పప్పీ కోసం వీగన్‌ వంటలు.. ఇదే ఆమె వ్యాపార మంత్రం!

ఇంట్లో పిల్లల్ని ఎంత అపురూపంగా చూసుకుంటామో.. పెంపుడు జంతువుల్నీ అంతే ప్రేమిస్తుంటారు కొంతమంది పెట్‌ లవర్స్‌. అవి జబ్బు పడితే తాము డల్‌ అయిపోవడం, అవి తినకపోతే తాము పస్తులుండడం.. వంటివి చేసే వారూ లేకపోలేదు. జైపూర్‌కు చెందిన సాక్షీ శర్మ....

Updated : 11 Nov 2022 20:02 IST

ఇంట్లో పిల్లల్ని ఎంత అపురూపంగా చూసుకుంటామో.. పెంపుడు జంతువుల్నీ అంతే ప్రేమిస్తుంటారు కొంతమంది పెట్‌ లవర్స్‌. అవి జబ్బు పడితే తాము డల్‌ అయిపోవడం, అవి తినకపోతే తాము పస్తులుండడం.. వంటివి చేసే వారూ లేకపోలేదు. జైపూర్‌కు చెందిన సాక్షీ శర్మ కూడా ఇదే కోవకు చెందుతుంది. తన పెంపుడు కుక్క రూబీ అంటే ఆమెకు ఎనలేని ప్రేమ. అదెంతలా అంటే.. రూబీకి మాంసాహారం పడకపోతే.. దాని కోసం ప్రత్యేకంగా వీగన్‌ ఆహార పదార్థాలు తయారుచేసేంతలా! ఇలా ఈ మక్కువనే వ్యాపార సూత్రంగా మలచుకుంది సాక్షి. ప్రస్తుతం పెంపుడు కుక్కల కోసం రుచికరమైన వీగన్‌ వంటకాల్ని అందిస్తూనే.. తన వ్యాపారాన్ని లాభాల బాట పట్టిస్తోంది. మరి, ఈ వ్యాపారమే ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందని అడిగితే.. దాని వెనుక ఓ చిన్న కథ ఉందంటోందీ పెట్ లవర్.

రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన సాక్షీ శర్మ ‘జైపూర్‌ నేషనల్‌ యూనివర్సిటీ’లో బీసీఏ పూర్తి చేసింది. ఆమెకు పెంపుడు జంతువులంటే ప్రాణం. ఈ మక్కువతోనే రూబీ అనే కుక్కను ఇంటికి తెచ్చుకుంది. కన్నబిడ్డతో సమానంగా దాన్ని సాకుతోంది. అయితే తాను, తన కుటుంబ సభ్యులందరూ వీగన్లే అయినప్పటికీ.. తన పెట్‌ కోసం తరచూ మాంసాహారం పెడుతుంటుంది సాక్షి. ఈ క్రమంలో కొన్నిసార్లు రూబీ ఆహారం తీసుకోకపోవడం, రోజుల పాటు పస్తులుండడం గమనించిందామె. తీరా సమస్యేంటా అని ఆరా తీస్తే.. తన పెట్‌కు మాంసం పడట్లేదని, ఫలితంగా దాని చర్మంపై అలర్జీ వస్తుందని గుర్తించింది సాక్షి.

రూబీ సమస్యే వ్యాపారానికి బీజం!

ఎంతో ప్రేమగా చూసుకునే రూబీ ఆహారం తీసుకోకపోయేసరికి సాక్షికి ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే ఇంటర్నెట్‌లో పెట్‌ ఫుడ్స్‌ గురించి వెతుకులాట ప్రారంభించింది. అయితే అప్పటికే క్లినికల్‌ పెట్‌ న్యూట్రిషనిస్ట్‌గా పలు కోర్సులు పూర్తిచేసి తాను పొందిన సర్టిఫికెట్లు ఈ అధ్యయనంలో ఆమెకు మరింతగా ఉపయోగపడ్డాయి. ఈ క్రమంలోనే తన పెట్‌ కోసం వీగన్‌ పదార్థాలు ప్రయత్నించాలనుకుంది సాక్షి. తనకున్న నైపుణ్యాలతో తానే స్వయంగా ప్రత్యేక వంటకాలు చేసి రూబీకి పెట్టడం, దాంతో వాటిని అది ఆస్వాదిస్తూ తినడం, అప్పటిదాకా అది ఎదుర్కొంటోన్న అలర్జీ వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పట్టడం.. వంటివన్నీ గమనించిందామె. ఇక పెట్స్‌ కోసం మార్కెట్లో ఇలాంటి ఆహార పదార్థాల కోసం వెతికిన ఆమెకు తాను ఆశించినన్ని ఆప్షన్లు కనిపించలేదు. దాంతో ఇదే తన వ్యాపార సూత్రంగా మలచుకోవాలనుకుంది సాక్షి. ఈ ఆలోచనతోనే తన స్నేహితుడితో కలిసి ‘ఫ్రెష్‌వూఫ్‌’ అనే సంస్థకు శ్రీకారం చుట్టిందీ పెట్‌ లవర్.

వండక్కర్లేదు.. నేరుగా పెట్టచ్చు!

2020లో రూ. లక్ష పెట్టుబడితో ప్రారంభమైన తన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తుందంటోంది సాక్షి. ‘మన ఆరోగ్యానికి ఆయా పోషకాల అవసరం ఎంత ఉందో.. పెంపుడు జంతువులకూ కొన్ని రకాల అత్యవసర పోషకాలు అందాల్సి ఉంటుంది. అయితే వీగన్‌ ఆహారం, శాకాహారం పెట్స్‌కి సరిపడదనుకుంటారు చాలామంది. కానీ ఇవీ వాటికి సురక్షితమే అని ఇటీవలే జరిపిన ఓ సర్వేలో తేలింది. ఈ విషయాలన్నీ తెలుసుకున్నాకే వీటి కోసం వీగన్‌ వంటకాలు తయారుచేయడం మొదలుపెట్టాం. అది కూడా వండుకోనవసరం లేకుండా నేరుగా తినేందుకు వీలుగా అందిస్తున్నాం. ప్రస్తుతం మా వద్ద బ్రౌన్‌ రైస్‌-బీన్స్‌, టోఫు-క్వినోవా, ఓట్స్‌-శెనగలు.. వంటి మూడు రకాల వీగన్‌ పెట్‌ ఫుడ్‌ సిద్ధమవుతోంది. రుచి కోసం వీటిలో ఉసిరి, అల్లం, పసుపు, మునగాకు, అశ్వగంధ.. వంటి పదార్థాల్ని కూడా కలుపుతున్నాం. ఇవన్నీ పెంపుడు కుక్కలకు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాల్ని చేకూర్చుతాయి. సాధారణంగా ఆరోగ్యకరమైన పదార్థాలు రుచించవు. కానీ మేం తయారుచేసే పెట్‌ ఫుడ్‌లో ఆరోగ్యం, రుచికి సమప్రాధాన్యమిస్తున్నాం.. తద్వారా ఈ వ్యాపారంలో పోటీదారుల్ని సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నాం..’ అంటూ తన స్టార్టప్‌ విశేషాలు చెప్పుకొచ్చిందీ పెట్‌ మామ్.

ప్రస్తుతం తన ఉత్పత్తుల్ని వెబ్‌సైట్‌, సోషల్‌ మీడియా పేజీల ద్వారానే కాకుండా.. ఇతర ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్స్‌లోనూ అందుబాటులో ఉంచి విక్రయిస్తోన్న సాక్షి.. త్వరలోనే తన బ్రాండ్‌ని విదేశాలకు విస్తరించే ఆలోచనలో ఉన్నానంటోంది. మరోవైపు.. పెంపుడు కుక్కలకు అందించే ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి ఆరోగ్యం గురించి సమాచారం అందిస్తూ పెట్‌ లవర్స్‌లో అవగాహన పెంచుతోంది సాక్షి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్