పచ్చళ్లు అమ్మి ఆయన్ని చదివించా!

ఇంట్లో భార్య చదువుకుంటానంటే అర్థం చేసుకుని ఆమెకు అండగా నిలిచే మగవాళ్ల గురించి వింటూనే ఉంటాం. అయితే ఈ కథ కాస్త రివర్స్‌! పేద కుటుంబం నుంచి వచ్చి భర్త చదువుకోసం పచ్చళ్లు అమ్మి.. వ్యాపారవేత్తగా ఎదిగిన గిరిజన మహిళ ఆమని వసుంధర గెలుపు కథ ఇది. ఈ క్రమంలో తనకెదురైన సవాళ్లని వసుంధరతో పంచుకున్నారామె..  

Updated : 18 Jan 2023 07:32 IST

ఇంట్లో భార్య చదువుకుంటానంటే అర్థం చేసుకుని ఆమెకు అండగా నిలిచే మగవాళ్ల గురించి వింటూనే ఉంటాం. అయితే ఈ కథ కాస్త రివర్స్‌! పేద కుటుంబం నుంచి వచ్చి భర్త చదువుకోసం పచ్చళ్లు అమ్మి.. వ్యాపారవేత్తగా ఎదిగిన గిరిజన మహిళ ఆమని వసుంధర గెలుపు కథ ఇది. ఈ క్రమంలో తనకెదురైన సవాళ్లని వసుంధరతో పంచుకున్నారామె..  

మాది ప్రకాశం జిల్లా, సింగరాయకొండ. గిరిజన కుటుంబం. నా చిన్నప్పుడే అమ్మ చనిపోతే, అమ్మమ్మ పెంచింది. పదో తరగతి కాగానే పెళ్లైంది. మావారు పరమేశ్వరరావు పెట్రోలు బంకులో పనిచేసేవారు. అత్తయ్య, నేను కట్టెలు కొట్టి అమ్మేవాళ్లం. ఇంట్లో ఇంతమంది కష్టపడ్డా ఆ సంపాదన ఏ మూలకీ వచ్చేది కాదు. దాంతో డ్వాక్రా సంఘంలో చేరా. వాళ్లు రూ.1,500 రుణమిచ్చారు. ఏం చేయాలా అని ఆలోచించా. చాలామంది పట్నం నుంచి పచ్చళ్లు తెచ్చుకోవడం చూసి, దాన్నే వ్యాపారంగా ప్రారంభించా. అత్తయ్యతో చిన్న కిరాణాకొట్టు పెట్టించి, అందులో పచ్చళ్లు చేసి ఉంచేదాన్ని. చాలామంది మా పచ్చళ్లు కొనడానికి వెనుకాడారు. వీళ్లేం చేస్తారులే అన్నట్టు చిన్నచూపు చూసేవారు. రూ.10 ప్యాకెట్లు తయారుచేసి అందరికీ పంచి.. నచ్చితే డబ్బులిమ్మని చెప్పి వచ్చేశా. నాలుగురోజుల తర్వాత వెళ్తే అందరూ నా కోసమే ఎదురు చూస్తున్నారు. ‘పచ్చళ్లు బాగున్నా’యన్నారు. నా పెట్టుబడి నాకొచ్చేసింది. నెలలోపే అప్పు కూడా తీర్చేశా. నెమ్మదిగా పచ్చళ్ల అమ్మకాలు పెరిగాయి. ఇంట్లో ఎంతోకొంత జరుగుబాటు ఉంది కదాని ఆయన బీఈడీ చేస్తానన్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే మా జీవితాలు బాగుపడతాయని సరే అన్నా. కానీ అదంత తేలిక్కాదని కొన్నిరోజులకే అర్థమైంది.

అరికాళ్లు బొబ్బలెక్కాయి...

మండుటెండలో.. 25 కేజీల పచ్చళ్లను నెత్తిమీద మోసుకుంటూ అమ్మకానికి వెళ్లా. చెప్పుల్లేక ఎండకి అరికాళ్లు బొబ్బలెక్కాయి. పైగా ఏడోనెల గర్భవతిని. అలసిపోయి బాధతో ఒక చోట కూలబడి బోరున ఏడ్చా. వాటిని అమ్మితే కానీ మావారికి ఫీజు కట్టలేనన్న విషయం గుర్తుకురాగానే తిరిగి పచ్చళ్ల బుట్ట నెత్తిన పెట్టుకున్నా. రేషన్‌ బియ్యం తినేవాళ్లం. వర్షానికి ఇల్లంతా కారుతూనే ఉండేది. కూర్చోడానికి జాగా ఉండేదికాదు. ఇలాంటి పేదరికంలో నా బిడ్డ పెరగకూడదనుకున్నా. అప్పుడే నా పట్టుదల పెరిగింది. బాబు పుట్టాక వాడిని అత్తయ్యకు అప్పగించి.. చిన్నచిన్న హోటల్స్‌కూ పచ్చళ్లు ఇచ్చేదాన్ని. ఈలోగా మావారి చదువు పూర్తయ్యి కాంట్రాక్ట్‌ పద్ధతిలో రూ.1200 జీతానికి టీచర్‌గా చేరారు. అది చాలా చిన్న మొత్తం. అందుకే డ్వాక్రాలో ఈసారి రూ.25వేలు రుణాన్ని తీసుకొని వ్యాపారాన్ని అభివృద్ధి చేశా. 2002లో ‘అమృత పచ్చళ్లు’ ప్రారంభించా. ఇంతలో మరో బాబు పుట్టాడు. మా ఉత్పత్తుల గురించి డీఆర్‌డీఏ అధికారులకు తెలిసి, హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్‌కు ఆహ్వానించారు. టైఫాయిడ్‌ జ్వరంతో బాధపడుతూనే రూ.లక్ష పెట్టుబడితో పచ్చళ్లు చేసి తీసుకెళ్లా. పోటీపడి మరీ కొన్నారు. అలా పెద్ద ఆర్డర్లు మొదలయ్యాయి. అప్పట్నుంచీ దిల్లీ, చెన్నై, బెంగళూరు, తెలంగాణ, ఆంధ్ర ఇలా దేశవ్యాప్తంగా ప్రదర్శనలకెళుతూనే ఉన్నా. ప్రస్తుతం 30 రకాల శాకాహార, 10 రకాల మాంసాహార పచ్చళ్లు చేస్తున్నాం.  కారప్పొడులు సహా 60పైగా ఉత్పత్తులూ అమ్ముతున్నా. కొవిడ్‌ సమయంలో రూ.3 లక్షల విలువ చేసే ఆహార ఉత్పత్తులను మా చుట్టుపక్కల గ్రామాల్లో గిరిజన కుటుంబాలకూ ఉచితంగా ఇచ్చా. లాక్‌డౌన్‌ వల్ల సరకు అమ్ముడుపోక రూ.20 లక్షలు నష్టమొచ్చింది. అయినా డీలాపడలేడదు. ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ప్రారంభించి అమెరికా, జర్మనీ, యూకే, సింగపూర్‌ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నా. రూ.80-90 లక్షల వార్షికాదాయం వస్తోంది. 20 మంది మహిళలకు ఉపాధినిస్తున్నా. అన్నట్టు ఆయనిప్పుడు పర్మినెంట్‌ టీచర్‌ అయ్యారు.


నా వంతుగా...

ఎంత ఎదిగినా గతాన్ని మరిచిపోకూడదు అంటారు కదా... అందుకని పేద రోగులకు ఆర్థికసాయం చేస్తున్నా. అధికారుల సాయంతో గిరిజనులకు ఇళ్లు అమరేలా చేస్తున్నా. ఎన్జీవోల తరఫున సేవలందిస్తున్నా. పేద ఆడపిల్లలకు పెళ్లి ఖర్చులిచ్చి, ఉపాధి అందేలా చూస్తున్నా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్