సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి దుస్తులు కుడతావా అన్నారు

‘నీకేమైనా పిచ్చా బంగారం లాంటి ఉద్యోగం వదిలి ఊరికొస్తానంటున్నావ్‌’ సుష్మ నిర్ణయం విన్నాక ప్రతి ఒక్కరూ అన్న మాట ఇదే. వేల మైళ్ల దూరంలో లక్షల జీతం కోసం పనిచేయడం కంటే...ఉన్న ఊళ్లో ఆర్థిక భరోసా సాధించడమే ముఖ్యమనుకున్నారామె.

Updated : 25 Jan 2023 07:33 IST

‘నీకేమైనా పిచ్చా బంగారం లాంటి ఉద్యోగం వదిలి ఊరికొస్తానంటున్నావ్‌’ సుష్మ నిర్ణయం విన్నాక ప్రతి ఒక్కరూ అన్న మాట ఇదే. వేల మైళ్ల దూరంలో లక్షల జీతం కోసం పనిచేయడం కంటే...ఉన్న ఊళ్లో ఆర్థిక భరోసా సాధించడమే ముఖ్యమనుకున్నారామె. ఉద్యోగాన్ని వదిలి వచ్చిన ఆవిడ ఇప్పుడు కోటి రూపాయల టర్నోవర్‌ని సాధించారు. మరెందరికో ఉపాధినీ కల్పిస్తున్నారు. ఆ స్ఫూర్తి ప్రయాణాన్ని మనమూ తెలుసుకుందామా!

ర్ణాటకలోని సూరత్‌కల్‌ ఎన్‌ఐటీలో ఎంటెక్‌ చేసి కొన్నాళ్లు ఉద్యోగం చేశా. పెళ్లయ్యాక మా ఇద్దరికీ మలేషియాలో పనిచేసే అవకాశం వచ్చింది. విదేశంలో ఉద్యోగం కాబట్టి అక్కడ కొన్నాళ్లు పనిచేస్తే కొంత డబ్బు వెనకేసుకోవచ్చు. ఆ మొత్తంతో వ్యాపారం చేయాలన్నది నా ఆలోచన. అందుకు తగ్గట్లే...2017లో మలేషియాలో క్రూడాయిల్‌, పామాయిల్‌ ధరలు పడిపోవడంతో ఆ దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఉద్యోగాలు పోతాయనే భయం..మమ్మల్ని ఆలోచనల్లో పడేసింది. ఇప్పుడైనా రిస్క్‌ తీసుకోకపోతే ఇక ఎప్పటికీ ముందుకు వెళ్లలేమన్నది నా ఆలోచన.  అందుకే, నేనే ఉద్యోగం మానేసి మా సొంతూరు కడప జిల్లా వేంపల్లె వచ్చేశా.

ఎన్నో చేయాలనుకున్నా... ఊరికైతే తిరిగి వచ్చా కానీ...ఏం చేయాలన్నదానిపై స్పష్టతలేదు. మొదట సేంద్రియ వ్యవసాయం చేసి ఆర్గానిక్‌ ఉత్పత్తులు పండించాలనుకున్నా. తర్వాత సీబీఎస్‌ఈ సిలబస్‌తో ఓ పాఠశాల నిర్వహించాలనుకున్నా. ఇలా చాలా ఐడియాలు ప్రారంభ దశలోనే ఆగిపోయాయి. కొత్త ఆలోచనల కోసం ప్రతిదీ నిశితంగా గమనించే తత్వం నాది. ఫ్యాషన్‌ పోకడలపైనా కాస్త పట్టుంది. అందరూ డిజైనర్‌ దుస్తులపై పెంచుకుంటోన్న మక్కువ... నన్ను బొటిక్‌ ఏర్పాటు దిశగా అడుగులు వేసేలా చేసింది. ఎప్పుడో నేర్చుకున్న మగ్గం వర్క్‌, పిల్లలకు అప్పుడప్పుడూ గౌన్లు కుట్టడం మాత్రమే నాకు తెలుసు. ఆ అవగాహన సరిపోదనుకున్నా. అందుకే వినియోగదారుల అవసరాలనూ, మారిన టెక్నాలజీ వంటి విషయాల్లోనూ అవగాహన తెచ్చుకున్నా. చివరికి 2017లో ఒక దర్జీ సాయంతో బొటిక్‌ని ఏర్పాటు చేశా. ఇదంతా చూసి బంధుమిత్రులు ఉద్యోగం మానేసి ఈ పిచ్చి పనులేంటి అన్నారు. విదేశాల్లో ఉద్యోగం, లక్షల జీతం వదిలేసి ఈ పల్లెటూళ్లో టైలర్‌ దుకాణం పెట్టుకున్నావా అంటూ హేళన చేశారు. అడుగు వేయకుండానే ఈ మాటలకు భయపడి వెనకడుగు వేస్తే....సాధించలేనేమో అన్న భయంతో అవేవీ చెవికెక్కించుకోలేదు.

స్థానిక మహిళల కోసం... బొటిక్‌ ప్రారంభించిన కొద్ది రోజులకే గిరాకీ పెరిగింది. వ్యాపారమన్నాక లాభనష్టాలు ఉండనే ఉంటాయి. పైగా ఈ వ్యాపారంలో పోటీ ఎక్కువ. నేను బొటిక్‌ ప్రారంభించినప్పుడు పోటీగా మరొకరు వ్యాపారం మొదలుపెట్టారు. నా దగ్గర పనివాళ్లను వారి వైపు తిప్పుకొన్నారు. అప్పుడు ఒకేసారి ఆరుగురు మానేయడంతో కొంత ఇబ్బంది ఎదుర్కొన్నా. ఊహించని పరిణామంతో కొంత కంగారు పడినా...ధైర్యం తెచ్చుకుని నిలబడ్డా.  స్థానిక దర్జీలను ఉపయోగించుకుందామంటే వారి నైపుణ్యం చాలలేదు. దాంతో ఓ స్నేహితురాలి సాయంతో కుట్టుపనిలో నిష్ణాతులైన బెంగాల్‌ టైలర్‌ను వేంపల్లెకు రప్పించా. దీంతో పనిలో వైవిధ్యం పెరిగి...మంచి ప్రచారమూ వచ్చింది. అతని సాయంతో మరో పది మందినీ పిలిపించా. ఇక, ఎన్నాళ్లని ఎక్కడి నుంచో టైలర్లు వస్తారు. వాళ్లూ మానేస్తే...అన్న ఆలోచన వచ్చి తర్వాత నుంచి స్థానిక మహిళలకే శిక్షణ ఇప్పించి....ఉపయోగించుకుంటున్నా. దీనివల్ల వారంతా ఇరవై ఐదు నుంచి నలభైవేల రూపాయల జీతాన్ని అందుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం మా సుమంగళి బొటిక్‌లో 25 మంది టైలర్లు పనిచేస్తున్నారు. వేంపల్లెతో పాటూ దేశవ్యాప్తంగానూ, నెదర్లాండ్‌, అమెరికా, ఆస్ట్రేలియా వంటి వివిధ దేశాల్లోనూ మా సంస్థకు వినియోగదారులున్నారు. సంస్థ టర్నోవర్‌ కోటి రూపాయలకు చేరుకుంది.  ఆడపిల్ల ఏం పని ఇస్తుంది. నాలుగు రోజులు పోతే చేయడానికి తనకే ఏ పనీ ఉండదనే వారు. మా బొటిక్‌ వద్దకు వినియోగదారులను రానిచ్చే వారు కాదు. వాటన్నింటినీ తట్టుకుంటూ ఒక్కో అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ ముందుకు వెళ్లా. నలుగురికి ఉపాధినిస్తూ.. నేను స్వతంత్రంగా పని చేసుకోవడం ఎంతో సంతృప్తిగా ఉంది.   

 -బోగెం శ్రీనివాసులు, కడప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్