ఫ్రెండ్‌తో బయటికెడితే చెంపదెబ్బ..!

పిల్లలకు అమ్మానాన్నలే ధైర్యం! ఏ ఆపద ఎదురైనా వాళ్లు తోడుంటారని నమ్మకం ఉంటుంది. కానీ వందనా సక్సేనా పరిస్థితి అది కాదు. చిన్న తప్పుకీ శిక్ష తప్పదు. పెళ్లయ్యాకేమో ఆంక్షలు. అలాంటి  జీవితం ఎంత నరకంగా తోస్తుంది?

Updated : 07 Jun 2024 14:55 IST

పిల్లలకు అమ్మానాన్నలే ధైర్యం! ఏ ఆపద ఎదురైనా వాళ్లు తోడుంటారని నమ్మకం ఉంటుంది. కానీ వందనా సక్సేనా పరిస్థితి అది కాదు. చిన్న తప్పుకీ శిక్ష తప్పదు. పెళ్లయ్యాకేమో ఆంక్షలు. అలాంటి  జీవితం ఎంత నరకంగా తోస్తుంది? కానీ ఆమె వాటిని తట్టుకుని నిలవడమే కాదు... ఎంతోమంది ఆడవాళ్లను సాధికారత దిశగా నడిపిస్తున్నారు!

‘స్నేహితురాలు బలవంతపెడితే ఇంటికి దగ్గర్లో ఉన్న మార్కెట్‌కి వెళ్లా. అలా ఇంట్లో అడుగు పెట్టానో లేదో... చెంప మీద దెబ్బపడింది. చెప్పేది కూడా వినలేదు. పోనీ చిన్నపిల్లనా అంటే అప్పటికే టీనేజర్‌ని. ఇంకోసారి స్కూలు నుంచి వస్తోంటే ఎవరో ఏడిపించారు. ఏడుస్తూ వచ్చి ఇలా జరిగిందని చెప్పానంతే! వాళ్లని ఏమీ అనలేదు. ‘నువ్వేమీ అనకపోతే ఎందుకు ఏడిపిస్తా’రంటూ నన్నే తప్పుపట్టారు. ఇల్లంటే ఎవరికైనా భద్రతాభావం కలుగుతుంది. నాకు మాత్రం నరకంలా తోచేది. అప్పుడు నేను పెట్టుకున్న లక్ష్యం ఒకటే... బాగా చదివి, ఉద్యోగం సాధించాలి. ఈ ఆంక్షల నుంచి బయటపడాలనే’ అంటారు వందన. ఈమెది దిల్లీ. హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ; బిజినెస్‌ కమ్యూనికేషన్, డిజిటల్‌ మార్కెటింగ్‌ అండ్‌ కంటెంట్‌ రైటింగ్‌ల్లో డిప్లొమా చేశారు. ఉద్యోగం చేయాలని ఆమె... పెళ్లి చేయాలని ఇంట్లోవాళ్లు. ఈక్రమంలో తోటివిద్యార్థిని ఇంట్లోవాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారు. ‘సమస్య ఏదైనా ఆయన నాకు తోడుగా ఉండేవారు. కానీ అత్తమామలకే నేను నచ్చలేదు. ఉద్యోగం చేస్తున్నా, ఇంట్లో పనులన్నీ నావే. కనీసం కొట్టడం, తిట్టడాల్లేవని సంతోషించా’ననే వందన హెచ్‌ఆర్‌ విభాగంలో అంచెలంచెలుగా ఎదిగారు. అయితే అమ్మయ్యాక మాత్రం పాప కోసం విరామం తీసుకున్నారు. తనకు దక్కని ప్రేమ, స్వేచ్ఛ, ప్రోత్సాహం తన పాపకు అందించాలనుకున్నారామె. పాపని చూసుకుంటూనే కొన్ని కోర్సులు చేశారు. పుస్తకాలూ రాశారు. ఆన్‌లైన్‌లో కమ్యూనికేషన్‌ స్కిల్స్, కంటెంట్‌ రైటింగ్‌లపై క్లాసులు నిర్వహించేవారు. ఆమె ప్రతిభ చూసిన ఓ సంస్థ అవకాశమిచ్చింది. బ్లాగింగ్‌తోపాటు సంస్థల తరఫున శిక్షణ తరగతులు నిర్వహించేవారు. సొంతంగా చేయగలనని నమ్మకం వచ్చాక గత ఏడాది ‘వోయేజ్‌ ఎహెడ్‌ సొల్యూషన్స్‌ ఎల్‌ఎల్‌పీ’నీ ప్రారంభించారు. ‘ఇప్పటివరకూ 2వేలకు పైగా వర్క్‌షాప్‌లు నిర్వహించా. కార్పొరేట్‌ ట్రైనర్‌గా స్కిల్‌ డెవలప్‌మెంట్, బిజినెస్‌ రైటింగ్, టీమ్‌ బిల్డింగ్, కాన్‌ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్, ఇంటర్వ్యూ స్కిల్స్‌ మొదలైన అంశాల్లో విద్యార్థులు, ఉద్యోగులకు శిక్షణనిస్తుంటా. ఎల్‌జీ, హామిల్టన్, సుజుకీ, ఏరియల్, కోల్గేట్‌ వంటి సంస్థలు... ఎస్‌ఆర్‌ఎం, గల్గోతియా వంటి విశ్వవిద్యాలయాలు మాకు వినియోగదారులే. నీకోసం నువ్వే కష్టపడాలి. సమస్యలకు వెనకడుగు వేయొద్దు అని సలహానిస్తా’ననే వందన ప్రయాణం... స్ఫూర్తిదాయకమే కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్