‘ఇంత కష్టమైన ఉద్యోగంలో ఎక్కువ రోజులు ఉండలేవు..’ అనేవారు!

అరుదైన రంగాల్లో ఆడపిల్లలు రాణించడమనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైందేమో కానీ రెండు దశాబ్దాల క్రితం పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేవి. ఆ రోజుల్లో అమ్మాయిలపై ఉండే ఆంక్షలు వారిని గడప దాటనిచ్చేవి కావు. అలాంటి సమయంలో ఈ కట్టుబాట్లను కాదని నావికా రంగంలోకి అడుగుపెట్టింది అనూరాధ ఝా.

Published : 12 Apr 2024 13:06 IST

(Photos: Twitter)

అరుదైన రంగాల్లో ఆడపిల్లలు రాణించడమనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైందేమో కానీ రెండు దశాబ్దాల క్రితం పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేవి. ఆ రోజుల్లో అమ్మాయిలపై ఉండే ఆంక్షలు వారిని గడప దాటనిచ్చేవి కావు. అలాంటి సమయంలో ఈ కట్టుబాట్లను కాదని నావికా రంగంలోకి అడుగుపెట్టింది అనూరాధ ఝా. అనతి కాలంలోనే సరకు రవాణా చేసే నౌకలకు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగింది. ‘సవాళ్లతో కూడిన ఇలాంటి వృత్తిలో ఆడపిల్లలు ఎక్కువ రోజులు మనలేరు’ అంటూ వెనక్కి లాగాలని చూసిన వారికి తన సుదీర్ఘ కెరీర్‌తోనే జవాబు చెప్పింది. ప్రస్తుతం ఓ ప్రముఖ మ్యారీటైమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్యాకల్టీగా పనిచేస్తూ యువ నావికుల్ని తీర్చిదిద్దుతోన్న కెప్టెన్ అనూరాధ స్ఫూర్తి గాథ ఇది!

నేను పాట్నాలో పుట్టి పెరిగాను. నాన్న పోస్టల్‌ అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌లో అకౌంట్స్‌ ఆఫీసర్‌గా పనిచేసి రిటైరయ్యారు. మేం ముగ్గురం అక్కచెల్లెళ్లం, మాకు ఇద్దరు సోదరులు. అయితే చాలామంది మా నాన్నతో ‘ముగ్గురూ ఆడపిల్లలే.. వాళ్ల బాధ్యత ఎలా తీర్చుకుంటారు?’ అనేవారు. అయినా నాన్న మా ఐదుగురినీ సమానంగా చూసేవారు.. మమ్మల్ని ఎప్పుడూ బరువుగా భావించలేదు.. అందుకే వాళ్ల మాటల్ని పట్టించుకోకుండా మా అందరినీ పాట్నాలో ఓ మంచి స్కూల్లో చేర్పించి చదివించారు.

కోచ్‌ సలహాతో..!

ఎలాగోలా స్కూలింగ్‌ అయితే పూర్తిచేశాం.. కానీ అందరినీ పైచదువులు చదివించాలంటే ఆర్థిక పరంగా నాన్నకు కాస్త కష్టమే అయింది. అయినా వెనకడుగు వేయలేదు. దాంతో ఎలాగోలా ఇంటర్‌ పూర్తిచేశా. ఆపై ఐఐటీ-జేఈఈ కోచింగ్‌లో చేరాను. అక్కడే కోచ్‌ సలహా మేరకు మర్చంట్‌ నేవీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నా. మెయిన్స్‌లో తక్కువ మార్కులొచ్చినా ఇంటర్వ్యూ పిలుపొచ్చింది. ఇంటర్వ్యూ సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేసి 2003లో మర్చంట్‌ నేవీ ఉద్యోగానికి ఎంపికయ్యా. ‘షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ సంస్థ అమ్మాయిల్ని మర్చంట్‌ నేవీ ఉద్యోగానికి ఎంపిక చేయడం ఇదే తొలిసారి.. అలా ఫస్ట్‌ బ్యాచ్‌లోనే నేను, మరో ఇద్దరు అమ్మాయిలు ఈ అరుదైన అవకాశం అందుకున్నాం. ఆపై ముంబయిలోని పోవాయ్‌లో నాలుగు నెలల శిక్షణ తీసుకున్నాక.. నన్ను కువైట్‌ పంపించారు. అలా అక్కడ్నుంచి ఆయిల్‌ ట్యాంకర్లు తీసుకొచ్చే సరకు రవాణా నౌకల బృందంలో నేనూ భాగమయ్యా.

ఆరు నెలలు నౌకలోనే..!

ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో ఎన్నెన్నో కలలు కన్నా.. ‘చక్కగా సముద్రయానం చేయచ్చు.. దేశవిదేశాలకు ప్రయాణించచ్చు.. మంచి జీతం అందుకోవచ్చు..’ అనిపించేది. కానీ రోజులు గడిచే కొద్దీ ఈ రంగంలో ఉన్న సవాళ్లేంటో క్రమంగా నాకు అర్థమయ్యాయి. మర్చంట్‌ నేవీ బృంద సభ్యురాలిగా నౌకలో ఉన్న సరకును కాపాడుకోవడం ఒకెత్తయితే.. రోజులు, కొన్నిసార్లు నెలల తరబడి సముద్రయానం చేయాల్సి వచ్చేది. ఒక్కోసారైతే కుటుంబాన్ని కలవడానికి ఆరు నెలలు పట్టేది. కనీసం ఆ రోజుల్లో ఫోన్లు, ఇంటర్నెట్‌ సదుపాయం కూడా లేదు. చాలాసార్లు ఉత్తరాల ద్వారానే నా కుటుంబ సభ్యులతో మాట్లాడాల్సి వచ్చేది. ఇలా నేను నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉండడంతో చాలామంది ‘ఇంత కఠినమైన ఉద్యోగంలో నువ్వు ఎక్కువ రోజులు ఉండలేవు..’ అనేవారు. అప్పుడే వాళ్ల మాటల్ని ఎలాగైనా తిప్పి కొట్టాలనిపించింది. ఈ పట్టుదలే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనగలిగే నేర్పును అందించింది. అలా మర్చంట్‌ నేవీ బృంద సభ్యురాలిగా పదేళ్లు గడించిన అనుభవంతో 2013లో కెప్టెన్‌గా బాధ్యతలందుకున్నా.

కెప్టెన్‌గా సవాళ్లెన్నో!

మర్చంట్‌ నేవీలో కెప్టెన్‌ అంటే కార్గో సేవలందించే ఓ నౌకకు సారథ్యం వహించడం. నిజానికి ఈ బాధ్యత మరింత క్లిష్టమైంది. కొనుగోలు చేసిన సరకును గమ్యస్థానం చేర్చే వరకూ నౌక కెప్టెన్‌దే పూర్తి బాధ్యత. అందుకే 24 గంటలు అలర్ట్‌గా ఉండేదాన్ని. ఇక పైరసీ ఏరియాల్లో (తరచూ దోపిడీ, ఇతర హింసాత్మక ఘటనలు జరిగే ప్రదేశాలు) ప్రయాణించే క్రమంలో భద్రతాపరమైన పలు రకాల ప్రొటోకాల్స్‌ పాటించాల్సి వచ్చేది. ఒక్కోసారి ఇలాంటి ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు నావెల్‌ కాన్వాయ్‌ (నౌకకు రక్షణ కల్పించే వ్యక్తులు)లను వెంటపెట్టుకెళ్లేదాన్ని. ఇలా కెప్టెన్‌గా నా సుదీర్ఘ కెరీర్‌లో మధ్య ప్రాచ్య దేశాల నుంచి క్రూడ్‌ ఆయిల్‌ ట్యాంకర్లు, ప్రొడక్ట్‌ ట్యాంకర్లు, కంటెయినర్‌ షిప్స్‌ని సురక్షితంగా భారత్‌కు తీసుకురావడంతో పాటు కొన్ని దేశాలకు వెళ్లొచ్చే ప్యాసింజర్‌ షిప్స్‌కీ సారథ్యం వహించా.

అమ్మాయిల సంఖ్య పెరగాలి!

ఇలా 2019 వరకు ‘షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’లో షిప్‌ కెప్టెన్‌గా విధులు నిర్వర్తించిన నేను.. ఆపై పుణేలోని ‘సముద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యారీటైమ్‌ స్టడీస్‌’లో నాటికల్‌ ఫ్యాకల్టీగా చేరాను. ప్రస్తుతం ఇదే విద్యాసంస్థలో నాటికల్‌ ఫ్యాకల్టీ-ట్రైనింగ్‌ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నా. యువ నావికులకు నావికా పాఠాలు చెబుతున్నా. ఇందులో భాగంగా.. స్ట్రాటజీ బృందానికి నాయకత్వం వహించడం; కంటైనర్‌షిప్‌లు, ఆయిల్ ట్యాంకర్లు, ప్యాసింజర్ షిప్‌లు, బల్క్ క్యారియర్స్‌లో.. ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను రూపొందించడం-నిర్వహించడం నా విధి. ప్రస్తుతం ఎన్నో అరుదైన రంగాల్లో మహిళల ప్రాతినిథ్యం పెరుగుతోంది. కానీ నేవీలో మాత్రం ఈ సంఖ్యలో ఎలాంటి మార్పు కనిపించట్లేదు. నేను ఈ రంగంలోకి వచ్చినప్పట్నుంచి ఇప్పటివరకు కేవలం ఐదారుగురు అమ్మాయిలు మాత్రమే షిప్‌ కెప్టెన్లు కాగలిగారు. ఈ రంగంలో చీఫ్‌ ఇంజినీర్లు కూడా తక్కువే. ఇందుకు సామాజిక ఒత్తిళ్లూ ఓ కారణమే! కానీ వాటికి తలొగ్గినంత కాలం మనమేంటో నిరూపించుకోలేం. కాబట్టి ఇలాంటివన్నీ పక్కన పెట్టి అమ్మాయిలు స్వీయ నిర్ణయం తీసుకోగలగాలి. అప్పుడే ఆర్థిక స్వేచ్ఛనూ సాధించగలుగుతాం. మ్యారీటైమ్‌ ఫ్యాకల్టీగా నేనూ ఈ రంగంలో అమ్మాయిల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్