నారీ శక్తితో మెప్పించారు!

దేశరక్షణలో నారీశక్తిని చాటే ఆ శకటాన్ని రూపొందించడమే కాదు... ముందుండీ నడిపించారామె.  ఇటీవల దిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ప్రజాదరణ పొందిన ‘ఉత్తమ శకటం’గా ప్రశంసలందుకొన్న దీని రూపకర్త.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారంలో 58వ బెటాలియన్‌లో సీఆర్పీఎఫ్‌ అసిస్టెంట్ కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కోమల్‌ప్రీత్‌కౌర్‌.

Published : 01 Feb 2023 00:21 IST

దేశరక్షణలో నారీశక్తిని చాటే ఆ శకటాన్ని రూపొందించడమే కాదు... ముందుండీ నడిపించారామె.  ఇటీవల దిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ప్రజాదరణ పొందిన ‘ఉత్తమ శకటం’గా ప్రశంసలందుకొన్న దీని రూపకర్త.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారంలో 58వ బెటాలియన్‌లో సీఆర్పీఎఫ్‌ అసిస్టెంట్ కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కోమల్‌ప్రీత్‌కౌర్‌. తన చిన్ననాటి కలని నిజం చేసుకున్న వైనాన్ని వసుంధరతో పంచుకున్నారామె..  

నేను పుట్టి పెరిగిందంతా హరియాణాలోని రతియా పట్టణంలో. నాన్న కళాశాల ప్రిన్సిపల్‌. అమ్మ లెక్చరర్‌. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. నేను, తమ్ముడు ఇదే మా కుటుంబం. చిన్నప్పుడు గణతంత్ర వేడుకల్లో వివిధ సాయుధ బలగాలు చేసే విన్యాసాలు, మార్చ్‌లని టీవీలో చాలా ఇష్టంగా చూసేదాన్ని. ఆ జ్ఞాపకాలు నాలో బలంగా నాటుకుపోయాయి. కిరణ్‌బేడీ స్ఫూర్తితో యూనిఫాం సర్వీసులో చేరాలని చిన్పప్పుడే నిర్ణయించుకున్నా.

అమ్మానాన్నల ప్రోత్సాహంతో..

ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌లో ఎంటెక్‌ చేశా. అయినా కేంద్ర సాయుధ సీఆర్పీఎఫ్‌లో చేరాలన్న కల మాత్రం అలానే ఉండేది. సాధారణంగా ఏ కుటుంబంలోనైనా ఇలాంటి సవాళ్లతో కూడుకున్న వృత్తిలోకి ఆడపిల్లల్ని పంపించడానికి ఆలోచిస్తారు. కానీ మా అమ్మానాన్న మాత్రం నన్ను ప్రోత్సహించారు. నా లక్ష్యాన్ని తెలుసుకొని వెన్నుతట్టారు. యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షలో మొదటిసారి విఫలమయ్యా. అయినా పట్టుదలతో మరోసారి ప్రయత్నించి విజయం సాధించా. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో 58వ బెటాలియన్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాను.

గొప్ప అనుభూతి..

ఈసారి గణతంత్ర వేడుకలు నారీశక్తిని ప్రతిబింబించేలా జరిగాయి. కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా సీఆర్‌పీఎఫ్‌ తరఫున మహిళలతో మార్చ్‌, శకటాల ప్రదర్శన చేపట్టాం. సాయుధ బలగాల్లో మహిళలు మగవారితో సమానంగా రాణించగలరనే ఉద్దేశంతో ‘సీఆర్‌పీఎఫ్‌లో నారీశకి’్త అనే ఇతివృత్తంతో శకట ప్రదర్శన నిర్వహించాం. దీనికి నాయకత్వం వహించడం, దేశాధినేతల ముందు ప్రదర్శన చేయడం మరిచిపోలేని అనుభూతి కలిగించింది.

సామాజిక సేవలో...

ఆడవారు ఏ వృత్తిలోనైనా రాణించగలరు. వారి లక్ష్యాలను చేరుకొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే చాలు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. నా వంతు కృషిగా విద్యార్థులు, మహిళలు వారి కాళ్లమీద వారే నిలబడేలా ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నా. వీలైనప్పుడల్లా పాఠశాల, కళాశాలల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నా.

* ఈ నెల 26 నుంచి 28వరకూ గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్న శకటాలకు.. మైగవ్‌.ఇన్‌ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. నచ్చిన శకటానికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అలా ఈ పోటీల్లో సీఆర్పీఎఫ్‌ నారీశక్తి అత్యంత ప్రజాదరణ కలిగిన ఉత్తమ శకటంగా మొదటి స్థానంలో నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది.  

-కరీదు దుర్గాసాయిరాం, జయశంకర్‌ భూపాలపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్