TIME’s 100: వాటి కోసం ‘న్యాయ’ పోరాటం చేస్తోంది!

మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో కొందరు తమ వృత్తి ఉద్యోగాలు, వ్యాపారాలతో సమాజంలో మార్పు కోసం అలుపెరుగని ప్రయత్నం చేస్తుంటారు. తమ వంతుగా ఈ సమాజానికి ఏదైనా చేయాలని ఆరాటపడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వారిని....

Updated : 24 May 2022 19:45 IST

(Photo: Screengrab)

మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో కొందరు తమ వృత్తి ఉద్యోగాలు, వ్యాపారాలతో సమాజంలో మార్పు కోసం అలుపెరుగని ప్రయత్నం చేస్తుంటారు. తమ వంతుగా ఈ సమాజానికి ఏదైనా చేయాలని ఆరాటపడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వారిని ఎంపిక చేసి.. ఏటా ‘వందమంది ప్రభావశీలుర జాబితా’లో చోటిస్తుంటుంది ప్రముఖ పత్రిక టైమ్‌. అలా ఈ ఏడాదికి గాను భోపాల్‌కు చెందిన కరుణా నంది ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తోన్న ఆమె.. ఈ లిస్టులో స్థానం సంపాదించిన ఏకైక భారతీయురాలు కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ మహిళా న్యాయవాది గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!

అమ్మానాన్నలే స్ఫూర్తి..!

రాజ్యాంగం, మహిళా హక్కులు, మానవ హక్కులు.. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ మూడు అంశాలపై తన గళాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా వినిపిస్తుంటారు 46 ఏళ్ల కరుణా నంది. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తోన్న ఆమె.. భోపాల్‌లో పుట్టి పెరిగారు. ఈ సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలన్న తపన తనకు చిన్నతనం నుంచే అలవడింది. అందుకు ఆమె తల్లిదండ్రులే స్ఫూర్తి అని చెబుతున్నారు కరుణ. ఎందుకంటే వాళ్లు కూడా తమకు విదేశాల్లో, అదీ ఉన్నత స్థాయి ఉద్యోగావకాశాలు వచ్చినా.. దేశాభివృద్ధి కోసం పాటుపడాలన్న ఆకాంక్షతో వాటిని తృణప్రాయంగా వదులుకున్నారు. ఈ క్రమంలో ఆమె తండ్రి హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌లో పనిచేసే అవకాశం వదులుకొని.. ఎయిమ్స్‌లో వైద్యునిగా సెటిలయ్యారు. మరోవైపు తన తల్లి ‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ హిస్టరీ ప్రైజ్‌’ గెలుచుకున్నప్పటికీ.. కరుణ కజిన్‌ సెరెబ్రల్‌ పాల్సీతో జన్మించడంతో.. సమాజంలో ఈ వ్యాధిపై అవగాహన తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తున్నారామె.

జర్నలిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించి..!

ఇలా తల్లిదండ్రుల సేవాభావాన్ని పుణికిపుచ్చుకున్న కరుణ.. తానూ తన వృత్తినైపుణ్యాలతో ఈ సమాజంలో మార్పు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఈ దిశగానే చదువు కొనసాగించారామె. దిల్లీ యూనివర్సిటీకి చెందిన సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాలలో ఎకనమిక్స్‌ విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన కరుణ.. కొన్నాళ్ల పాటు టీవీ జర్నలిస్ట్‌గా విధులు నిర్వర్తించారు. ఆపై ‘కేంబ్రిడ్జి యూనివర్సిటీ’లో లా చదువుతున్న సమయంలోనే ‘Emmeline Pankhurst Prize’, ‘The Amy Cohen Award’, ‘The Becker Studentship’.. వంటివి గెలుచుకున్నారు. ఆ తర్వాత ‘కొలంబియా యూనివర్సిటీ’లో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసిన ఆమె.. అక్కడే ప్రతిష్టాత్మక ‘మానవ హక్కుల ఫెలోషిప్‌’నూ గెలుచుకున్నారు. ఇలా చదువు పూర్తి కాగానే కొన్నేళ్ల పాటు ఐక్యరాజ్య సమితిలో న్యాయవాదిగా పనిచేశారు.

వికలాంగ హక్కుల విజయమది!

ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తోన్న కరుణ.. రాజ్యాంగం, మీడియా, లింగ సమానత్వం, సాంకేతికత, వాణిజ్యం, అంతర్జాతీయ చట్టాలపై పోరాడడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే 2016లో వికలాంగ హక్కుల కార్యకర్త జీజా ఘోష్‌ కేసును టేకప్‌ చేసి విజయం సాధించారు.

సెరెబ్రల్‌ పాల్సీతో జన్మించిన జీజా ఒక రోజు కోల్‌కతా నుంచి గోవాకు వెళ్లడానికి స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌ను ఎంచుకున్నారు. అయితే బోర్డింగ్‌ సమయంలో తన వైకల్యం కారణంగా అక్కడి సిబ్బంది వ్యవహరించిన తీరుతో కలత చెందిన ఆమె.. ఆ విమానయాన సంస్థకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు నమోదు చేశారు. ఈ కేసును వాదించిన కరుణ విజయం సాధించారు. ఇందుకు ప్రతిగానే సుప్రీంకోర్టు.. అన్ని విమానయాన సంస్థలు.. వైకల్యం, ఇతర శారీరక-మానసిక లోపాలున్న వారినీ సాధారణ వ్యక్తులతో సమానంగా పరిగణించాలని, ప్రయాణాల్లో వాళ్ల అవసరాలు, చికిత్సను దగ్గరుండి చూసుకోవడానికి సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని తీర్పునిచ్చింది. అంతేకాదు.. సదరు విమానయాన సంస్థ జీజాకు రూ. 10 లక్షలు చెల్లించాలని కూడా ఆదేశించింది.

ఎన్నెన్నో కేసులు.. అన్నింటా విజయాలు!

2012లో దిల్లీ సామూహిక అత్యాచార ఘటన (నిర్భయ ఉదంతం) తర్వాత అత్యాచార నిరోధక బిల్లును రూపొందించడంలో కరుణ కీలక పాత్ర పోషించారు. అంతేకాదు.. 1984లో జరిగిన భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన బాధితుల తరఫున సుప్రీంకోర్టులో వాదించి.. వారికి మెరుగైన ఆరోగ్య, వైద్య సేవలు అందించేలా చొరవ చూపారు. పని ప్రదేశంలో జరిగే లైంగిక వేధింపులకు సంబంధించిన పలు కేసుల్ని వాదించి విజయం సాధించారామె. ఇక వైవాహిక అత్యాచారం విషయంలో మహిళల హక్కుల్ని కాపాడేందుకు న్యాయ పోరాటం సాగిస్తున్నారు కరుణ. మరోవైపు అంతర్జాతీయ వేదిక పైనా వాక్‌ స్వాతంత్ర్యం కోసం కృషి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్ఛకు మద్దతు తెలిపే ‘యూకే ప్యానల్‌’లోనూ భాగమయ్యారామె. అలాగే కొలంబియా యూనివర్సిటీకి చెందిన ‘గ్లోబల్‌ ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌’ నిపుణుల ప్యానల్‌లోనూ సభ్యురాలిగా పని చేస్తున్నారు. ఇక మానవ హక్కులు, మహిళా హక్కులు, వాక్‌ స్వాతంత్ర్యం, చట్టాలకు సంబంధించి తీసుకురావాల్సిన మార్పులు-చేర్పులు.. తదితర అంశాల గురించి జాతీయ, అంతర్జాతీయ వేదికల పైనా ప్రసంగిస్తుంటారు కరుణ.

నా క్లైంట్స్‌ కాదు.. పార్ట్‌నర్స్!

తన వద్దకొచ్చిన ఏ కేసైనా టేకప్‌ చేసే ముందు పలు అంశాలు పరిగణనలోకి తీసుకుంటానని చెబుతున్నారు కరుణ. ‘నా వద్దకొచ్చే ప్రతి కేసును లోతుగా విశ్లేషించడం నాకు అలవాటు. దాని వల్లే అది సంక్లిష్టమైందా? లేదంటే సునాయాసంగా ముందుకెళ్తుందా? అన్న విషయాలు అవగతమవుతాయి. ఒక్కోసారి మనం నిజాయతీగా ఉన్నప్పటికీ అది తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు పట్టుదలతో ప్రయత్నించినప్పుడే న్యాయం గెలుస్తుంది. ప్రపంచమంతా ఒక వైపు, మనం మరో వైపు ఉన్నా.. వెనకడుగు వేయకుండా పోరాడగలగాలి. ఇదే నేను నమ్మే న్యాయ సూత్రం..! చాలామంది కేసు విషయంలో నన్ను సంప్రదిస్తుంటారు. వాళ్లను నా క్లైంట్స్‌లా కాదు.. కేసులో పార్ట్‌నర్స్‌లా భావిస్తాను. ఎందుకంటే కేసు గురించి నాకెంత తెలుసో.. వాళ్లూ అంతే తెలుసుకోగలగాలి. కేసుకు సంబంధించి ఏది అవసరమో, ఏది అనవసరమో గ్రహించగలగాలి. అందుకే కేసు నాకు అప్పగించి వాళ్లు చేతులు దులుపుకుంటానంటే నేను అస్సలు ఒప్పుకోను. వాళ్లనూ ఇందులో భాగం చేస్తేనే కేసు త్వరగా కొలిక్కి వస్తుంది.. బాధితులకూ సత్వరమే న్యాయం జరుగుతుందని భావిస్తా..’ అంటారు కరుణ.

అప్పుడు ఫోర్బ్స్‌.. ఇప్పుడు టైమ్!

తన సుదీర్ఘ న్యాయవాద వృత్తిలో ఎన్నో విజయాలు సాధించిన కరుణ.. 2020లో ఫోర్బ్స్‌ విడుదల చేసిన ‘సెల్ఫ్‌ మేడ్‌ విమెన్‌’ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా సమాజానికి ఆమె చేస్తోన్న సేవల్ని గుర్తు చేసుకున్న ఈ పత్రిక.. ‘అత్యంత ప్రతిభావంతురాలి’గా ఆమెను కొనియాడింది. తాజాగా టైమ్ పత్రిక విడుదల చేసిన ‘ప్రపంచంలో వంద మంది అత్యంత ప్రభావశీలుర’ జాబితాలోనూ స్థానం సంపాదించి మరోసారి తన సత్తా చాటారు కరుణ. ఇక ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయురాలు ఆమే కావడం విశేషం!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్