Aditi Sen: ‘క్వాంటమ్‌’కు కాంతి రేఖ!

నలుగురిలో ఒకరిగా మిగిలిపోకుండా.. ఒక్కరిగా రాణించాలని ఆరాటపడుతుంటారు కొందరు. ఇదే వారిని అందలమెక్కిస్తుంది. భారతీయ మహిళా శాస్త్రవేత్త అదితి సేన్‌ దే కూడా తాజాగా ఇలాంటి అరుదైన గుర్తింపునే సంపాదించుకున్నారు....

Published : 24 Feb 2024 19:53 IST


(Image Source : Twitter)

నలుగురిలో ఒకరిగా మిగిలిపోకుండా.. ఒక్కరిగా రాణించాలని ఆరాటపడుతుంటారు కొందరు. ఇదే వారిని అందలమెక్కిస్తుంది. భారతీయ మహిళా శాస్త్రవేత్త అదితి సేన్‌ దే కూడా తాజాగా ఇలాంటి అరుదైన గుర్తింపునే సంపాదించుకున్నారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో లోతుగా అధ్యయనాలు చేస్తూ.. అధునాతన మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తోన్న ఆమె తాజాగా ప్రతిష్టాత్మక ‘జీడీ బిర్లా అవార్డ్‌ ఫర్‌ సైంటిఫిక్‌ ఎక్స్‌లెన్స్‌’ పురస్కారం అందుకున్నారు. తద్వారా ఈ అవార్డు గెలుచుకున్న తొలి మహిళా శాస్త్రవేత్తగా కీర్తి గడించారు. ఈ నేపథ్యంలో అదితి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

సాధారణ కంప్యూటర్లు, సూపర్‌ కంప్యూటర్ల గురించి మనకు తెలిసిందే! ఈ రెండింటికీ అధునాతన వెర్షనే క్వాంటమ్‌ కంప్యూటర్లు. సూపర్‌ కంప్యూటర్లు కూడా పరిష్కరించలేని అతి క్లిష్టమైన సమస్యల్ని పరిష్కరించడానికి క్వాంటమ్‌ కంప్యూటర్లు ఉపయోగపడతాయి. క్వాంటమ్‌ ఫిజిక్స్‌కు సంబంధించిన నిర్దిష్ట సూత్రాల ఆధారంగా ఈ కంప్యూటర్లు పనిచేస్తాయి. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న అడ్వాన్స్‌డ్‌ కంప్యూటర్లు, వాటి కంప్యూటింగ్‌ టెక్నాలజీపై లోతుగా పరిశోధనలు చేస్తున్నారు అదితి. ఈ క్రమంలోనే క్వాంటమ్‌ సమాచారం-కంప్యుటేషన్‌, క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌, క్వాంటమ్‌ క్రిప్టోగ్రఫీ, క్వాంటమ్‌ ఆప్టిక్స్‌.. తదితర అంశాలపై ఆమె తన అధ్యయనాన్ని కొనసాగిస్తున్నారు.

పరిశోధనలే ఊపిరిగా!
అదితిది కోల్‌కతా. ఆమె తల్లి స్కూల్‌ టీచర్‌ కాగా, తండ్రి రాష్ట్ర ప్రభుత్వోద్యోగి. కోల్‌కతాలోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసిన ఆమెకు చిన్నతనం నుంచి గణితం, భౌతికశాస్త్రాలంటే ఎంతో మక్కువ. ఈ ఇష్టంతోనే కలకత్తా యూనివర్సిటీకి చెందిన బేథూన్‌ కాలేజీలో గణితంలో బీఎస్సీ (ఆనర్స్‌) పూర్తిచేశారు అదితి. ఆపై అదే యూనివర్సిటీకి చెందిన రాజాబజార్‌ సైన్స్‌ కాలేజీలో అప్లైడ్‌ మ్యాథమెటిక్స్‌ విభాగంలో చేరారు. దీంతో పాటు భౌతిక శాస్త్రంపై మక్కువతో క్వాంటమ్‌-స్టాటిస్టికల్‌ ఫిజిక్స్‌లోనూ మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఇక్కడే పరిశోధనలు సాగించిన అదితి.. ఆపై పోలండ్‌ వెళ్లి అక్కడి ‘Gdansk University’ లో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. తన అధునాతన పరిశోధనల ఫలితంగా జర్మనీలోని ‘Leibniz University’లో రీసెర్చ్‌ ఫెలోగా పనిచేసే అవకాశం అదితికి దక్కింది. ఆ తర్వాత స్పెయిన్‌ బార్సిలోనాలోని ‘ఐసీఎఫ్‌వో - ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫోటానిక్‌ సైన్సెస్‌’ అనే రీసెర్చ్‌ సెంటర్‌లో చేరారు అదితి. ఇక్కడ ‘క్వాంటమ్‌ ఇన్ఫర్మేషన్‌ థియరీ’, ‘మ్యాటర్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ ఫిజిక్స్‌’ అనే అంశాలపై తాను చేసిన పరిశోధనలకు గాను ‘Ramony Cajal Research Fellowship’ ఆమెను వరించింది. ఇక 2008లో ఇండియాకు తిరిగొచ్చిన అదితి.. ‘జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ’లో ఫిజిక్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. అక్కడ ఏడాది పాటు పనిచేసిన ఆమె.. 2009 నుంచి అలహాబాద్‌లోని ‘హరీష్‌ చంద్ర రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’లో ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు.

భర్తతో కలిసి!
చదువుకొనే రోజుల నుంచే పరిశోధనలపై దృష్టి పెట్టిన ఆమె.. అటు ప్రొఫెసర్‌గా కొనసాగుతూనే ఇటు రీసెర్చర్‌గానూ సేవలందిస్తున్నారు. క్వాంటమ్‌ క్రిప్టోగ్రఫీ, క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌తో పాటు.. క్వాంటమ్‌ సైన్స్‌లోని ఎంటాంగిల్‌మెంట్‌ థియరీకి సంబంధించిన ప్రాథమిక సమస్యల్ని విశ్లేషించడంలో కృషి చేశారామె. ‘హరీష్‌ చంద్ర రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’లో పనిచేస్తోన్న తోటి ప్రొఫెసర్‌, సహ పరిశోధకులైన ఉజ్వల్‌ సేన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు అదితి. వీరికి ఓ కూతురుంది. ఇక తన భర్తతో కలిసి పలు అంశాలపై పరిశోధనలు కూడా సాగించారామె. అంతేకాదు.. ఇదే విశ్వవిద్యాలయంలో తన భర్త, మరో రీసెర్చర్‌తో కలిసి 2009లో ‘క్వాంటమ్‌ ఇన్ఫర్మేషన్‌-కంప్యూటింగ్‌ గ్రూప్‌’ను ప్రారంభించారామె. ఈ వేదికగానే యువ పరిశోధకులు, పీహెచ్‌డీ విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నారు అదితి. ఇలా ఈ విద్యార్థుల బృందం ఫిజిక్స్‌లో జరిపిన 50కి పైగా పరిశోధన ప్రతులు పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. మరోవైపు తాను, తన బృందం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కాన్ఫరెన్సులు, వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తూ.. సైన్స్‌ ఔత్సాహికుల్లో స్ఫూర్తి నింపడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు అదితి. ఇలా ఆమె సాగించిన పరిశోధనలకు సంబంధించిన పత్రాలు, ఆమె రాసిన వ్యాసాలు ప్రముఖ జర్నల్స్‌లోనూ ప్రచురితమయ్యాయి.

కృషికి ప్రతిఫలం!
ఇలా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆమె చేస్తోన్న పరిశోధనలు, అధునాతన మార్పులు తీసుకొచ్చేందుకు ఆమె సాగిస్తోన్న కృషికి గుర్తింపుగా పలు అవార్డులు-రివార్డులు అదితికి దక్కాయి. ఈ క్రమంలోనే 2012లో ‘ఇండియన్‌ ఫిజిక్స్‌ అసోసియేషన్‌’ నుంచి ‘Biennial Buti Foundation Award’ అందుకున్నారామె. ఆపై 2018లో ‘కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌’ ప్రతిష్టాత్మక ‘శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ ప్రైజ్‌’తో ఆమెను సత్కరించింది. ‘ఫిజిక్స్‌’ విభాగంలో ఈ అవార్డు అందుకున్న తొలి మహిళ అదితే కావడం విశేషం. ఇక తాజాగా ప్రతిష్టాత్మక ‘జీడీ బిర్లా అవార్డ్‌ ఫర్‌ సైంటిఫిక్‌ ఎక్స్‌లెన్స్‌’ పురస్కారమూ అదితిని వరించింది. 50 ఏళ్ల లోపున్న మేటి భారతీయ శాస్త్రవేత్తలకు ‘కేకే బిర్లా ఫౌండేషన్‌’ ఏటా ఈ అవార్డును అందిస్తుంది. ఇప్పటివరకు ఈ అవార్డు 33 మంది శాస్త్రవేత్తలకు దక్కగా.. వారిలో అదితి ఒక్కర్తే మహిళ. ఇలా ఈ అవార్డు అందుకున్న తొలి మహిళగానూ ఖ్యాతి గడించారీ మేటి సైంటిస్ట్‌. 2022లో ‘ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌’, ‘ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమీ’ల్లో సభ్యురాలిగానూ కొనసాగారు అదితి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్