Ashley Peldon : అరుస్తూ కోట్లు సంపాదిస్తోంది!

ఏదైనా హారర్‌ సినిమా చూసేటప్పుడు వచ్చే సన్నివేశాల కంటే.. దానికి నేపథ్యంగా వచ్చే అరుపులు, కేకలు మనల్ని మరింత భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. ఆ సన్నివేశాన్ని మరింత రియాల్టీగా ప్రేక్షకులకు చేరువ చేస్తాయి. హాలీవుడ్‌ సినిమాల బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఇలాంటి అరుపులు.....

Updated : 24 Jun 2022 12:37 IST

(Photos: Instagram)

ఏదైనా హారర్‌ సినిమా చూసేటప్పుడు వచ్చే సన్నివేశాల కంటే.. దానికి నేపథ్యంగా వచ్చే అరుపులు, కేకలు మనల్ని మరింత భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. ఆ సన్నివేశాన్ని మరింత రియాల్టీగా ప్రేక్షకులకు చేరువ చేస్తాయి. హాలీవుడ్‌ సినిమాల బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఇలాంటి అరుపులు, కేకలు తనవే అంటోంది ఆష్లే పెల్డన్‌. వృత్తిరీత్యా స్క్రీమ్‌ ఆర్టిస్ట్‌ అయిన ఆమె.. హాలీవుడ్‌లో పలు హారర్‌ సినిమాలకు, టీవీ సిరీస్‌లకు తన గళాన్ని అరువిస్తోంది. ఇలా తన అరుదైన నైపుణ్యాల్ని చాటుకోవడమే కాదు.. మంచి పేరుప్రఖ్యాతులతో పాటు బోలెడంత డబ్బూ సంపాదిస్తోంది ఆష్లే. ఈ అరుపులో ఎన్నో భావోద్వేగాలు దాగున్నాయంటోన్న ఆమె.. తన వృత్తిని ఎంతగానో ఎంజాయ్‌ చేస్తున్నానని చెబుతోంది.

సినిమా అంటే మనం తెరపై కనిపించే నటీనటుల్నే చూస్తుంటాం.. కానీ అది హిట్‌ కావాలంటే తెరవెనుక ఎంతోమంది నేపథ్య కళాకారుల కృషి దాగుంటుంది. న్యూయార్క్‌కు చెందిన ఆష్లే పెల్డన్‌ కూడా అలాంటి ఆర్టిస్టే. సాధారణంగా ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు అరవడం, కేకలేయడం వింటే చిరాకు పడతాం. కానీ సహజంగా వచ్చిన ఈ ట్యాలెంట్‌తో అటు పేరు, ఇటు డబ్బూ సంపాదించచ్చని నిరూపిస్తోందీ స్క్రీమ్‌ ఆర్టిస్ట్‌.

ఏడేళ్లకే మొదలుపెట్టి..!

ఆష్లే చిన్నతనం నుంచి చాలా అల్లరి పిల్ల.. చురుగ్గా ఉండేది.. ఎవరైనా తనకు నచ్చని పనిచేస్తే వాళ్లపై అరిచేది, కేకలేసేది. అయితే ఇదే ట్యాలెంట్‌ పెద్దయ్యాక ఆమెను సెలబ్రిటీగా మార్చుతుందని అప్పుడు ఆమెకు తెలియదు. తాను ఏడేళ్ల వయసున్నప్పుడు అనుకోకుండా ‘ఛైల్డ్‌ ఆఫ్‌ యాంగర్‌’ అనే సినిమా అవకాశం వచ్చింది. హింసకు గురైన ఓ ఆరేళ్ల అమ్మాయి కథ అది. అందులో పాత్ర అనుభవించే వేదన, భావోద్వేగాలకు తగినట్లుగా అరుపులు, కేకల్ని తన గళంలో వినిపించి పాత్రకు ప్రాణం పోసింది ఆష్లే.. అంతేకాదు.. మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది. అలా ఆమె ట్యాలెంట్‌ బయటపడడంతో అవకాశాలూ వరుసకట్టడం ప్రారంభమైంది. 20 ఏళ్ల వయసొచ్చే వరకు ‘ఫ్రీ గయ్‌’, ‘పారానార్మల్‌ యాక్టివిటీ’, ‘స్క్రీమ్‌’.. వంటి సుమారు 40కి పైగా సినిమాలకు, మరెన్నో టీవీ షోలకు స్క్రీమింగ్‌ ఆర్టిస్ట్‌గా పనిచేసిందామె. తన గొంతుతో కెరీర్‌లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన ఆష్లే.. ఇప్పుడు సినిమాల్లో స్క్రీమింగ్‌ ఆర్టిస్ట్‌గానే కాదు.. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, వీడియో గేమ్స్‌, రేడియో స్పాట్స్, ఆడియోబుక్స్‌.. వంటి వాటికీ తన గళాన్ని అరువిస్తోంది.

‘స్టంట్‌’కి ఏమాత్రం తీసిపోదు!

అయినా అరవడం, కేకలేయడం కూడా ఓ కళనేనా.. అందులో అంత కష్టమేముంది? అని అడిగితే.. స్టంట్‌ మాస్టర్‌ నేర్పించే విన్యాసాలు, పోరాట సన్నివేశాలకు ఇదేమీ తీసిపోదని చెబుతోంది ఆష్లే. ‘నా వాయిస్‌ నాకు ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. ఇదే నా ప్రత్యేకత కూడా! సాధారణంగా సినిమాలో భాగంగా నా పని పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంటుంది. అప్పుడే సన్నివేశాలకు తగినట్లుగా అరుపులు, కేకలు, వాయిస్‌ను మైక్రోఫోన్‌ సహాయంతో రికార్డ్‌ చేసుకొని.. ఆపై ఆయా సీన్స్‌కి జతచేస్తారు. అయితే ఇలా అరవడం, కేకలేయడంలో అంత కష్టమేముందనుకుంటారు చాలామంది. కానీ ఇందులోనూ సన్నివేశానికి తగినట్లుగా భావోద్వేగాలను పలికించాల్సి ఉంటుంది. భయం, కోపం, ఆనందం, విజయం.. వంటి ఎమోషన్స్‌కి తగినట్లుగా నా గొంతును సవరించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆ సన్నివేశానికి సహజత్వం వస్తుంది. అందుకే స్క్రీమింగ్‌ కూడా ఓ చిన్న సైజు ఫైటింగ్‌ లాంటిదే!’ అంటోందీ ఆర్టిస్ట్‌.

ఇందులోనే ఆనందముంది!

సినిమా కోసం ఎంత కష్టపడితే అంత సంతోషంగా, రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుందంటోందీ ట్యాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌. ‘నేను సైకాలజీలో పీహెచ్‌డీ చేశా. అందుకే ఎలాంటి భావోద్వేగానికైనా సులభంగా కనెక్ట్‌ కాగలుగుతా. సీన్‌కి తగినట్లుగా తక్కువ స్వరంతో ఎమోషన్స్‌ పండించగలను. అదే దెయ్యం పాత్రకు తగినట్లుగా ప్రేక్షకుల్లో భయం రెట్టింపు చేయడానికి మరింత గట్టిగా అరవగలను.. ఏదేమైనా.. నా అరుపులు, కేకలు ప్రేక్షకులకు కలకాలం గుర్తుండిపోతే చాలు! ఓ బ్యాక్‌గ్రౌండ్‌ ఆర్టిస్ట్‌గా ఎంత కష్టపడితే అంత రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది. ఒక్కోసారి రోజుకు 8-10 గంటలు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. అయినా అందులో శ్రమ తెలియదు. పని ఇష్టంతో చేస్తే కష్టమనిపించదంటారు. అలాగే నేనూ నా వృత్తిని ఆస్వాదిస్తున్నా. ఇక షూటింగ్స్‌ లేనప్పుడు టీ తాగుతూ రిలాక్సవుతా!’ అంటోంది ఆష్లే. తన ప్రతిభకు గుర్తింపుగా పలు అవార్డులు-రివార్డులు అందుకున్న ఈ అందాల ఆర్టిస్ట్‌.. 2010లో స్టీవ్‌ హర్డిల్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఓ పాప.

ఇలా తన నైపుణ్యంతో ఓవైపు పేరుప్రఖ్యాతులే కాదు.. మరోవైపు కోట్లలో డబ్బూ సంపాదిస్తోందీ వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌. మనలో ఉన్న ఏ ట్యాలెంటూ వృథా కాదని, దాన్ని సద్వినియోగం చేసుకుంటే నలుగురిలో ఒక్కరిగా గుర్తింపు సంపాదించచ్చని తన మాటలతోనూ ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది ఆష్లే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్