మోదీ బృందంలో.. ఈ ఏడుగురు..!

ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండగ ఇటీవలే ముగిసింది. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ తన బృందంతో కలిసి ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి మోదీ బృందంలో ఏడుగురు మహిళలకు స్థానం లభించింది.

Published : 10 Jun 2024 22:40 IST

(Photos: Instagram)

ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండగ ఇటీవలే ముగిసింది. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ తన బృందంతో కలిసి ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి మోదీ బృందంలో ఏడుగురు మహిళలకు స్థానం లభించింది. అందులో ఇద్దరికి క్యాబినెట్‌ హోదా దక్కగా.. ఐదుగురికి సహాయ మంత్రులుగా అవకాశం లభించింది. అయితే మోదీ 2.0లో 10 మంది మహిళలకు మంత్రి పదవులు దక్కగా ఇప్పుడు ఆ సంఖ్య 7 కు తగ్గింది. ప్రస్తుత ప్రభుత్వంలో ముగ్గురు మహిళలను మొదటిసారి మంత్రి పదవి వరించడం విశేషం. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్‌తో పాటు భాజపా ఎంపీలు అన్నపూర్ణాదేవి, శోభా కరంద్లాజే, రక్షా ఖడ్సే, సావిత్రి ఠాకూర్, నిముబెన్‌ బాంభణియా, అప్నాదళ్‌ ఎంపీ అనుప్రియా పటేల్‌ మంత్రి పదవులు సొంతం చేసుకున్నారు. కేంద్ర మంత్రులుగా ప్రభుత్వంలో ముఖ్య పాత్ర పోషించే అవకాశం దక్కించుకున్న వీరి గురించి మీకోసం..

పోటీ చెయ్యకుండానే మరోసారి..!

నిర్మలా సీతారామన్‌.. 1959 ఆగస్టు 18వ తేదీన తమిళనాడులోని మదురైలో జన్మించారు. ఆమె తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మి రామస్వామి కాలేజీ నుంచి ఎకనమిక్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత న్యూదిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్‌ పూర్తి చేశారు. చదువు పూర్తి చేసిన తర్వాత లండన్ వెళ్లిన ఆమె.. అగ్రికల్చర్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌లో అసిస్టెంట్‌ ఎకనమిస్ట్‌గా పని చేశారు. ఆ తర్వాత భారత్‌కు తిరిగి వచ్చిన నిర్మల.. 2003 నుంచి 2005 దాకా జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా పని చేశారు. ఈ సమయంలో పలు మహిళా అంశాలపై గళమెత్తారు. 2008లో భాజపాలో చేరిన ఆమె 2014 వరకూ పార్టీ అధికార ప్రతినిధిగా సేవలందించారు. 2014లో మోదీ ప్రభుత్వంలో మొదటిసారి మంత్రిగా నియమితులయ్యారు. ఆ సమయంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కీలకమైన రక్షణ, ఆర్థిక శాఖలకు మంత్రిగా సేవలందించారు. 2022లో ఫోర్బ్స్‌ ప్రకటించిన 100 మంది శక్తిమంతులైన మహిళల్లో ఒకరిగా నిలిచారు. ఆర్థిక మంత్రిగా వరుసగా ఆరుసార్లు బడ్జెట్‌ ప్రవేశ పెట్టి పలు రికార్డులను నమోదు చేశారు. ఈ క్రమంలోనే మరోసారి క్యాబినెట్‌ హోదా దక్కించుకున్నారు. రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతోన్న నిర్మల ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవడం గమనార్హం.


అనూహ్యంగా అడుగుపెట్టి..!

అప్పటివరకు సాధారణ గృహిణిగా ఉన్న అన్నపూర్ణాదేవి భర్త రమేష్‌ యాదవ్‌ మరణంతో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. 1998లో కోడర్మా స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో ఆర్జేడీ పార్టీ తరఫున పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర మంత్రిగానూ సేవలందించారు. 2014 నుంచి 2019 వరకు ఆర్జేడీ జార్ఖండ్‌ శాఖకు అధ్యక్షురాలిగా పనిచేశారు. రాజకీయ సమీకరణాలు మారడంతో 2019లో ఆమె భాజపాలో చేరారు. అదే సంవత్సరం మొదటిసారిగా కోడర్మా పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. రాంచీ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్‌ పూర్తి చేసిన ఆమెకు 2021లో కేంద్రమంత్రిగా అవకాశం లభించింది. తాజాగా అదే నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసిన ఆమె తన సమీప సీపీఐ(ఏం) అభ్యర్థి వినోద్‌ కుమార్‌ సింగ్‌పై 3.77 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ క్రమంలోనే తాజా మంత్రివర్గంలో క్యాబినెట్ హోదా దక్కించుకున్నారు.


సామాజిక కార్యకర్తగా మొదలై..

మధ్యప్రదేశ్‌కు చెందిన సావిత్రి ఠాకూర్‌ 1996లో ప్రజాజీవితంలోకి వచ్చారు. దాదాపు పదేళ్ల పాటు సామాజిక కార్యకర్తగా పనిచేసిన ఆమె గిరిజన, పేద మహిళల అభ్యున్నతి కోసం కృషి చేశారు. ఆ తర్వాత 2003లో భాజపాలో చేరిన ఆమె జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత సంవత్సరం వ్యవధిలోనే జిల్లా పంచాయతీ అధ్యక్షురాలిగా ప్రమోషన్‌ సాధించారు. 2014లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ధార్‌ స్థానం నుంచి పోటీ చేసి మొదటిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 2019లో టికెట్‌ లభించకపోయినా పార్టీలోనే ఉంటూ వివిధ పదవులు నిర్వర్తించారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ధార్‌ సీటు దక్కించుకుని రెండోసారి ఎంపీగా విజయం సాధించారు. ఈ క్రమంలోనే మొదటిసారి మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు.


రాజధానిలో ఏకైక మహిళ..!

కర్ణాటకలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన శోభా కరంద్లాజేను అందరూ ముద్దుగా ‘శోభక్క’ అని పిలుస్తుంటారు. ఆమె సోషల్‌ వర్క్‌ విభాగంలో మంగళూరు విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్‌ చేశారు. ఆ తర్వాత మైసూర్‌ యూనివర్సిటీలో సామాజిక శాస్త్రంలో ఎంఏ చేశారు. రాడికల్‌ భావాలు కలిగిన శోభ చిన్నవయసులోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి కీలక సభ్యురాలిగా మారారు. 1996లో భాజపాలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే ఉడిపి జిల్లా భాజపా మహిళా మోర్చా విభాగానికి జనరల్‌ సెక్రటరీగా ఎంపికయ్యారు. 2008లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన శోభ.. పలు శాఖలకు రాష్ట్రమంత్రిగానూ సేవలందించారు. ఆ తర్వాత 2014, 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఉడిపి-చిక్కమగళూరు స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. ఈ క్రమంలోనే 2021లో మొదటిసారి కేంద్రమంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. 2024 ఎన్నికల్లో తన నియోజకవర్గాన్ని వదలిపెట్టిన శోభ.. బెంగళూరు నార్త్‌ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తద్వారా బెంగళూరు స్థానానికి ఎన్నికైన మొదటి మహిళా ఎంపీగా చరిత్ర సృష్టించారు.


సర్పంచ్‌గా మొదలుపెట్టి..!

మహారాష్ట్రకు చెందిన రక్షా ఖడ్సే 2010లో సర్పంచ్‌గా గెలిచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2012లో జడ్పీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2013లో భర్త నిఖిల్‌ ఖడ్సే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. 2014 ఎన్నికల్లో భాజపా తరఫున రావెర్‌ స్థానానికి పోటీ చేసి మొదటిసారిగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. అప్పుడు ఆమె వయసు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. 2019లోనూ అదే స్థానం నుంచి గెలిచిన ఆమె కేంద్ర మంత్రిగా మొదటిసారి అవకాశం దక్కించుకున్నారు. తాజాగా రావెర్‌ స్థానం నుంచి ముచ్చటగా మూడోసారి విజయం సాధించి మరోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.


టీచర్‌ టూ మంత్రి..!

గుజరాత్‌కు చెందిన నిముబెన్‌ బాంభణియా వృత్తి రీత్యా టీచర్‌. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో భాజపాలో చేరారు. ఈ క్రమంలోనే 2004లో ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అలా భావ్‌నగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మూడుసార్లు పోటీ చేసి గెలుపొందారు. దాంతో ఆమెకు రెండుసార్లు భావ్‌నగర్‌ మేయర్‌గా పని చేసే అవకాశం లభించింది. ఆమె 2013 నుంచి 2021వరకు రాష్ట్ర మహిళా మోర్చా విభాగానికి ఉపాధ్యక్షురాలుగానూ పనిచేశారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో భావ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసిన ఆమె.. తన సమీప ఆమ్‌ ఆద్మీ అభ్యర్థి ఉమేష్‌ మఖ్వానాపై 4.55 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అలా మొదటిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టడమే కాకుండా మంత్రి పదవిని కూడా సొంతం చేసుకున్నారు.


తండ్రి మరణంతో..!

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అప్నాదళ్‌ పార్టీ వ్యవస్థాపకుడు దివంగత డా|| సోనీలాల్‌ పటేల్‌ కుమార్తె అనుప్రియా పటేల్‌. 2009లో తండ్రి మరణంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే పార్టీ జనరల్‌ సెక్రటరీగా పనిచేశారు. ఆ తర్వాత 2012 అసెంబ్లీ ఎన్నికల్లో రొహానియా స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో భాజపాతో పొత్తు పెట్టుకున్న ఆమె మిర్జాపుర్‌ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అనుప్రియ మొదటిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2016లో అప్నాదళ్ (ఎస్‌) పార్టీకి అధ్యక్షురాలయ్యారు. 2016లో ఆమె కేంద్రమంత్రిగా మొదటిసారి అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత 2019, 2024 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఆమె తాజాగా మరోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్