Wedding Tips : దుపట్టాను ఇలా స్టైలిష్‌గా చుట్టేద్దాం!

ఈ కాలపు పెళ్లిళ్లలో వధువులైనా, తోడు పెళ్లి కూతుళ్లైనా లెహెంగాలకే ఓటేస్తున్నారు. వాటితో అటు ట్రెడిషనల్‌గా మెరిసిపోతూనే.. కాస్త మోడ్రన్‌ టచ్‌నీ జోడిస్తున్నారు.

Published : 12 Feb 2024 12:46 IST

(Photos: Instagram)

ఈ కాలపు పెళ్లిళ్లలో వధువులైనా, తోడు పెళ్లి కూతుళ్లైనా లెహెంగాలకే ఓటేస్తున్నారు. వాటితో అటు ట్రెడిషనల్‌గా మెరిసిపోతూనే.. కాస్త మోడ్రన్‌ టచ్‌నీ జోడిస్తున్నారు. అయితే లెహెంగాను ఎంచుకోవడంతోనే సరిపోదు.. వాటి దుపట్టాను ధరించడంలో కాస్త వైవిధ్యం ప్రదర్శిస్తేనే అందంగా మెరిసిపోవచ్చంటున్నారు నిపుణులు. మరి, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలవాలంటే.. ఈ విభిన్న దుపట్టా డ్రేపింగ్‌ స్టైల్స్‌ గురించి తెలుసుకోవాల్సిందే!

సంప్రదాయబద్ధంగా..!

చీర కట్టుకున్నప్పుడు పైట కొంగును తల పైనుంచి ధరించడం మన సంప్రదాయం. మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో మహిళలు ఇలా ధరించడం చూస్తుంటాం. అయితే చీరే కాదు.. లెహెంగా దుపట్టానూ ఇదే తరహాలో ధరించి మెరిసిపోవచ్చంటున్నారు నిపుణులు. దుపట్టాను తలపై నుంచి వేసుకొని.. మరో చివరను భుజం పైనుంచి ధరించడం వల్ల.. హుందాతనం ఉట్టిపడుతుంది. అలాగే ఈ తరహా డ్రేపింగ్‌తో ఛాతీ, నడుముని కూడా దుపట్టాతో కవర్‌ చేసుకోవచ్చు.


కేప్‌ డ్రేపింగ్‌తో.. కూల్‌ లుక్‌!

లెహెంగాతో అటు సంప్రదాయబద్ధంగా కనిపిస్తూనే.. కాస్త మోడ్రన్‌ టచ్‌నీ జోడించాలనుకుంటున్నారు ఈ కాలపు అమ్మాయిలు. ఇలాంటి వారికి షోల్డర్‌ డ్రేపింగ్‌ స్టైల్‌ చక్కగా నప్పుతుంది. ఇందులో భాగంగా దుపట్టాను భుజాలపై నుంచి వెనక నుంచి ముందుకు ధరించాల్సి ఉంటుంది. దుపట్టా జారిపోకుండా పిన్నులతో బ్లౌజ్‌కు అటాచ్‌ చేస్తే సరిపోతుంది.. లేదంటే బోర్డర్‌ మెడ చుట్టూ వచ్చేలా ఇరువైపుల నుంచి లాగి ఓ పిన్‌ పెట్టేసినా అందంగానే కనిపిస్తుంది. చూడ్డానికి లాంగ్‌ కేప్‌ తరహాలో ఉండే ఈ డ్రేపింగ్‌ స్టైల్‌తో వేడుకలో అందరి దృష్టినీ ఇట్టే ఆకర్షించేయచ్చు.


రాయల్‌గా కనిపించాలంటే..!

పెళ్లిలో, ఇతర వేడుకల్లో రాయల్‌గా కనిపించాలని ఎవరికుండదు చెప్పండి? లెహెంగాతో మీరూ ఇలాగే మెరిసిపోవాలనుకుంటున్నారా? అయితే ఈ రాయల్‌ డ్రేపింగ్‌ గురించి తెలుసుకోవాల్సిందే! ఇందులో భాగంగా దుపట్టాను తలపై నుంచి ధరించి.. ఓవైపు భుజానికి ముందువైపు వచ్చేలా సెట్‌ చేసుకోవాలి. మరోవైపు దుపట్టాను మోచేతుల పైనుంచి ధరించాలి. ఈ తరహా డ్రేపింగ్‌తో లుక్‌ ఇనుమడించడమే కాదు.. హుందాతనమూ ఉట్టిపడుతుంది. ఇందులోనే కాస్త మోడ్రన్‌గా ప్రయత్నించాలనుకునే వారు.. దుపట్టాను తలపై నుంచి కాకుండా.. నడుం దగ్గర వెనక నుంచి ముందుకి ధరిస్తూ.. దుపట్టా చివర్లను రెండు మోచేతులపై వచ్చేలా చూసుకుంటే లుక్‌ అదిరిపోతుంది.


మణికట్టుకు బంధించేద్దామా?

కొంతమంది దుపట్టాను తల పైనుంచి ధరించి అలాగే వదిలేస్తుంటారు. తల వద్ద పిన్నులతో బిగించినా ఒక్కోసారి ఇది జారిపోవచ్చు.. లేదంటే కొంతమంది దుపట్టాను పదే పదే చేత్తో సర్దుకుంటుంటారు. ఈ శ్రమ లేకుండా కంఫర్టబుల్‌గా కనిపించాలంటే.. దుపట్టా ఓ చివరను తీసుకొని దాని బోర్డర్‌ బయటికి కనిపించేలా మణికట్టుకు బిగించాలి. ఇలా రెండువైపులా, రెండు మణికట్టులకూ దుపట్టాను అనుసంధానించుకోవచ్చు. ఇది చూడ్డానికి క్లాసీగా కనిపించడంతో పాటు స్టైలిష్‌ లుక్‌నీ అందిస్తుంది.


ఓణీలా వేసేద్దాం!

లంగా-ఓణీ మనకు కొత్త కాదు.. అయితే ఇందులో ఓణీ వేసుకున్నట్లే లెహెంగా దుపట్టానూ డ్రేప్‌ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. పైగా ఈ డ్రేపింగ్‌ స్టైల్‌ ఈమధ్య కాలంలో చాలామంది అమ్మాయిలు అనుసరించేస్తున్నారు కూడా! ఇందులో భాగంగా దుపట్టాను ఛాతీ కవరయ్యేలా సాధారణ ఓణీలా వేసేసుకోవచ్చు.. లేదంటే నడుం దగ్గర్నుంచి కొంగును తీసుకొచ్చే దిశలో వదులుగా అలా వదిలేయచ్చు. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించే ఈ డ్రేపింగ్‌ లుక్‌ని ఇష్టపడని అమ్మాయి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇదనే కాదు.. మనం సాధారణంగా అనార్కలీ, కుర్తీలపై చున్నీని మెడ భాగంలో ముందు నుంచి వెనక్కి లేదంటే ఒక భుజం పైనుంచే ధరిస్తుంటాం. అచ్చం ఇదే తరహాలో లెహెంగా దుపట్టాను ధరించి మెరిసిపోవచ్చు.


రెండు దుపట్టాలతో..!

లెహెంగాతో వచ్చిన మ్యాచింగ్‌ దుపట్టాను విభిన్న రకాలుగా ధరించడం కామన్‌! కానీ ఆ దుపట్టాతో పాటు దానికి వ్యతిరేక రంగుల్లో ఉండే మరో దుపట్టాను ఎంచుకొని.. రెండింటినీ కలిపి ధరించడం లేటెస్ట్‌ ట్రెండ్‌. ఇందులో భాగంగా ఒక దుపట్టాను తల పైనుంచి భుజం ముందు భాగంలో వచ్చేలా సెట్‌ చేసుకొని.. మరో దుపట్టాను రెండో భుజం పైనుంచి వేసుకుంటే.. లుక్‌ ఇనుమడిస్తుంది. ఇందులోనే ట్రెడిషనల్‌ టచ్‌ ఇవ్వాలనుకుంటే.. ఒక దుపట్టాను సాధారణంగా లంగా-ఓణీ స్టైల్‌లో వేసుకొని.. మరో దుపట్టాను తల పైనుంచి భుజం ముందు భాగంలో వచ్చేలా కూడా ధరించచ్చు. ఇలా ఈ డ్రేపింగ్‌ స్టైల్‌ మనల్ని రాయల్‌గా కనిపించేలా చేస్తుంది.

ఇలా మీరు ఎంచుకునే దుపట్టా డ్రేపింగ్‌ స్టైల్‌కు తగినట్లుగా హెయిర్‌ స్టైల్‌, మేకప్‌తో హంగులద్దితే వేడుకేదైనా సరే.. మీరే సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలవచ్చు.. ఇంకెందుకాలస్యం.. ట్రై చేసేయండి మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్