Kantara: ‘కాంతార’ కోసం గర్భంతోనే అడవిలోకి వెళ్లా!

తల్లి కాబోతున్నానన్న సంతోషం ఒకవైపు.. తనను తాను నిరూపించుకునే కెరియర్‌ అవకాశం మరోవైపు.. ఈ రెండింట్లో ఏదో ఒకటి ఎంచుకోమంటే.. తాను మాత్రం రెండింటినీ సమర్థంగా బ్యాలన్స్‌ చేయడానికే ఓటేస్తానంటోంది ప్రముఖ కాస్ట్యూమ్‌ డిజైనర్‌, నటి ప్రగతీ శెట్టి. కేవలం మాటల్లోనే కాదు.. తన చేతల ద్వారా ఈ విషయాన్ని.....

Published : 17 Nov 2022 14:32 IST

(Photos: Instagram)

తల్లి కాబోతున్నానన్న సంతోషం ఒకవైపు.. తనను తాను నిరూపించుకునే కెరియర్‌ అవకాశం మరోవైపు.. ఈ రెండింట్లో ఏదో ఒకటి ఎంచుకోమంటే.. తాను మాత్రం రెండింటినీ సమర్థంగా బ్యాలన్స్‌ చేయడానికే ఓటేస్తానంటోంది ప్రముఖ కాస్ట్యూమ్‌ డిజైనర్‌, నటి ప్రగతీ శెట్టి. కేవలం మాటల్లోనే కాదు.. తన చేతల ద్వారా ఈ విషయాన్ని నిరూపించిందామె. భారతీయ సినీ పరిశ్రమలోని రికార్డులన్నీ తిరగరాసిన ‘కాంతార’ చిత్రానికి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసి.. ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించిందామె. గర్భిణిగానే ఆమె ఈ సినిమా కోసం పనిచేయడం విశేషం. అయితే ఈ క్రమంలో తానెదుర్కొన్న సవాళ్లు, పొందిన అనుభూతుల్ని ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుంది ప్రగతి.

కాంతార.. కథ, నటన, నేపథ్య సంగీతం, సంగీతం, కాస్ట్యూమ్స్‌, మేకప్‌.. ఇలా ప్రతి అంశంలోనూ తనదైన మార్క్‌ను అందుకుందీ సినిమా. ఇక ఈ చిత్రంలోని కాస్ట్యూమ్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేకుండా నాటి కాలానికి తగ్గట్లుగా దుస్తుల్ని రూపొందించడం అంత సులభం కాదు. అందుకే ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానంటోంది చిత్ర కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ప్రగతీ శెట్టి.

గర్భంతోనే పరిశోధన మొదలుపెట్టా!

‘స్క్రిప్టు చదవగానే వెంటనే పని మొదలుపెట్టేయాలన్న ఉత్సాహం కలిగింది. అయితే అప్పటికి నేను గర్భవతిని. అటు తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే.. ఇటు చిత్ర కాస్ట్యూమ్స్‌ కోసం పరిశోధన మొదలుపెట్టా. కాంతార సినిమా 1890, 1970, 1990.. ఇలా మూడు కాలాలకు సంబంధించిన కథ. ఇక కథ మొత్తం కుండాపూర్‌ అనే గ్రామానికి చెందిన గిరిజనుల చుట్టే తిరుగుతుంది. కాబట్టి ఆయా కాలాల్లో అక్కడి గిరిజనుల ఆహార్యమేంటో ముందుగా తెలుసుకోవాలి. ఈ క్రమంలో ఆ గిరిజన గ్రామానికి వెళ్లి అక్కడి పెద్దల్ని కలిశాం. వాళ్ల వద్ద ఉన్న పాత ఫొటోల్ని పరిశీలించాం. రాణీ అబ్బక్క మ్యూజియం నుంచి మరికొన్ని ఫొటోల్ని సేకరించాం. ఫలితంగా రాజు, రాణికి సంబంధించిన దుస్తులు, ఆభరణాల గురించి ఓ అవగాహన వచ్చింది. ఇక ఈ మూడు కాలాల్లో కాంతార పాత్ర ఉన్నప్పటికీ.. ప్రతి కాలానికీ ఆహార్యం విభిన్నంగా ఉండడంతో ఆ విషయంలోనూ శ్రద్ధ తీసుకున్నా. ఇక అక్కడి ప్రజలు ఎంతో భక్తితో కొలిచే దేవత పాత్రే (పంజుర్లీ) ఈ సినిమాకు కీలకం. కాబట్టి ఆ కాస్ట్యూమ్స్‌ రూపొందించడంలో మరింత జాగ్రత్తపడ్డా. ఇలా మొత్తానికి ఈ సినిమా కోసం వెయ్యికి పైగా కాస్ట్యూమ్స్‌ రూపొందించాం.. ఇక ఆభరణాలు కూడా ఆయా కాలాలకు, పాత్రలకు తగినట్లుగా నేనే దగ్గరుండి తయారుచేయించా..’ అంటూ చెప్పుకొచ్చింది ప్రగతి.

అప్పుడు కాస్త కష్టమైంది!

పాత్రలకు దుస్తులు రూపొందించడం ఒకెత్తయితే.. యాక్షన్‌ సన్నివేశాల్లో వాటిని పదే పదే మార్చడం మరో సవాలంటోంది ప్రగతి. ‘సినిమా మొత్తమ్మీద నాలుగు ఫైట్‌ సీన్లున్నాయి. ఆ నాలుగు పర్యాయాల కోసం నాలుగు సెట్ల కాస్ట్యూమ్స్‌ ముందే రడీ చేసి పెట్టాం. అయినా కొన్ని పూర్తిగా డ్యామేజ్‌ అయ్యేవి. తిరిగి వాటిని రూపొందించడానికి రెండు మూడు రోజుల సమయం పట్టేది. ఇలాంటప్పుడు కాస్త కష్టమయ్యేది. ఇక ఇందులో సప్తమి (హీరోయిన్‌)ది 90ల కాలం నాటి ఫారెస్ట్‌ గార్డ్‌ పాత్ర. అప్పుడప్పుడే మహిళలు అటవీ శాఖలో చేరే రోజులవి. దానికి తగ్గట్లుగా డ్రస్సింగ్‌ ఉండాలన్న ఉద్దేశంతో అటవీ శాఖతో చర్చించి, పలు విషయాలు శోధించి మరీ ఆమె కోసం ప్రత్యేకమైన యూనిఫాం తయారుచేశాను..’ అంటూ తన అనుభవాలను పంచుకుందామె.

ఆ సీన్‌లో అమ్మ చీర ధరించా!

కాంతారకు కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేయడమే కాదు.. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలోనూ నటించింది ప్రగతి. చిత్ర ప్రారంభంలో రాణి పాత్ర పోషించిన ఆమె.. ఈ క్రమంలో తన తల్లి చీర ధరించానని చెబుతోంది. ‘సినిమా ప్రారంభంలో రెండంటే రెండే నిమిషాలుంటుంది నా పాత్ర. దీనికోసం 15 రోజులు కష్టపడ్డాం. ఇక అందులో మొత్తం మూడు చీరలు ధరించా. మెరూన్‌ రంగులో ఉన్న చీర.. మా అమ్మ తన పెళ్లిలో ధరించింది! మరో రెండు చీరలు ఆయా సన్నివేశాన్ని బట్టి విడిగా డిజైన్‌ చేసుకున్నా. ఇక ఈ సినిమాలో రాణి పిల్లలుగా.. నా కొడుకు రన్విత్‌, కూతురు రాధ్య నటించారు..’ అంది ప్రగతి. గర్భిణిగానే ఈ సినిమాకు దుస్తులు రూపొందించడం మొదలుపెట్టిన ఆమె.. కూతురు పుట్టాక తనతో కలిసి ఈ సినిమాలోనూ నటించడం విశేషం.


సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలి..!

కన్నడ చిత్ర పరిశ్రమలో కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా, సెలబ్రిటీ స్టైలిస్ట్‌గా ప్రగతీ శెట్టికి మంచి పేరుంది. అయితే నిజానికి ఆమెది ఐటీ నేపథ్యం. ప్రముఖ కంపెనీల్లో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌గా పనిచేసిన తనకు ‘దేవ్‌దాస్‌’ చిత్రంతో కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేయాలన్న తపన మొదలైందంటోందామె. ‘సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించిన దేవ్‌దాస్‌ సినిమా అంటే నాకెంత ఇష్టమంటే.. ఇప్పటికే దాన్ని కొన్ని వందలసార్లు చూసుంటా. సినిమా కథ, నటీనటుల నటన కోసం కాదు.. అందులోని కాస్ట్యూమ్స్‌ కోసం! అవి అంతలా నన్ను కట్టిపడేశాయి మరి! ఇక అప్పట్నుంచి ఈ రంగంలో పనిచేయాలన్న ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా చారిత్రక కథలు, వింటేజ్‌ స్టైల్స్‌కి తగ్గట్లుగా దుస్తులు డిజైన్‌ చేయడం పైనే దృష్టి పెట్టా. ఈ మక్కువతోనే బెంగళూరులోని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ’లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేశా. ఇక 2017లో రిషబ్‌తో పెళ్లయ్యాక పూర్తిగా ఇటువైపు వచ్చేశా. కాంతారకు ముందు ‘Sa.Hi.Pra.Shaale, Kasaragodu’ అనే సినిమాకు దుస్తులు రూపొందించా. నా లక్ష్యం ఒక్కటే.. కొత్త కొత్త ప్రయోగాలు చేయడం, తద్వారా ప్రేక్షకుల మెప్పు పొందడం..’ అంటూ చెప్పుకొచ్చిందీ మిసెస్‌ శెట్టి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్