సోపాన సంగీతంలో రాణిస్తున్న ‘కళాతిలకం’!

తమదైన నైపుణ్యంతో, తపనతో పురుషాధిపత్యం ఉన్న రంగాల్లోనూ రాణిస్తున్నారు ఎంతోమంది మహిళలు. ఈ క్రమంలో అరుదైన గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే.. కేరళలోని ఇరింజలకుడకు చెందిన ఆశా సురేశ్‌. కేరళకు మాత్రమే సొంతమైన ప్రత్యేక సంగీత కళ, పురాతన సంప్రదాయ ‘సోపాన సంగీతం’లో ఆరితేరిందామె. అదీ.. అక్కడ పురుషులు.....

Published : 20 Jul 2022 18:22 IST

(Photo: Facebook)

తమదైన నైపుణ్యంతో, తపనతో పురుషాధిపత్యం ఉన్న రంగాల్లోనూ రాణిస్తున్నారు ఎంతోమంది మహిళలు. ఈ క్రమంలో అరుదైన గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే.. కేరళలోని ఇరింజలకుడకు చెందిన ఆశా సురేశ్‌. కేరళకు మాత్రమే సొంతమైన ప్రత్యేక సంగీత కళ, పురాతన సంప్రదాయ ‘సోపాన సంగీతం’లో ఆరితేరిందామె. అదీ.. అక్కడ పురుషులు మాత్రమే ఎక్కువగా ఎంచుకునే ఈ కళలో తన నైపుణ్యాలను నిరూపించుకుంటోంది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ వేదికగా ప్రదర్శనలిస్తూ.. అటు ఆ భగవంతుడిని, ఇటు సంగీత ప్రియుల్ని మెప్పిస్తోంది. మరి, ఇంతకీ ఏంటీ సోపాన సంగీతం? ఆశ ఇటువైపుగా ఎందుకు అడుగులు వేసిందో? తెలుసుకుందాం రండి..

సోపాన సంగీతం.. కేరళకు మాత్రమే సొంతమైన ప్రత్యేక సంగీత కళల్లో ఇది ఒకటి. అక్కడి దేవాలయాల్లో ఎన్నో ఏళ్లుగా ప్రాచుర్యంలో ఉన్న ఈ కళలో భాగంగా.. ఇడక్క అనే డోలు లాంటి సంగీత వాయిద్య పరికరం ఉంటుంది. దీనిని పవిత్రమైన దేవ వాయిద్య పరికరంగా పరిగణిస్తారు. దీనికి ఒక వైపు మాత్రమే స్టిక్‌ సాయంతో విభిన్న రాగాలు పలికిస్తూ.. పాటలు పాడాల్సి ఉంటుంది. అది కూడా దేవాలయంలో పూజ జరుగుతున్నప్పుడు ఆలయ మెట్ల వద్ద నిల్చొని వినసొంపైన సంగీతంతో పాటలు, జయదేవుని అష్టపదులు మొదలైనవి ఆలపిస్తారు. నిజానికి కేరళలో ఎక్కడ చూసినా ఈ వృత్తిలో పురుషులే కనిపిస్తుంటారు. తన తపనతో ఇలాంటి అరుదైన వృత్తిలోకి ప్రవేశించి వార్తల్లో నిలిచింది ఆశ.

ఇడక్క అందానికి ఆకర్షితురాలై..!

మనకు ఒక వస్తువు నచ్చిందంటే దాన్ని మన సొంతం చేసుకునేదాకా నిద్రపోం.. తాను కూడా ఇడక్క డోలు సౌందర్యానికి ముగ్ధురాలినయ్యే ఈ కళపై ప్రేమ పెంచుకున్నానంటోంది ఆశ. ‘చిన్నప్పుడు అమ్మానాన్నలతో కలిసి తరచూ గుడికెళ్లేదాన్ని. అక్కడే సోపాన సంగీతం నాకు పరిచయమైంది. పూజల సమయంలో కొందరు కళాకారులు ఇడక్క అనే వాయిద్య పరికరంతో పాటలు పాడుతుంటారు. డోలు లాంటి ఈ పరికరం నన్ను విపరీతంగా ఆకర్షించింది. ముఖ్యంగా దానికి కింది వైపు వేలాడదీసే 64 రకాల రంగురంగుల క్లాత్‌ బాల్స్‌ అందానికి నేను ముగ్ధురాలినయ్యా. 64 కళలకు చిహ్నాలుగా వీటిని చెబుతుంటారు. ఈ మక్కువే చిన్న వయసులో క్రమంగా సోపాన సంగీతంపై ఇష్టం పెరిగేలా చేసింది. నా తపనను గుర్తించిన అమ్మానాన్న.. ఇది పురుషాధిక్య రంగమే అయినా ఇందులో నన్ను ప్రోత్సహించారు. అలా ఏడేళ్ల వయసులోనే సోపాన సంగీతంలో ఓనమాలు దిద్దాను..’ అంటోంది ఆశ.

లాక్‌డౌన్‌లో పేరొచ్చింది!

కృషి, పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైన పనైనా సునాయాసంగా నేర్చుకోవచ్చన్నట్లు.. ఓ సోపాన సంగీత కళాకారుడి వద్ద ఈ కళలో ఆరితేరింది ఆశ. ఆపై అక్కడి గుళ్లలో ఈ కళను ప్రదర్శిస్తూ తనను తాను నిరూపించుకుంది. అయితే అప్పటివరకు వేర్వేరు గుళ్లలో పాటలు పాడినప్పటికీ లాక్‌డౌన్‌ సమయంలోనే ఎక్కువ గుర్తింపొచ్చిందని చెబుతోందీ కేరళ కుట్టి.

‘సోపాన సంగీతంలో భాగంగా లయబద్ధంగా ఇడక్క వాయిస్తూ, దానికి వినసొంపైన రాగాన్ని జత చేయాల్సి ఉంటుంది. ఇది కాస్త కష్టమైన ప్రక్రియే అయినా.. ఇష్టంతో నేర్చుకున్నా. అందుకే అలవోకగా పాటలు ఆలపించగలను. అయితే గత కొన్నేళ్లుగా ఈ ప్రదర్శనలిస్తున్నప్పటికీ.. లాక్‌డౌన్‌ సమయంలోనే నాకు ఎక్కువగా గుర్తింపొచ్చిందని చెప్తా. ఎందుకంటే ఈ సమయంలో ఆన్‌లైన్‌లోనే సుమారు 200 లకు పైగా ప్రదర్శనలిచ్చా. దీంతో చాలా దేవాలయాల నుంచి ఆహ్వానాలు కూడా అందుకున్నా. పురుషాధిపత్యం ఉన్న రంగమే అయినా.. ఇందులో రాణిస్తున్నందుకు చాలామంది నన్ను ప్రోత్సహించారు.. బాగా పాడుతున్నావంటూ వెన్నుతట్టారు. ఇది నాలో ఆత్మవిశ్వాసం నింపింది. అందుకే అదే సమయంలో సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ కూడా ప్రారంభించా. ఈ వేదికగానూ సోపాన సంగీతం వీడియోలు రూపొందిస్తున్నా. దీనికీ మంచి స్పందన వస్తోంది..’ అంటూ సంబరపడిపోతోంది ఆశ.

ప్రస్తుతం స్థానికంగా ఉన్న క్రైస్ట్‌ కాలేజీలో లైబ్రరీ సైన్స్‌లో మాస్టర్స్‌ చేస్తోన్న ఆమె.. తన కళా నైపుణ్యాలతో రాష్ట్రవ్యాప్తంగానే కాదు.. దేశవ్యాప్తంగానూ పాపులారిటీ సంపాదించింది. ఆమె సంగీత నైపుణ్యాల్ని గుర్తించిన క్యాలికట్‌ యూనివర్సిటీ.. ‘యూత్‌ ఫెస్టివల్‌’లో భాగంగా ‘కళాతిలకం’ టైటిల్‌ని అందించి ఆశను గౌరవించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్