GPS Girl: గూగుల్‌ మ్యాప్స్‌ వెనకున్న స్వీట్‌ వాయిస్ ఎవరిదో తెలుసా?

‘జీపీఎస్‌ గర్ల్‌’గానే ప్రపంచవ్యాప్తంగా సుపరిచితురాలైన కరెన్‌ జాకబ్‌సెన్‌.. కేవలం వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్టే కాదు.. గాయని, పాటల రచయిత్రి, స్ఫూర్తిదాయక వక్త కూడా! మరి, ఇన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలున్న ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Published : 19 Jul 2023 14:29 IST

(Photos: Instagram)

ఈ రోజుల్లో గూగుల్ మ్యాప్స్ తెలియని వారుండరు. ఎక్కడికైనా తెలియని ప్రదేశానికి వెళ్లాల్సి వస్తే.. మొబైల్‌లో యాప్‌ ఓపెన్‌ చేసుకొని.. సులభంగా, సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంటాం. అయితే ఎంతసేపూ మ్యాప్‌లో కనిపించే డైరెక్షన్లనే చూస్తాం కానీ.. దిశల్ని తెలియజేస్తూ వినిపించే మధురమైన గొంతు వినే వారు, పట్టించుకునే వారు చాలా తక్కువమంది! ఆ స్వీట్‌ వాయిస్‌ మరెవరిదో కాదు.. ఆస్ట్రేలియాకు చెందిన కరెన్‌ జాకబ్‌సెన్‌ది. తన అసలు పేరు కంటే ‘జీపీఎస్‌ గర్ల్‌’గానే ప్రపంచవ్యాప్తంగా సుపరిచితురాలైన ఆమె.. వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్టే కాదు.. గాయని, పాటల రచయిత్రి, స్ఫూర్తిదాయక వక్త కూడా! మరి, ఇన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలున్న ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

కరెన్‌ ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌లోని మెక్‌కే నగరంలో పుట్టింది. ఆమెకు చిన్న వయసు నుంచే పాటలు వినడమన్నా, పాడడమన్నా, వాయిస్‌ ఓవర్‌ చెప్పడమన్నా చాలా ఇష్టం. ‘ఈ మక్కువతోనే చిన్నతనంలో టీవీలో వచ్చే ప్రతి జింగిల్‌ని విని నోట్‌ చేసుకునేదాన్ని. ఆపై అదే ట్యూన్‌లో వాటిని పాడేదాన్ని. ఇలా సంగీతంపై నాకున్న మక్కువను గుర్తించిన మా అమ్మానాన్నలు నన్ను ఈ రంగంలోనే ప్రోత్సహించారు..’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది కరెన్.

ఏడో ఏట నుంచే..!

ఏడేళ్ల వయసు నుంచే సొంతంగా పాటలు రాయడం ప్రారంభించిన కరెన్‌.. ‘వాయిస్‌, పియానో’ ప్రధాన సబ్జెక్టులుగా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది. పియానో అసోసియేట్‌ (AmusA)గా డిప్లొమా పూర్తిచేయడంతో పాటు.. కళల్లో నైపుణ్యాలున్న వారికి అందించే జాజ్‌ ప్రైజ్‌ కూడా అందుకుంది. వివిధ రకాల క్రీడా కార్యక్రమాలు/క్రీడల ప్రారంభోత్సవాల్లో ఆసీస్‌ జాతీయ గీతాన్ని ఆలపించి మరెంతోమందికి చేరువైంది.. పలు అవార్డులూ అందుకుంది. అయితే సంగీతం, వాయిస్‌ ఓవర్‌పై తనకున్న మక్కువే ఆమెను వేల కొద్దీ ప్రకటనలకు తన గాత్రాన్ని అరువిచ్చేలా చేసిందని చెప్పచ్చు. ఈ క్రమంలో టీవీ, రేడియో, ఆన్‌లైన్‌ కమర్షియల్స్‌లో ఎక్కడ విన్నా ఆమె గొంతే వినిపించేది. ఇక బ్రిటన్‌-ఆస్ట్రేలియన్‌ సింగర్‌ అయిన ఒలీవియా న్యూటన్‌ జాన్‌ను స్ఫూర్తిగా తీసుకొని.. ఆమెలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ఆస్ట్రేలియా నుంచి న్యూయార్క్‌కు మకాం మార్చింది కరెన్.

ఆడిషన్‌తో దశ తిరిగింది!

న్యూయార్క్‌ చేరుకున్నాకా.. తన పాటల ప్రయాణాన్ని కొనసాగించింది కరెన్‌. ఈ క్రమంలోనే.. తన సొంత లేబుల్‌ ‘కర్లీ క్వీన్‌’ను సృష్టించిన ఆమె.. ఈ వేదికగా దాదాపు పది ఆల్బమ్స్‌ని విడుదల చేసింది. పలువురు గ్రామీ విజేతలతోనూ పాటలు రాసే, రికార్డ్‌ చేసే అదృష్టం తనను వరించిందని చెబుతోందామె. ఆపై ఓ టెక్నాలజీ సంస్థ ఆహ్వానం మేరకు వాయిస్‌ రికార్డింగ్‌ ఆడిషన్స్‌లో పాల్గొంది కరెన్.

‘వాళ్లకు నా వాయిస్‌ నచ్చడంతో టెలిఫోన్‌ డైరెక్టరీ అంత పుస్తకం ఇచ్చి.. అందులోని సమాచారాన్ని వాయిస్‌గా చెప్పమన్నారు. అలా మూడు వారాల పాటు.. రోజుకు నాలుగ్గంటల చొప్పున దీనికి కేటాయించేదాన్ని. ఇక మిగతా సమయమంతా పాటలు రాస్తూ కూర్చునేదాన్ని. ఇక మూడు వారాల్లో ఈ పుస్తకాన్ని వాయిస్‌గా మార్చడంతో నా పని పూర్తైంది. ఆపై ఈ విషయం కూడా నేను మర్చిపోయా. కానీ ఒక రోజు నా ఫ్రెండ్‌ ఒకరు కాల్‌ చేసి.. జీపీఎస్‌లో నీ వాయిస్ వస్తోందని చెప్పడంతో ఆశ్చర్యపోయా. మూడు వారాల పాటు రికార్డ్‌ చేసిన వాయిస్‌ జీపీఎస్‌ కోసమన్న విషయం అప్పుడు నాకు అర్థమైంది.. నిజానికి ఈ ఆడిషన్‌ నా జీవితాన్నే మార్చేసింది..’ అంటూ చెప్పుకొచ్చిందీ వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్.

నా గొంతు నేనే వింటుంటే..!

జీపీఎస్‌ వాయిస్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ స్మార్ట్‌ ఫోన్ల వినియోగదారులకు చేరువైన ఆమె.. ఆపై తక్కువ కాలంలోనే ‘జీపీఎస్‌ గర్ల్‌’గా పేరు సంపాదించుకుంది. ఇలా ఆండ్రాయిడ్‌ ఫోన్లలోనే కాదు.. యాపిల్‌ ఫోన్లలో వాడే వాయిస్‌ యాప్‌ ‘సిరి’లోనూ ఆమె వాయిస్‌ను అనుసంధానించారు.

‘మిలియన్ల కొద్దీ స్మార్ట్‌ ఫోన్లు, యాపిల్‌ గ్యాడ్జెట్స్‌లో నా వాయిస్‌ నేనే వింటుంటే భలే సరదాగా అనిపిస్తుంటుంది. ఓసారి నా స్నేహితులతో కలిసి కార్లో లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్లాను. ఆ సమయంలో జీపీఎస్‌ ఆన్‌ చేశాం.. అందులో నేను చెప్పిన వాయిసే నాకు దిశల్ని చూపిస్తుంటే.. ఫన్నీగా అనిపించింది. ఇక నా భర్త, కొడుకుతో బయటికి వెళ్లిన ప్రతిసారీ.. జీపీఎస్‌ వాయిస్ ద్వారా నేనే దగ్గరుండి నా భర్తతో కారు నడిపిస్తున్నట్లుగా ఫీలయ్యేదాన్ని.. ఇది మరింత సరదాను పంచేది..’ అంటుంది కరెన్.

చిన్నారుల అభ్యున్నతి కోసం..!

2015లో యూఎస్‌కు చెందిన ‘నేషనల్‌ స్పీకర్స్‌ అసోసియేషన్‌’ న్యూయార్క్‌ ఛాప్టర్‌కు అధ్యక్షురాలిగా వ్యవహరించిన కరెన్‌.. 2017-19 వరకు ఈ సంస్థ ‘బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల’ బృందానికి సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ‘గ్లోబల్‌ స్పీకర్స్‌ సమిట్’ వంటి పలు సమావేశాల్లో ముఖ్య వక్తగా, కన్సర్ట్‌ పెర్ఫార్మర్‌గా వ్యవహరించిన ఆమె.. టెడెక్స్‌ వేదికలపైనా ప్రసంగించింది. కరెన్‌ రచయిత్రి కూడా! ఈ క్రమంలోనే ‘Recalculate – Directions for Driving Performance Success’, ‘The GPS Girl's Road Map for Your Future’.. వంటి పుస్తకాలు కూడా రాసింది. అంతేకాదు.. గృహ హింసను వ్యతిరేకిస్తూ.. పది మంది మహిళల అనుభవాల్ని రంగరించి రాసిన ‘Broken to Brilliant - Breaking Free to be You After Domestic Violence’ అనే ఆడియో బుక్‌కు అంతర్జాతీయ పురస్కారం దక్కింది. మరోవైపు.. సమాజ సేవలోనూ ముందున్న ఆమె.. అంతర్జాతీయంగా పిల్లల అభ్యున్నతి కోసం నిధులు సమీకరించడం, చిన్నారుల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించేలా ఆయా సంస్థలకు మార్గనిర్దేశనం చేయడం.. వంటివీ చేస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్