Nandini Gupta: రాజకుమారి కల.. కిరీటాన్ని తెచ్చింది!

పదేళ్ల వయసులో కిరీటం సాధించాలని కలలు కన్నదా అమ్మాయి. అప్పుడామెది రాజకుమారి అవ్వొచ్చన్న ఆశ! పెద్దయ్యాకే అదో బాధ్యత అని తెలిసి, దీక్షగా ప్రయత్నించింది. ఎన్నో వడపోతలు దాటి ‘ఫెమినా మిస్‌ ఇండియా’ కిరీటాన్ని దక్కించుకుంది నందినీ గుప్తా.

Published : 17 Apr 2023 00:24 IST

పదేళ్ల వయసులో కిరీటం సాధించాలని కలలు కన్నదా అమ్మాయి. అప్పుడామెది రాజకుమారి అవ్వొచ్చన్న ఆశ! పెద్దయ్యాకే అదో బాధ్యత అని తెలిసి, దీక్షగా ప్రయత్నించింది. ఎన్నో వడపోతలు దాటి ‘ఫెమినా మిస్‌ ఇండియా’ కిరీటాన్ని దక్కించుకుంది నందినీ గుప్తా. ఈ గెలుపుతో ప్రపంచ వేదికపై అడుగుపెట్టే అవకాశాన్ని దక్కించుకున్న ఆమెను మీరూ కలుసుకోండి.

‘జీవితమంటేనే పోరాటం.. ఏదీ సులువుగా రాదు. అనుకున్నది సాధించే క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. వాటిని తట్టుకోవాలి. ఒక్కోసారి అపజయాలూ వస్తాయి. కుంగిపోకుండా వాటినీ పాఠాలుగా మలుచుకొని ముందుకు సాగితేనే విజయం’ అన్న విషయాన్ని చిన్నప్పుడే ఒంట బట్టించుకున్నా అంటుంది 19 ఏళ్ల నందిని. తనను ముందుకు నడిపే సూత్రం కూడా ఇదేనంటుంది. ఈమెది రాజస్థాన్‌లోని కోటా. చిన్నతనంలో ఓసారి మిస్‌ ఇండియా పోటీలను చూసినప్పుడు వాళ్ల తలమీద ఉన్న కిరీటం ఆమెను ఆకర్షించింది. దీంతో తనూ వాళ్లలా పోటీపడి, ఆ కిరీటం దక్కించుకోవాలనుకుంది. అప్పుడు తనూ రాజకుమారి అవొచ్చు అనుకుందట చిన్నారి నందిని. అలా ఆమె దృష్టి ఫ్యాషన్‌ రంగంవైపు మళ్లింది.

చిన్నప్పటి నుంచీ స్కూలు, కాలేజీలో కార్యక్రమాలను నిర్వహించే అలవాటు తనకు. హోస్ట్‌గానూ వ్యవహరించింది. ఆ అనుభవంతో డిగ్రీలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ను ఎంచుకుంది. ఓవైపు చదువుతూనే మోడల్‌గానూ రాణిస్తోంది. కాస్త పెద్దయ్యాక మిస్‌ ఇండియాగా నిలవడమంటే కిరీటం గెలవడమే కాదు.. దేశానికి ప్రాతినిధ్యం వహించే బాధ్యత, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచే అవకాశం అని తెలిశాక చాలా పట్టుదలగా ప్రయత్నించా నంటుంది నందిని. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు, వ్యతిరేకతలు, వైఫల్యాలూ ఎదురయ్యాయి. లక్ష్యం చేరుకునే క్రమంలో ఇవన్నీ మామూలే అని ఇంకా పట్టుదలగా ప్రయత్నించిందట అందుకే ఈరోజు ఇక్కడ నిలబడ్డానని గర్వంగా చెబుతుందీమె.

ఉద్యోగం సంపాదించడం కాదు.. నలుగురికీ ఉపాధి కల్పించాలన్నది నందిని లక్ష్యం. కోటాకి దగ్గర్లో ‘కైతూన్‌’ అనే ప్రాంతముంది. అక్కడి మహిళలు కోటా డోరియా అనే వస్త్రాన్ని నేస్తారు. కానీ వారి గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. చాలా తక్కువ మొత్తంలో చెల్లించి, బయట ఎక్కువ ధరకు ఆ వస్త్రాన్ని అమ్మడం గమనించిన నందిని.. వారిని ఓ తాటి మీదకు తేవడమే కాదు.. వారి కళకు ప్రచారాన్నీ కల్పిస్తోంది. ‘చిన్న వయసులోనే మిస్‌ ఇండియాగా నిలిచి, ఆపై అంతర్జాతీయ స్థాయిలోనూ దేశాన్ని గర్వపడేలా చేశారు ప్రియాంక చోప్రా. తన నటనతోనే కాదు.. సామాజిక సేవతోనూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచే ఆమే నా రోల్‌మోడల్‌. చేసే ప్రతిపనిలోనూ సమాజ హితాన్ని గురించి ఆలోచించే రతన్‌ టాటా ఆదర్శం. ఆయనలా కోట్ల మంది అభిమానాన్ని సంపాదించాలి’ అంటోంది నందిని.

ఎన్నో వడపోతల తర్వాత 30 మంది తలపడిన తుదిపోరులో నందిని కిరీటాన్ని దక్కించుకోగా.. దిల్లీకి చెందిన శ్రేయ పూన్జా మొదటి రన్నరప్‌గా, మణిపూర్‌కి చెందిన తౌనోజమ్‌ స్ట్రెలా లువాంగ్‌ రెండో రన్నరప్‌గా నిలిచారు. తాజా గెలుపుతో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జరిగే ‘మిస్‌ వరల్డ్‌’ పోటీల్లో తలపడే అవకాశాన్నీ సంపాదించుకుంది నందిని. ‘ప్రతి క్షణం సైనికుడిలా పోరాడే తత్వం ఉన్నవారే జీవితంలో ఏదైనా సాధించగలరు. పోరాడండి.. ధైర్యంగా కలల సాకారానికి కృషి చేయండి. అప్పుడే అనుకున్నది సాధించగలరు’ అని తోటివారికి సలహానీ ఇస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్