కొరియన్.. అయినా ఒడిస్సీ నృత్యం అదరగొట్టేస్తోంది!

కొరియా అంటే పాప్‌ సంగీతం, తైక్వాండో యుద్ధ విద్యకు పెట్టింది పేరు. ఇక ఆ దేశంలో పుట్టిన వారు తమ దేశానికి చెందిన ఈ కళలపై మక్కువ పెంచుకోవడం సహజం. కానీ దక్షిణ కొరియాలో పుట్టి.. భారత దేశానికి చెందిన సంప్రదాయ నృత్యం ఒడిస్సీపై మక్కువ పెంచుకుంది 45 ఏళ్ల బీనా క్యుమ్...

Published : 09 Oct 2022 16:58 IST

(Photos: Instagram)

కొరియా అంటే పాప్‌ సంగీతం, తైక్వాండో యుద్ధ విద్యకు పెట్టింది పేరు. ఇక ఆ దేశంలో పుట్టిన వారు తమ దేశానికి చెందిన ఈ కళలపై మక్కువ పెంచుకోవడం సహజం. కానీ దక్షిణ కొరియాలో పుట్టి.. భారత దేశానికి చెందిన సంప్రదాయ నృత్యం ఒడిస్సీపై మక్కువ పెంచుకుంది 45 ఏళ్ల బీనా క్యుమ్. అదెంతలా అంటే.. తన కళాశాల చదువును మధ్యలోనే ఆపి.. ఇక్కడికొచ్చి ఒడిస్సీ నేర్చుకునేంతలా! ఈ ఇష్టమే ఆమెను ఒడిస్సీ నేర్చుకున్న తొలి కొరియన్‌ మహిళగా ప్రత్యేకంగా నిలబెట్టింది. ప్రస్తుతం దేశ విదేశాల్లో ప్రతిష్టాత్మక వేదికలపై ఎన్నో ప్రదర్శనలిస్తూ.. ప్రొఫెషనల్‌ నృత్యకారిణిగా ఎదిగిన బీనా ఇటీవలే మరో వేదికపై మెరిసింది. తన అద్భుత నృత్య ప్రదర్శనతో మరోసారి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ‘రెండు సంప్రదాయాలు ఒక్కచోట చేరితే.. అంతకంటే అత్యద్భుతం మరొకటి ఉండదం’టూ ఆమె చేసిన ఈ డ్యాన్స్‌ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో అసలు బీనాకు ఒడిస్సీ నేర్చుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకుందాం రండి..

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పుట్టిపెరిగింది బీనా. 20 ఏళ్ల వయసులో అక్కడి సోగంగ్‌ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు భారతీయ చిత్ర దర్శకురాలు మీరా నాయర్‌ రూపొందించిన ‘కామసూత్ర’ చిత్రం చూసిందామె. అందులోని ఒడిస్సీ నృత్యానికి సంబంధించిన సన్నివేశాలు చూసి ముగ్ధురాలైంది. ఆ తర్వాత ఎన్నోసార్లు అవే సీన్స్‌ని మళ్లీ మళ్లీ చూస్తూ ఇంట్లోనే ఈ నృత్య రీతిని సాధన చేయడం ప్రారంభించింది బీనా.

చదువు మధ్యలోనే ఆపేసి..!

ఇలా ఒడిస్సీ నృత్య రీతికి ఫిదా అయిపోయిన బీనా.. ఎలాగైనా ఇందులో పూర్తి నైపుణ్యాలు సాధించాలనుకుంది. కానీ అదెలాగో ఆమెకు అర్థం కాలేదు. ఆపై కొన్నాళ్లకు బుద్ధిజంలో మాస్టర్స్‌ చదవాలని శ్రీలంకలోని కొలంబో చేరుకుందామె. ఒడిస్సీ నృత్యం గురించి మరింత లోతుగా తెలుసుకునేందుకు అక్కడి భారతీయ రాయబార కార్యాలయాన్ని సందర్శించింది బీనా. ఈ క్రమంలోనే ఒడిస్సీ గురువుల గురించి తెలుసుకున్న ఆమె.. తన చదువును మధ్యలోనే ఆపేసి.. ఒడిశా చేరుకుంది. పద్మశ్రీ గురు గంగాధర్‌ ప్రధాన్‌ దగ్గర శిక్షణలో చేరింది.

‘ఏదైనా కళ నేర్చుకోవాలని సంకల్పించుకుంటే సరిపోదు.. దాని పూర్వాపరాల పైనా దృష్టి పెట్టాలి. ఒడిశా నృత్య రీతి నేర్చుకోవాలంటే ముందుగా హిందూ సంప్రదాయాలు, ఇక్కడి జీవనశైలి, స్థానిక భాష.. వంటివన్నీ అవపోసన పట్టాలి. నేనూ అదే చేశా..’ అంటోంది బీనా.

పట్టుదలతోనే ఇది సాధ్యమైంది!

ఏదైనా నేర్చుకోవాలన్న తపన, పట్టుదల ఉంటే.. తక్కువ సమయంలోనే ఆ కళలో ఆరితేరచ్చు. బీనా కూడా ఇదే నిరూపించింది. 2005లో ఒడిస్సీ నృత్యంలో పరకాయ ప్రవేశం చేసిన బీనా.. ఏడాది కాలంలోనే ఈ నృత్యంలో పూర్తి మెలకువలు నేర్చుకుంది. 2006లో భువనేశ్వర్‌లో తన తొలి ప్రదర్శన ఇచ్చిందామె. ఆపై దిల్లీ, కోల్‌కతా, బెంగళూరు.. వంటి ప్రధాన నగరాలతో పాటు కొరియాలోని ప్రముఖ పట్టణాల్లోనూ ఆమె తన నాట్య ప్రదర్శన చేసింది. ప్రస్తుతం వివిధ దేశాల్లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ తన ప్రదర్శనతో నాట్య ప్రియుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది బీనా. ఈ క్రమంలోనే ఇటీవలే ఓ వేదికపై దక్షిణ కొరియా పాటకు ఆమె చేసిన ఒడిస్సీ నృత్యం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘రెండు దేశాల సంప్రదాయాలు ఒక్క చోట చేరితే.. అంతకంటే అపురూప దృశ్యం మరొకటి ఉండదేమో!’ అన్న క్యాప్షన్‌తో కూడిన ఈ వీడియోలో బీనా డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘అద్భుతమైన ప్రదర్శన’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఆర్థిక కష్టాల్ని అలా ఎదుర్కొన్నా!

ప్రస్తుతం ఇటు భువనేశ్వర్‌, అటు సియోల్‌.. రెండు నగరాలకూ రాకపోకలు సాగిస్తూ తన ప్రదర్శనలు కొనసాగిస్తోంది బీనా. ‘భారత్‌ నా మాతృదేశం.. కొరియా నా పితృదేశం’ అంటోన్న ఆమె.. నృత్యం నేర్చుకోవాలనుకున్న తొలి రోజుల్లో పలు సవాళ్లను ఎదుర్కొన్నానంటోంది. ‘ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే మధ్యలో ఎదురొచ్చే ఎన్నో సవాళ్లను అధిగమించాలి. ఒడిస్సీ నేర్చుకోవాలనుకున్న తొలి రోజుల్లో నేను ఆర్థికంగా పలు సమస్యల్ని ఎదుర్కొన్నా. వీటిని అధిగమించడానికి కొన్నేళ్ల క్రితం ‘ఆర్ట్‌ బీనా’ పేరుతో సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ని ప్రారంభించా. ఈ వేదికగా ఔత్సాహికులకు ఒడిస్సీ నృత్యం నేర్పుతున్నా. మరోవైపు ప్రత్యక్షంగానూ ఈ నృత్య శిక్షణ తరగతులు, వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తున్నా. నా స్టూడెంట్స్‌కి నేను చెప్పేది ఒక్కటే.. మనలోని తపనకు పదును పెడితే అదే మనల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది..’ అంటోందీ ఒడిస్సీ నృత్యకారిణి.

బీనా డ్యాన్సరే కాదు.. రచయిత్రి కూడా! ఒడిస్సీ నేర్చుకునే క్రమంలో తనకు ఎదురైన అనుభవాలు, అనుభూతుల్ని రంగరించి కొరియా భాషలో ఓ పుస్తకం రాసిందామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్