ఇంటింటి అవసరాలను గుర్తించి..

ఒకప్పుడు ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆమే నేడు 300 మందికి ఉపాధినిస్తోంది. ఇంటింటి అవసరాలను గుర్తించి తన వ్యాపార చిట్కాతో కోటిన్నర టర్నోవర్‌ సాధిస్తోంది ‘గోఎక్స్‌పర్ట్‌’ సంస్థ నిర్వాహకురాలు చిగురుపాటి స్నేహ సంతోషి.

Published : 10 Jan 2023 00:06 IST

ఒకప్పుడు ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆమే నేడు 300 మందికి ఉపాధినిస్తోంది. ఇంటింటి అవసరాలను గుర్తించి తన వ్యాపార చిట్కాతో కోటిన్నర టర్నోవర్‌ సాధిస్తోంది ‘గోఎక్స్‌పర్ట్‌’ సంస్థ నిర్వాహకురాలు చిగురుపాటి స్నేహ సంతోషి. ఒక క్లిక్‌తో మీ అవసరాలని గుర్తిస్తాం అంటోన్న ఆమెతో వసుంధర మాట్లాడింది..

జీవనశైలి మార్పులూ, గ్యాడ్జెట్స్‌ వినియోగం వంటి వాటితో.... ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు వస్తున్నాయి. వాటికి పరిష్కారాలను అందించగలిగితే కచ్చితంగా ఆదరణ లభిస్తుందన్న ఆలోచనే వ్యాపారానికి ఊతం ఇచ్చింది. మాది కాకినాడ. బీటెక్‌ చదివి హైదరాబాద్‌లోని ఓ బ్యాంకులో ఉద్యోగంలో చేరా. తర్వాత అజయ్‌ బాబుతో పెళ్లయ్యింది. ఆయనది విజయవాడ. తను ప్రైవేటు ఉద్యోగి. ఆయన ఉద్యోగరీత్యా నేనూ ఇక్కడికే వచ్చేశా. ఖాళీగా ఉండలేక ఏవో ప్రయత్నాలు చేసినా... నచ్చిన ఉద్యోగం దొరకలేదు. కానీ ఏదోటి చేయాలి, కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా ఉండాలనే ఆలోచన నిలవనిచ్చేది కాదు. తన సలహాతో కొన్ని వ్యాపార ఆలోచనలు చేశా. ఈలోగా ఉరుములేని పిడుగులా... కొవిడ్‌. వేలమంది ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారు. మరో పక్క అత్యవసర సేవలూ అందక ప్రజలూ అవస్థల పాలయ్యారు. అవన్నీ చూసి... అసంఘటిత రంగాల వారికి ఉపాధి కల్పించేలా, వినియోగదారుల అవసరాలను త్వరితగతిన తీర్చేలా ‘గో ఎక్స్‌పర్ట్‌’ అంకుర సంస్థను ప్రారంభించా. వ్యాపారం అంటే మాటలు కాదు... అందుకే మొదటి నుంచీ ప్రతి అడుగూ ఆచితూచి వేశాం. మా మొదటి పెట్టుబడి 15 లక్షలు. ఇందులో మావారు, నేనూ దాచుకున్న మొత్తం కొంత, మరికొంత రుణం.

18 విభాగాల్లో..

ప్రతి ఇంట్లో ప్లంబర్‌, ఏసీ టెక్నీషియన్‌, టైలర్‌, పెయింటర్‌ ఇలా ఎవరో ఒక నిపుణుని అవసరం ఉంటుంది. నగరాల్లో వీరిని సంప్రదించడం కష్టం. ఏదో విధంగా సేవలు పొందినా నాణ్యత గురించి బోలెడన్ని సందేహాలు. వ్యక్తిగతంగా ఇలాంటి అనుభవాలు మాకూ చాలా ఉన్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకుని 18 విభాగాల్లో సేవలు అందిస్తున్నాం. సుమారు 300 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. కరోనా రెండో వేవ్‌ నాటికి... ఉద్యోగుల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూనే మా సేవల్ని విస్తృతం చేయగలిగాం. ఏ వ్యాపారానికైనా వినియోగదారు సంతృప్తే ప్రధాన పెట్టుబడి. అందుకే... వారి సమస్యకి పరిష్కారం చూపేవరకూ మేం వెంటే ఉంటాం. ఇలా నాణ్యమైన సేవల వల్లే... మాపై నమ్మకం ఏర్పడింది. నోటిమాటతోనే వ్యాపారం పెరిగింది. ఇప్పటివరకూ పదివేలకు పైగా కుటుంబాలకు సేవల్ని అందించగలిగాం. యాప్‌, వెబ్‌సైట్‌తో పాటూ సోషల్‌ మీడియాలోనూ అందుబాటులో ఉంటున్నాం. మా మొదటి సర్వీస్‌ ఏసీ మరమ్మతు. ఇప్పుడు రోజూ 150 నుంచి 200 వరకూ కాల్స్‌ అందుకుంటున్నాం.

ఆరు నగరాల్లో...

విజయవాడతో పాటు హైదరాబాద్‌, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరంలో సేవల్ని అందిస్తున్నాం. దేశవ్యాప్తంగా శాఖల్ని విస్తరించే ఏర్పాట్లలో ఉన్నాం. ఆడపిల్లలు వ్యాపారం చేయడం, అందునా అనుభవంలేని రంగంలో అడుగుపెట్టడం కష్టమైన విషయాలే. ముఖ్యంగా ఆయా విభాగాల్లో నైపుణ్యం ఉన్నవారిని గుర్తించి పనిలో పెట్టుకోవడం, వారిని సంస్థతో ఉండేలా చూసుకోవడమే అతి పెద్ద సవాల్‌. దీనికోసం మార్కెట్లూ, స్థానిక కాలనీల చుట్టూ ఎన్ని సార్లు తిరిగానో లెక్కేలేదు. అన్ని ఇబ్బందులనీ అధిగమించి ఏటా రూ.1.5 కోట్ల టర్నోవర్‌ని అందుకోగలుగుతున్నా. రెండూ, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు నాకు. వారి ఆలనా పాలనా చూసుకుంటూనే వ్యాపార లావాదేవీలూ నిర్వహిస్తుంటా. బాధ్యత గల సిబ్బంది, చేయూత నిచ్చే భర్త తోడుగా ఉండటం వల్లే త్వరగా నిలదొక్కుకోగలిగా. ఆడపిల్లలు ఎవరి మీదా ఆధారపడకుండా పనులు చేసుకోవడం, సొంతంగా ఆలోచించడం మొదలు పెడితే చాలు...వ్యాపారాన్ని కూడా సులువుగా చేసేయొచ్చు.

- బోడశింగి సూరినాయుడు, విజయవాడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్