Summer Tips: స్నానంతో అలసట దూరం!
వేసవిలో ఉక్కపోత, చెమట.. కారణంగా రోజు ముగిసే సరికి తీవ్రంగా అలసిపోతుంటాం. దీన్ని దూరం చేసుకొని తిరిగి ఉత్సాహంగా ఉండాలంటే స్నానం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు....
వేసవిలో ఉక్కపోత, చెమట.. కారణంగా రోజు ముగిసే సరికి తీవ్రంగా అలసిపోతుంటాం. దీన్ని దూరం చేసుకొని తిరిగి ఉత్సాహంగా ఉండాలంటే స్నానం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దామా...
పాలు, తేనెతో..
ఒక కప్పులో పచ్చిపాలు, తేనె సమపాళ్లలో (అరకప్పు చొప్పున) తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. కావాలనుకుంటే కొన్ని తాజా గులాబీ రేకల్ని కూడా ఈ నీటికి జత చేయచ్చు. ఈ నీటితో స్నానం చేయడం వల్ల చర్మం తిరిగి తాజాగా మారడంతో పాటు, ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. పాలలోని లాక్టిక్ ఆమ్లం చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తే, తేనె చర్మానికి తేమనందించి మృదువుగా ఉంచుతుంది.
సీ సాల్ట్, బేకింగ్ సోడాతో..
సీ సాల్ట్, బేకింగ్ సోడా కొద్దికొద్దిగా తీసుకొని స్నానం చేసే నీటిలో వేసి బాగా కలపాలి. ఈ నీటితో స్నానం చేయడం వల్ల చర్మం తిరిగి తాజాగా మారుతుంది. ఇందులో ఉపయోగించిన ఉప్పు చర్మపు పొరల్లో ఉన్న జిడ్డుని తొలగిస్తే, బేకింగ్ సోడా ఎక్స్‌ఫోలియేటర్‌గా పని చేసి చర్మాన్ని తాజాగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది.
కీరాదోస గుజ్జుతో..
కావాల్సినవి:
⚛ కీరాదోస (పెద్దది)- 1
⚛ ఎప్సం సాల్ట్- 2 కప్పులు
⚛ పెప్పర్‌మింట్ టీ బ్యాగ్స్- 5
ముందుగా కీరాదోస తొక్క చెక్కేసి ముక్కలుగా కోసుకోవాలి. వాటిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని ఒక మెత్తని వస్త్రంలో వేసి దాని నుంచి వచ్చే రసాన్ని స్నానానికి సిద్ధం చేసుకున్న బకెట్ నీళ్లలో పిండుకోవాలి. తర్వాత ఒక మగ్గు నీళ్లు తీసుకొని అందులో రెండు కప్పుల ఎప్సం సాల్ట్, పెప్పర్‌మింట్ టీ బ్యాగ్స్ వేసి బాగా మరిగించాలి. ఆ నీళ్లు సగం అయ్యే వరకు మరిగించి వాటిని కూడా బకెట్ నీటిలో కలుపుకోవాలి. ఈ నీటితో స్నానం చేస్తే అలసిన చర్మం తిరిగి తాజాగా మారడమే కాదు.. మనలో కొత్త ఉత్సాహం వస్తుంది. ఆసక్తి ఉన్నవారు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్‌ను కూడా కలుపుకోవచ్చు.
ఇవి కూడా!
⚛ ఐదారు బ్లాక్ లేదా గ్రీన్ టీ బ్యాగ్స్‌ను లీటర్ నీటిలో వేసి ఆ నీళ్లు సగం అయ్యేంత వరకు బాగా మరిగించాలి. ఈ మిశ్రమాన్ని కూడా స్నానం చేసే నీళ్లలో కలుపుకోవచ్చు.
⚛ రోజ్ ఆయిల్, ఓట్స్, వివిధ రకాల ఎసెన్షియల్ ఆయిల్స్, బాత్ సాల్ట్స్.. మొదలైనవి ఉపయోగించి కూడా ఎండ కారణంగా అలసిన చర్మానికి తిరిగి సాంత్వన చేకూర్చచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.