పండ్లతో పచ్చళ్లు పెట్టెస్తూ...

ఆవకాయ, మాగాయ, గోంగూర, నిమ్మకాయ... వంటి పచ్చళ్లు గురించి మనందరికీ తెలుసు?  కానీ పండ్లతో పెట్టిన అనాస-క్యాప్సికం, జామ-మిర్చి, నారింజ-సోంపు వంటి ఊరగాయల గురించి ఎప్పుడైనా విన్నారా?

Published : 09 Mar 2023 01:13 IST

ఆవకాయ, మాగాయ, గోంగూర, నిమ్మకాయ... వంటి పచ్చళ్లు గురించి మనందరికీ తెలుసు?  కానీ పండ్లతో పెట్టిన అనాస-క్యాప్సికం, జామ-మిర్చి, నారింజ-సోంపు వంటి ఊరగాయల గురించి ఎప్పుడైనా విన్నారా? లేదంటే ముంబయికి చెందిన ప్రీతీషా, తన తల్లి మీతీతో కలిసి నిర్వహిస్తోన్న ‘గూస్‌బంప్స్‌’ సంస్థ గురించి తెలుసుకోవాల్సిందే.

కూతురు బయాలజిస్ట్‌... తల్లి ఊరగాయలు పెట్టడంలో స్పెషలిస్ట్‌... ఆహారంపై ఉన్న ఆసక్తి వారిని ఫ్యూజన్‌ పచ్చళ్లూ, చిరుతిళ్ల తయారీ దిశగా నడిపించింది. ముంబయికి చెందిన ప్రీతీషా సెల్‌ బయాలజీలో డాక్టరేట్‌ అందుకున్నారు. టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌లో పోస్ట్‌ డాక్టొరల్‌ సైంటిస్ట్‌గా, ముంబయి యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గానూ పనిచేశారు. కెరియర్‌ ఉన్నతంగా సాగుతున్నా...మనసు మాత్రం ఇంకేదో చేయాలని ఆరాట పడేది. ప్రీతి, ఆమె భర్త పినాక్‌ ఇద్దరూ ఆహార ప్రియులు. ఆమె తల్లి మీతీ వంట బాగా చేస్తుంది. ముఖ్యంగా పచ్చళ్లు పెట్టడంలో చేయి తిరిగిన వ్యక్తి. అందుకే తనతో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేయించేవారు. స్నేహితులూ, బంధువులకోసం కేజీల పచ్చళ్లు పట్టించేవారు. ఏం చేసినా ప్రత్యేక రుచినిచ్చే అమ్మ చేతిలో ఉన్న ఆ మ్యాజిక్‌ని అందరికీ పరిచయం చేయాలనుకున్నారు ప్రీతి. అయితే, అందరిలా కాకుండా కాస్త భిన్నంగా ప్రయత్నించాలనుకున్నారు. అప్పుడు వచ్చిందే ఫ్యూజన్‌ పచ్చళ్ల ఆలోచన. ముందు కొంత పరిశోధన చేశారు. స్థానిక మార్కెట్లకు వెళ్లి అక్కడ అమ్ముడుపోయే పదార్థాల జాబితాను గమనించారు. ఇంటింటికీ సర్వే చేశారు. ఇవి కొంత అవగాహన కల్పించాయి. దాంతో ముడిసరకూ, పెట్టుబడీ సిద్ధం చేసుకుని 2012లో ‘గూస్‌బంప్స్‌’ పేరుతో దేశ, విదేశీ పండ్లతో... సంప్రదాయ శైలిలో ఊరగాయలూ, స్నాక్స్‌ తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. ‘మేం తయారు చేసే పదార్థాలు రుచితోపాటూ, ఆరోగ్యాన్నీ ఇవ్వాలని ఆలోచన వచ్చినప్పుడే నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా భవిష్యత్తు తరాలు విటమిన్‌ సి, డి లోపం అంటూ ట్యాబ్లెట్ల జోలికి పోకుండా మేం చేసే ఆహార ఉత్పత్తులే ప్రత్యామ్నాయం కావాలని భావించాం’ అని చెబుతారామె.  

మొదట్లోనే ఆ తప్పు...

వ్యాపారంలో ప్రతి అడుగూ ఆచి తూచి వేయాలి. లేదంటే నష్టాన్ని చూడాల్సి వస్తుంది. విలువ తగ్గకూడదంటే నాణ్యతలో ఏ మాత్రం రాజీ పడకూడదు. అయితే, మొదట్లో మేం ఉత్పత్తుల తయారీ పైనే ఎక్కువ దృష్టిని కేంద్రీకరించి... ప్యాకేజింగ్‌, డెలివరీ వంటి విషయాలను నిర్లక్ష్యం చేశాం. దాంతో మా మొదటి ఆర్డరే... కస్టమర్‌ మా ఉత్పతిని రుచి చూడకుండానే ప్యాకెట్‌ లీక్‌ అయ్యింది. చాలా నిరాశపడ్డాం.  దాన్నో పాఠంగా నేర్చుకుని మరోసారి ఈ తప్పిదం జరగకుండా చూసుకున్నాం. మేం తయారు చేసే పదార్థాల్లో వాడే సరకులన్నీ నాణ్యమైనవే వాడతాం. వాటి నాణ్యతను చూసి ఎంపిక చేయడంలో అమ్మ, అమ్మమ్మలకంటే నిపుణులెవరుంటారు చెప్పండి. కొత్త సరకు వచ్చిన ప్రతిసారీ మేం ఏర్పాటు చేసుకున్న పారా మీటర్స్‌కి అనుగుణంగా....రంగూ, రుచి, ఆకృతి, నాణ్యత ఉన్నాయో లేదో పరీక్షించుకున్నాకే వాడతాం.

ఒక్కో ప్రత్యేకతతో...

‘కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ... భారతదేశంలోని ప్రతి ప్రాంతంలోనూ ప్రత్యేకత కలిగిన ఓ ఊరగాయ ఉంటుంది. అది అందరి మనసుల్లోనూ నాటుకుని ఉంటుంది. దానికంటే వైవిధ్యంగా ఊరగాయలను పెట్టడం, అందరినీ ఆకట్టుకోవడం నిజంగా పెద్ద సవాలే. అందుకే, మేం చేసే వంటకం ఏదీ ఒక్క ప్రయత్నంతో పూర్తవ్వదు. మా ఉత్పత్తుల్లో ఎక్కువగా అమ్ముడు పోయే పైనాపిల్‌ పెప్పర్‌ పచ్చడిని ముప్పై రెండు సార్లు ప్రయోగం చేశాకే ఫైనల్‌ చేశాం.  ఓ రోజు అర్ధరాత్రి ఆలివ్‌ జల్‌పెనో మిర్చి కాంబినేషన్‌ ఊరగాయ ఆలోచన వచ్చింది. దాన్ని సుమారు యాభైసార్లు వివిధ పదార్థాలతో కలిపి రుచి చూశాకే... చివరిగా బయటకు వచ్చింది.  
దక్షిణాదిలో పులి ఇంజి పికెల్‌ స్ఫూర్తిగా ద్రాక్ష-అల్లం పచ్చడి పెట్టాం. దీనికి ఎంత పేరొచ్చిందో. ప్రస్తుతం మా దగ్గర యాభై రకాల పచ్చళ్లూ, ముప్పై రకాలకు పైగా స్నాక్స్‌ ఉన్నాయి. ముగ్గురితో మొదలైన మా సంస్థ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా యాభైమంది పాల్గొంటే పరోక్షంగా మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నాం’ అంటారు ప్రీతి. ప్రస్తుతం ఈ సంస్థ ఏడాదికి ముప్పై కోట్ల రూపాయల ఆదాయాన్ని అందుకుంటోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్