ఆ సమస్యల పరిష్కారం కోసమే టెక్‌ప్రెన్యూర్‌గా మారింది!

చాలామంది మహిళలు తమ జననేంద్రియాలకు సంబంధించిన సమస్యల గురించి ఇతరులతో పంచుకోవడానికి సిగ్గుపడుతుంటారు. అలాగని వాటిని తమలోనే దాచుకుంటే ఆరోగ్యపరంగా వారికే నష్టం వాటిల్లుతుంది. స్వీయానుభవంతో ఈ విషయం తెలుసుకుంది బ్రిటన్‌కు.....

Updated : 02 Jul 2022 15:03 IST

(Photos: Instagram)

చాలామంది మహిళలు తమ జననేంద్రియాలకు సంబంధించిన సమస్యల గురించి ఇతరులతో పంచుకోవడానికి సిగ్గుపడుతుంటారు. అలాగని వాటిని తమలోనే దాచుకుంటే ఆరోగ్యపరంగా వారికే నష్టం వాటిల్లుతుంది. స్వీయానుభవంతో ఈ విషయం తెలుసుకుంది బ్రిటన్‌కు చెందిన తానియా బొలెర్‌. తనలా మరే స్త్రీ బాధపడకూడదని నిర్ణయించుకున్న ఆమె.. ఓ టెక్‌ కంపెనీని స్థాపించింది. ఈ వేదికగా మహిళల వ్యక్తిగత సమస్యల్ని ఎవరికి వారే స్వయంగా దూరం చేసుకునేలా వివిధ ఉత్పత్తులు రూపొందిస్తోంది. ప్రస్తుతం తన ఉత్పత్తులతో ఎంతోమంది మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపుతోన్న ఆమె.. టెక్‌ప్రెన్యూర్‌గానూ ప్రపంచవ్యాప్త గుర్తింపు సంపాదించింది. మరి, ఇంతకీ తానియా రూపొందిస్తోన్న ఆ ఉత్పత్తులేంటి? అవి మహిళలకు ఎలా ఉపయోగపడుతున్నాయో? తెలుసుకుందాం రండి..!

బ్రిటన్‌కు చెందిన తానియా బొలెర్‌ చిన్న వయసు నుంచీ మహిళలకు సంబంధించిన వ్యక్తిగత ఆరోగ్య సమస్యల గురించి అవగాహన పెంచుకోవడంపై ఎక్కువగా దృష్టి పెట్టేది. ఈ క్రమంలోనే వాటి చుట్టూ నెలకొన్న అపోహలు-మూఢనమ్మకాల్ని తొలగించాలన్న కోరిక ఉండేది. తాను అనుకున్నట్లే ఆ దిశగానే తన చదువు కొనసాగించిందామె. లండన్‌ యూనివర్సిటీలో మహిళల ఆరోగ్యం-వ్యక్తిగత పరిశుభ్రత-ట్రాపికల్‌ మెడిసిన్‌.. వంటి అంశాలపై పీహెచ్‌డీ పూర్తిచేసింది. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌, సురక్షిత గర్భస్రావం.. వంటి అంశాలపై అవగాహన పెంచే క్రమంలో యునెస్కోతో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసిందామె.

స్వీయానుభవమే వ్యాపారమైంది!

అవసరమే మనల్ని ఈ ప్రపంచానికి కొత్తగా చూపిస్తుందన్నట్లు.. తన స్వీయానుభవంతోనే వ్యాపారవేత్తగా ఎదిగింది తానియా. ‘నేను తల్లినయ్యాక వెజైనల్‌ సమస్యల్ని ఎదుర్కొన్నా. డెలివరీ తర్వాత కటి వలయంలో కండరాలు వదులుగా మారిపోతాయి. ఈ క్రమంలో తుమ్మినా, దగ్గినా.. మూత్రం లీకయ్యేది. ఇది చాలా ఇబ్బందిగా అనిపించేది. ఎలాగైనా దీనికి పరిష్కారం కనుక్కోవాలనుకున్నా. ఈ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టా. ఈ సమస్య గురించి ఓ చిన్నపాటి అధ్యయనమే చేశా. అప్పుడర్థమైంది.. ప్రతి పది మంది మహిళల్లో సుమారు ఎనిమిది మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని! పైగా దీని గురించి డాక్టర్‌తో, ఇతరులతో చెప్పడానికి వెనకాడే వాళ్లే ఎక్కువగా ఉన్నారని గ్రహించా. అంతేకాదు.. మహిళలకు సంబంధించిన ఇతర సమస్యల గురించి నాకో అవగాహన వచ్చింది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో పిల్లలకు పాలివ్వడానికి చాలామంది వెనకాడుతున్నారు.. బ్రెస్ట్‌ పంప్ ఉపయోగించడానికీ ఇబ్బంది పడుతున్నారని అర్థం చేసుకున్నా. వీటన్నింటికీ పరిష్కారం కనుక్కోవాలనే 2013లో ‘Elvie’ అనే టెక్‌ సంస్థను స్థాపించా..’ అంటోంది తానియా.

నవ్విన వారే ప్రశంసిస్తున్నారు!

తన సంస్థ ద్వారా పెల్విక్‌ ఫ్లోర్‌ ట్రైనర్‌, బ్రా లోపల ధరించే బ్రెస్ట్‌ పంప్‌.. వంటి గ్యాడ్జెట్స్‌ని రూపొందిస్తోంది తానియా. ‘పెల్విక్‌ ఫ్లోర్‌ ట్రైనర్‌ కటి వలయంలోని కండరాల్ని తిరిగి బిగుతుగా మారుస్తుంది. ఇక బ్రెస్ట్‌ పంప్‌ సహాయంతో ఎక్కడైనా సరే సులభంగా పాలు తీయచ్చు. మొబైల్‌ యాప్‌ సహాయంతో ఇది పనిచేస్తుంది. అయితే వీటి ఉపయోగం గురించి అర్థం చేసుకోలేని కొంతమంది.. ఈ ఉత్పత్తుల గురించి తక్కువ చేసి మాట్లాడారు. నా సంస్థలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు రాలేదు. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా బ్రిటన్‌ ప్రభుత్వం సహకారంతో నా ఉత్పత్తుల్ని మరింత ప్రచారం చేశా. వీటివల్ల మహిళలకు కలిగే ప్రయోజనాల గురించి వివిధ వేదికలపై ప్రసంగించా. దీంతో వీటికి స్థానికంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. ఒకప్పుడు నా ఉత్పత్తుల్ని చూసి నవ్విన వారే ఇప్పుడు నన్ను ప్రశంసిస్తుంటే గొప్పగా అనిపిస్తుంది..’ అంటూ తన ఉత్పత్తుల గురించి పంచుకుంది తానియా.

తన తొమ్మిదేళ్ల వ్యాపార అనుభవంతో టెక్‌ప్రెన్యూర్‌గా ఎదిగిన ఆమె.. తన సృజనాత్మక ఉత్పత్తులతో పలు అవార్డులు-రివార్డులు సొంతం చేసుకుంది. అపోహలు-మూఢనమ్మకాలు పక్కన పెట్టి తమ వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తి నింపుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్