

ఊహకందని సంతోషమిది!

* రాజకీయ నాయకురాలిగా ప్రజల మన్ననలందుకున్న ముర్ము.. 2007లో ఒడిశా శాసన సభ నుంచి ‘ఉత్తమ ఎమ్మెల్యే’గా గుర్తింపు పొందారు.

* గతేడాది జార్ఖండ్‌ గవర్నర్‌గా పదవీ కాలం పూర్తైనప్పట్నుంచి సమాజ సేవపై మరింత దృష్టి పెట్టారామె. ఈ క్రమంలో గిరిజనుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు.

* నిరుపేద కుటుంబం నుంచి ఉన్నత స్థితికి చేరినా ఇసుమంతైనా గర్వం లేకుండా ఒదిగి ఉండే గొప్ప లక్షణం ముర్ము సొంతం. ఆమె కట్టూ-బొట్టు, ఆమె చేసే సేవలు, పనులే ఈ విషయం చెప్పకనే చెబుతాయి.

* తన సేవలతో ఎంతోమందికి అండగా నిలిచే ముర్ము.. మంచి వక్త కూడా! ఈ క్రమంలో పలు వేదికలపై స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తారామె.

* తాను చనిపోయాక తన కళ్లను దానం చేస్తానని ఓ సందర్భంలో ప్రకటించి తన నిస్వార్ధ సేవానిరతిని చాటుకున్నారామె.

* ‘కటిక పేదరికం తాండవించే కుటుంబం నుంచి వచ్చిన నేను.. ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా నిలబడాలనుకున్నా. కానీ రాజకీయాల్లోకి వస్తానని కానీ, రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవిని అలంకరిస్తానని కానీ ఎప్పుడూ అనుకోలేదు.. ఆదివాసీ మహిళనైన నేను ఇంతటి మహోన్నత పదవిని అలంకరించబోతుండడం చాలా గర్వంగా, సంతోషంగా ఉంది..’ అంటూ ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నారు ముర్ము.

ముర్ము కంటే ముందు ప్రతిభా పాటిల్‌ (2007-12) భారత తొలి మహిళా రాష్ట్రపతిగా పనిచేశారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన ఆరు దశాబ్దాలకు ఈ అరుదైన ఘనతను అందుకున్నారామె. ఇక అప్పట్నుంచి ఇప్పటిదాకా.. రాష్ట్రపతి ఎన్నికల్లో పలువురు మహిళలు పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. ఇక ఇప్పుడు ముర్ము విజయం మహిళల శక్తిని మరోసారి చాటిందని చెప్పచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్