భవిష్యత్‌ కోసం.. మా బ్యాటరీలు!

పెట్రోల్‌ వంటి సహజ ఇంధన వనరులు అయిపోతే మన భవిష్యత్తేంటి? అందుకే ప్రత్యామ్నాయ వనరుల కోసం ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఆ కోవలోనే తక్కువ ఖర్చుతో తయారయ్యే బ్యాటరీని తయారు చేసి రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకున్నారు విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌.సుజాత.

Updated : 04 Jan 2023 07:45 IST

పెట్రోల్‌ వంటి సహజ ఇంధన వనరులు అయిపోతే మన భవిష్యత్తేంటి? అందుకే ప్రత్యామ్నాయ వనరుల కోసం ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఆ కోవలోనే తక్కువ ఖర్చుతో తయారయ్యే బ్యాటరీని తయారు చేసి రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకున్నారు విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌.సుజాత. వసుంధర ఆమెని పలకరించినప్పుడు ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారామె..

నేను పుట్టింది తిరువనంతపురంలోనే అయినా.. పెరిగింది కన్యాకుమారి జిల్లాలోని తిరునంతికర అనే గ్రామంలో. నాన్న కేజీ చంద్రశేఖరన్‌ నాయర్‌ ప్రముఖ రచయిత, అనువాదకులు. అమ్మ సరోజిని, ఇస్రో మాజీ ఛైర్మన్‌ మాధవన్‌ నాయర్‌కు స్వయానా చెల్లెలు. డిగ్రీవరకూ ప్రభుత్వ పాఠశాల, కాలేజీల్లోనే చదివా. పుణె విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్సీ కెమిస్ట్రీ, బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ నుంచి పీహెచ్‌డీ చేశా. ఆ తర్వాతే ఇస్రోలో నా కెరియర్‌ మొదలయ్యింది. మావారు వీవీ గోపినాథ్‌ రిటైర్డ్‌ బ్యాంక్‌ ఉద్యోగి. మా అమ్మాయి మీరా అమెరికాలో యూనివర్సిటీ ప్రొఫెసర్‌. అబ్బాయి గోకుల్‌ యూకేలో పరిశోధకుడు.

ఆవిష్కరణతో.. అద్భుతం

1986లో తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో ఉద్యోగినిగా చేరా. లోహాలకు తుప్పు రాకుండా.. వాటిపై వేసే రక్షణ పూతల తయారీ నా మొదటి పరిశోధనాంశం. దాని తర్వాతే ఐఆర్‌ఎస్‌- పీ3 ఉపగ్రహం కోసం బ్యాటరీ తయారీ బృందంలోకి వెళ్లాను. ఈ బ్యాటరీని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించాం. ఆ ప్రాజెక్ట్‌ బాధ్యత తీసుకున్న డాక్టర్‌ ఇళంగోవన్‌ గురువుగా నన్ను ముందుండి నడిపించారు. నా ఆసక్తిని గమనించి ఆయన కీలక బృందంలో బాధ్యతలు అప్పగించారు. ఇన్సాట్‌-4సీఆర్‌ ఉప్రగహంలోనూ మా బ్యాటరీ పరిశోధనలు ఉపయోగపడ్డాయి. తర్వాత వాణిజ్య అవసరాలకీ బ్యాటరీల వినియోగం పెరుగుతూ రావడంతో మా పరిశోధనలు కీలకంగా మారాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ వాహనాల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు బ్యాటరీల ధర, పరిమాణాన్ని తగ్గించేందుకు.. సూపర్‌ బ్యాటరీ కెపాసిటర్‌ సాంకేతికతను అభివృద్ధి చేశాం. దీనికి పేటెంట్‌నీ సాధించాం. ఈ సాంకేతికత అమలైతే ఈ-వాహనాల బ్యాటరీల ధరలు రూ.2.5లక్షల నుంచి రూ.27వేలకు తగ్గించవచ్చు. ఈ ఆవిష్కరణకే డాక్టర్‌ ఇళంగోవన్‌తో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ ఏడాది ‘నేషనల్‌ ఎనర్జీ ఇన్నోవేషన్‌’ పురస్కారం అందుకున్నా. ప్రస్తుతం ఎనర్జీ సిస్టమ్‌ సైన్సు విభాగానికి అధిపతిగా ఉన్న నాకు మా బృంద సహకారం ఉండబట్టే ఈ ఆవిష్కరణలో సవాళ్లని తేలిగ్గా పరిష్కరించుకోగలిగాం. ఇక రాష్ట్రపతి పురస్కారం అందుకున్న క్షణాల గురించి మాటల్లో చెప్పలేను. ఇన్నేళ్ల బాధను, కష్టాలను మరిపించిందీ అవార్డు.

భవిష్యత్‌ లక్ష్యాలు..

భవిష్యత్‌ ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని పరిశోధనలు చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న లిథియం అయాన్‌ బ్యాటరీల కన్నా రెట్టింపు సామర్థ్యంతో పనిచేసే లిథియం- సల్ఫర్‌ బ్యాటరీలపై పరిశోధిస్తున్నాం. అంతకంటే ఎక్కువగా వ్యర్థాలు, ఖర్చు తగ్గించేందుకు బ్యాటరీల రీసైక్లింగ్‌పైనా మా పరిశోధనలు సాగుతున్నాయి.

- కల్లిపూడి దేవేంద్రరెడ్డి, శ్రీహరికోట


వాటిని పట్టించుకోవద్దు..

శాస్త్రవేత్తలుగా ఎదగాలనే మహిళలకు లక్ష్యాలు స్పష్టంగా ఉండాలి. ఎవరేమన్నా పట్టించుకోవద్దు. విషయ పరిజ్ఞానం పెంచుకోవడంపైనే దృష్టి పెట్టండి. ఆ జ్ఞానమే మనల్ని క్లిష్ట పరిస్థితుల్లోనూ ముందుకు నడిపిస్తుంది. ఇక సవాళ్లు, కష్టాలు అంటారా.. అవి ఉన్నప్పుడే కదా మన సామర్థ్యం బయట ప్రపంచానికి తెలిసేది. అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవద్దు.


మిమ్మల్ని ప్రేమించుకోండి

నేను ప్రతి మహిళకీ చెప్పేది ఒకటే! ఇతరులెవరినీ ప్రేమించనంతగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అప్పుడే ఉన్నతంగా, సంతృప్తిగా ఎదగగలరు. మిమ్మల్ని ఎవరూ బాధించలేరు కూడా.

- ఆలియాభట్‌, నటి


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్