ఆ పని తీరుకే ఈ గుర్తింపు

‘ఎన్నో సవాళ్లతో కూడిన వృత్తిలో నిలబడగలిగానంటే భగవంతుడిపై ఉన్న నమ్మకం, ప్రేమ... అవి ప్రసాదించిన శక్తి ద్వారానే అని నా నమ్మకం. మనం నేర్చుకున్నది పది మందికీ పంచగలిగితేనే మన ఉనికి సార్థకమవుతుందని విశ్వసిస్తా.

Updated : 12 Jan 2023 07:36 IST

‘ఎన్నో సవాళ్లతో కూడిన వృత్తిలో నిలబడగలిగానంటే భగవంతుడిపై ఉన్న నమ్మకం, ప్రేమ... అవి ప్రసాదించిన శక్తి ద్వారానే అని నా నమ్మకం. మనం నేర్చుకున్నది పది మందికీ పంచగలిగితేనే మన ఉనికి సార్థకమవుతుందని విశ్వసిస్తా. నా మూడు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని అందరికీ పంచుతూ.. తెలంగాణ రాష్ట్ర మొట్ట మొదటి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తా. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపేలా కృషి చేస్తా’ అంటున్నారు శాంతి. ‘మహిళలు తమ గుర్తింపుకోసం ప్రయత్నించడం, తమకోసం సమయం కేటాయించుకోవడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. భర్త కోసమో, పిల్లల కోసమో... అవసరం ఉన్నా లేకున్నా త్యాగాలు చేయడం మహిళలకు అలవాటు. దాన్ని మానుకోవాలి. అలా ప్రతిసారీ చేస్తూ పోతుంటే... కుటుంబంలో వారి స్థానం వెనకే’ అన్న సలహానీ ఇస్తున్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. రాష్ట్రంలోనే అత్యున్నత కార్యనిర్వాహక పదవి! దేశంలోని 28 రాష్ట్రాల్లో అయిదింటిలోనే మహిళలు ఈ హోదాలో ఉన్నారు. తెలంగాణ తొలి మహిళా సీఎస్‌గా వారి సరసన శాంతికుమారి కూడా చేరారు.

మెరైన్‌ బయాలజీలో పీజీ, అమెరికాలో ఎంబీఏ పూర్తిచేసిన శాంతి కుమారి ప్రజాసేవలోకి రావాలనుకున్నారు. అందుకోసం ఎంతో శ్రమించి ఐఏఎస్‌ సాధించారు. అప్పటికి ఆవిడ వయసు 24 ఏళ్లే! మొదటి ప్రయత్నంలోనే లక్ష్యాన్ని చేరుకున్నావిడ ఎక్కడ పనిచేసినా తన ముద్ర కనబరిచారు. సహాయ కలెక్టర్‌గా క్షేత్ర పర్యటనలతో ప్రజల జీవనాన్ని దగ్గరగా గమనించారు. సాయానికి చేయందించే ఆవిడ.. అన్యాయాన్ని సహించలేరు. మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో సంయుక్త కలెక్టర్‌గా బియ్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపి, రేషన్‌ దుకాణాలు సమర్థంగా నడిచేలా చేశారు. తర్వాత మెదక్‌ కలెక్టర్‌గానే కాదు.. విద్య, వైద్య, ఆరోగ్య రంగాలు, నైపుణ్యాభివృద్ధి, అటవీ శాఖల్లో 34 ఏళ్ల పాటు భిన్న బాధ్యతలు నిర్వర్తించి వాటిని అభివృద్ధి మార్గంలో నడిపారు శాంతి. ఆ పనితీరుకే గుర్తింపుగా ఇప్పుడీ పదవి దక్కింది.

ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లు పనిచేసిన ఆవిడ.. పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలకు కృషి చేశారు. ఆవిడ పనితీరును గమనించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సీఎం కార్యాలయంలో శాంతి కుమారి ఆధ్వర్యంలో పారిశ్రామిక ఛేదక విభాగం (ఛేజింగ్‌ సెల్‌)ను ఏర్పాటు చేశారు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ దేశ, విదేశాల పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు, ప్రభుత్వ రాయితీలు, సౌకర్యాలు, రాష్ట్ర వనరుల గురించి అవగాహన కల్పించడంలో విజయం సాధించారు. నాలుగేళ్లలో పెట్టుబడుల సమీకరణలో దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో నిలవడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఏ పదవిలో ఉన్నా వైద్యం, ఆరోగ్యం ఆవిడకు బాగా ఇష్టమైన సబ్జెక్టులు. అందుకే వైద్య, ఆరోగ్య శాఖలో వ్యాధుల నియంత్రణకు పాటు పడ్డారు. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రంలో అటవీ సంరక్షణకు ఎనలేని కృషి చేశారు. తెలంగాణ ప్రభుత్వం పోడు భూములకు పట్టాల అంశంపై చేపట్టిన అధ్యయనంలోనూ శాంతి కుమారిది కీలకపాత్రే!

-ఆకారపు మల్లేశం, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్