పూలతో సబ్బులు చేస్తా..!

రాలిపోయిన ఆకులూ, ఎండిపోయిన పువ్వులూ కనిపిస్తే తీసి పడేయడమే మనకి తెలుసు. వీటితో కూడా సౌందర్య ఉత్పత్తులు తయారు చేస్తున్నారు విశాఖపట్నానికి చెందిన కాకొల్లు వాసవీకాంత్‌.

Updated : 28 Jan 2023 07:15 IST

రాలిపోయిన ఆకులూ, ఎండిపోయిన పువ్వులూ కనిపిస్తే తీసి పడేయడమే మనకి తెలుసు. వీటితో కూడా సౌందర్య ఉత్పత్తులు తయారు చేస్తున్నారు విశాఖపట్నానికి చెందిన కాకొల్లు వాసవీకాంత్‌. మరెందరో గిరిజన మహిళలకు ఉపాధినీ కల్పిస్తున్నారు. ఆ అనుభవాల్ని వసుంధరతో పంచుకున్నారిలా...

న ఆలోచనల్లో స్పష్టత ఉంటే... ఎవరేం అనుకున్నా, ఎందరు కాదన్నా కూడా అనుకున్నది సాధించొచ్చు. ఇది నా స్వీయానుభవం. లక్షల ఆదాయాన్నిచ్చే బ్యూటీ క్లినిక్‌లను తీసేసి, సహజ సౌందర్య ఉత్పత్తుల తయారీ మొదలుపెట్టినప్పుడు అంతా నన్ను విమర్శించినవారే. ఇప్పుడు ఇబ్బందులు దాటి విజయపథంలో పరుగులు తీస్తుంటే అంతా శభాష్‌ అంటున్నారు. నేను పుట్టి పెరిగిందంతా విజయవాడలో. ఇంటర్మీడియట్‌ అవగానే పెళ్లయ్యింది. మా ఆయన కేశవ్‌మూర్తి స్టీల్‌ ప్లాంట్‌లో మేనేజర్‌. దాంతో మేం విశాఖపట్నంలో స్థిరపడ్డాం. నాకు చిన్నప్పటి నుంచీ వ్యాపారం చేయాలన్న భావన బలంగా ఉండేది. అందుకు చాలా రకాలుగా ఆలోచించా. చివరికి సౌందర్య చికిత్సలకు ఉన్న డిమాండ్‌ గుర్తించి ఈ రంగంలో అడుగుపెట్టా. నైపుణ్యంకోసం కాస్మెటాలజీ, అరోమా, మసాజ్‌ థెరపీ కోర్సులు పూర్తిచేశా.

ఎన్నో ఎదుర్కొన్నా...

మొదట నా బ్యూటీ క్లినిక్‌ కోసం నిపుణుల సాయంతో సహజ పద్ధతుల్లో సౌందర్య లేపనాలు తయారు చేయడం ప్రారంభించా.  అప్పుడప్పుడే బ్రాండెడ్‌ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్న రోజులవి. ఆకులూ, పువ్వులూ, మూలికలతో చేసిన వీటిని ఎవరు వాడతారు, ఇదంతా వృథా అంటూ చాలామంది విమర్శించారు. మనం ఏం ఆహారంగా తీసుకుంటామో అదే మన చర్మ సంరక్షణకూ ఉపయోగపడుతుందని నా నమ్మకం. అందుకే ఎవరి మాటల్నీ పట్టించుకోలేదు. రెండేళ్ల ప్రయోగాల అనంతరం...2009లో ‘నాహా’ పేరుతో వాటిని మార్కెట్‌లోకి తెచ్చాం. ఇప్పుడు బయట దొరికే సబ్బులన్నీ కొన్ని నిమిషాల్లోనే తయారవుతాయి. కానీ రసాయనాలు లేకుండా ఒక సబ్బు తయారీకి కనీసం 4-6 వారాలు పడుతుంది. బొప్పాయి, మామిడి వంటి వాటితో సబ్బు తయారు చేస్తుంటే వాటి గుజ్జుని మాత్రమే వాడి చేస్తాము. మేం అనుసరించే పద్ధతుల వల్ల ఓ సమయంలో వచ్చే ఆదాయం కంటే వాటిని తయారు చేయడానికి అయ్యే ఖర్చే ఎక్కువగా ఉండేది. దీంతో బంధువులూ, కుటుంబ సభ్యులూ అంత నాణ్యమైన వస్తువులు అందించి ఏం సంపాదిస్తున్నావు అనేవారు. అయినా, ఎప్పుడూ వెనకడుగు వేయాలనుకోలేదు. సహజ ఉత్పత్తుల ప్రయోజనాలను గ్రామాలకు వెళ్లి వివరించేదాన్ని. అన్ని ప్రయత్నాలూ చేశాక. ఓసారి వాడిన వారు మళ్లీ మళ్లీ అడుగుతుంటే నాలో ఉత్సాహం పెరిగేది. క్రమేపీ మా ఉత్పత్తులకు ఆదరణ పెరిగింది. దీంతో బ్యూటీ క్లినిక్‌ల నిర్వహణ కష్టంగా మారడంతో 2008లో వాటిని మూసేసి పూర్తిగా సౌందర్య లేపనాల తయారీనే ఎంచుకున్నా. మేము చేసిన సబ్బులు, నూనెలు, షాంపూలు ఇతర వస్తువులను పెద్ద సంస్థలు కొన్ని వారి బ్రాండ్‌ పేరుతో అమ్ముతుంటాయి. యూరప్‌, అమెరికా, ఆస్ట్రేలియా వంటి చోట్లకీ మా ఉత్పత్తులు వెళుతున్నాయి.

గృహిణులకు ఉపాధి...

సౌందర్య ఉత్పత్తుల తయారీకి అవసరమైన ఆకులూ, పువ్వులూ, పండ్లూ వంటివాటిని ప్లాంట్‌ బ్యాంక్‌ పేరుతో గ్రామీణ మహిళల నుంచి సీజన్‌లవారీగా సేకరిస్తాం. వాటిని కొబ్బరినూనెలో ఉంచి తర్వాత వాడతాం. ప్రస్తుతం మా సంస్థలో   30 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు.  ప్రస్తుతం జూనియర్‌ ఛాంబర్స్‌ ఇంటర్నేషనల్‌(జేసీఐ) వైజాగ్‌ యునికార్న్స్‌కి ప్రెసిడెంట్‌గా మహిళల వ్యాపారాభివృద్ధికి కృషి చేస్తున్నా.

- అవదూత హరిప్రియ, విశాఖపట్నం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్