ఈ ట్రెండీ బ్లౌజెస్‌తో.. వేసవిలో సౌకర్యంగా..!

పండగలైనా, ప్రత్యేక సందర్భాలైనా చీరల్ని ఎంచుకొనే అమ్మాయిలు.. వేసవి అకేషన్లలోనూ వీటికే ప్రాధాన్యమిస్తారు. అయితే ఈ ఉక్కపోతలో చీరకట్టంటే కాస్త అసౌకర్యంగానే అనిపిస్తుంది. కానీ దానికి సౌకర్యవంతమైన బ్లౌజును జత చేస్తే.. ఇటు వేడిని తట్టుకుంటూనే, అటు స్టైలిష్‌గానూ మెరిసిపోవచ్చంటున్నారు ఫ్యాషన్‌ నిపుణులు.

Published : 05 Apr 2024 12:46 IST

(Photos: Instagram)

పండగలైనా, ప్రత్యేక సందర్భాలైనా చీరల్ని ఎంచుకొనే అమ్మాయిలు.. వేసవి అకేషన్లలోనూ వీటికే ప్రాధాన్యమిస్తారు. అయితే ఈ ఉక్కపోతలో చీరకట్టంటే కాస్త అసౌకర్యంగానే అనిపిస్తుంది. కానీ దానికి సౌకర్యవంతమైన బ్లౌజును జత చేస్తే.. ఇటు వేడిని తట్టుకుంటూనే, అటు స్టైలిష్‌గానూ మెరిసిపోవచ్చంటున్నారు ఫ్యాషన్‌ నిపుణులు. మరి, ఈ కాలంలో అటు సౌకర్యాన్ని పంచుతూనే, ఇటు ట్రెండీ లుక్‌ని అందించే కొన్ని బ్లౌజ్‌ డిజైన్లపై మనమూ ఓ లుక్కేద్దాం రండి..

‘ఆఫ్‌-షోల్డర్‌’తో అదుర్స్!

అకేషన్‌ ఏదైనా ప్రస్తుతం చాలామంది ట్రెడిషనల్‌ కంటే ట్రెండీగా ఉండే బ్లౌజ్‌ డిజైన్లకే ప్రాధాన్యమిస్తున్నారు. అలాంటి వాటిలో ఆఫ్‌-షోల్డర్‌ బ్లౌజులు ఈతరం అమ్మాయిల్ని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. మెడ వద్ద నెక్‌ వెడల్పుగా ఉంటూనే.. భుజాల నుంచి జాలువారేలా స్లీవ్స్‌ ఉండే ఈ రవిక ధరిస్తే లుక్‌ ఇనుమడిస్తుంది. అలాగే మెడ వద్ద బిగుతుగా ఉండకుండా.. శరీరానికి కాస్త గాలి తగిలేలానూ ఉంటుంది. ఇక డీప్‌ నెక్‌ ఇష్టపడని వారు బోట్‌ నెక్‌, తక్కువ వి-నెక్‌ వచ్చేలా బ్లౌజ్‌ను కుట్టించుకోవచ్చు. చీరకు మ్యాచింగ్‌ కలర్‌లో ఉన్న లైట్‌వెయిట్‌ షిఫాన్‌/జార్జెట్‌ తరహా మెటీరియల్స్‌తో ఆఫ్‌-షోల్డర్‌ బ్లౌజ్‌ను డిజైన్‌ చేయించుకుంటే ఈ కాలంలో సౌకర్యవంతంగానూ ఉంటుంది. ఫ్లోరల్‌ ప్రింటెడ్‌, ముదురు రంగు చీరలకు ఈ తరహా బ్లౌజ్‌లు ఇట్టే నప్పేస్తాయి. ఇలా ట్రెండీ శారీ-బ్లౌజ్‌కు తగినట్లే హెయిర్‌స్టైల్‌ని కూడా ఎంచుకుంటే స్టైలిష్‌గా కనిపించేయచ్చు.


స్లీవ్స్‌కి కొత్త స్టైల్!

విభిన్న డిజైన్లలో బ్లౌజుల్ని కుట్టించుకోవడమే కాదు.. స్లీవ్స్‌కీ సరికొత్త హంగులద్దుతున్నారు ఈ కాలపు అమ్మాయిలు. బ్లౌజ్‌ సాధారణంగానే ఉన్నా.. ట్రెండీ స్లీవ్స్‌తో కనికట్టు చేసేస్తున్నారు. కోల్డ్‌-షోల్డర్‌ బ్లౌజ్ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. భుజాల నుంచి కింది వైపు ఒక పెద్ద రంధ్రం చేసినట్లుగా ఉండే ఈ బ్లౌజ్‌.. ఎలాంటి వారికైనా ఫ్యాషనబుల్‌ లుక్‌ని అందిస్తుంది. అయితే ఇలా భుజాల వద్ద ఒకే రంధ్రం కాకుండా.. ఒక దాని తర్వాత మరొకటి వరుసగా హోల్స్‌ని అనుసంధానం చేసినట్లుగా ఉండే మల్టీ కోల్డ్‌ షోల్డర్‌ స్లీవ్స్‌నీ చాలామంది అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. ఒకవేళ ఈ రంధ్రం పెద్దగా, వెడల్పుగా పెట్టుకోవడానికి ఇష్టపడని వారు భుజాలపై చిన్నగా వచ్చేలా డిజైన్‌ చేయించుకోవచ్చు. పట్టు చీరల దగ్గర్నుంచి ఫ్యాన్సీ చీరల దాకా.. ఎలాంటి చీర మీదకైనా నప్పే ఈ రవికలు ధరించడం వల్ల శరీరానికి కాస్త గాలి తగులుతుంది. తద్వారా ఉక్కపోత నుంచి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది.


‘బ్యాక్‌లెస్‌’.. అయినా!

బ్లౌజ్‌కి ముందు భాగంలో తక్కువ నెక్‌ ఉండేలా.. వెనుక వైపు డీప్‌ నెక్‌ ఉండేలా కుట్టించుకోవడానికి ఇష్టపడుతున్నారు నేటి తరం అమ్మాయిలు. ఈ క్రమంలోనే బ్యాక్‌లెస్‌ బ్లౌజ్‌లకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. అయితే బ్యాక్‌లెస్‌ అనగానే కొంతమంది వీపు పూర్తిగా బయటికి కనిపిస్తుందని అసౌకర్యానికి గురవుతుంటారు. కానీ బ్లౌజ్‌కు ఇరువైపుల్నీ కలిపేలా బంధించే టై-అప్స్‌ ఈ అసౌకర్యానికి తెరదించుతున్నాయి. వీటిలోనూ సాధారణ త్రెడ్స్‌ కాకుండా.. కుచ్చుల మాదిరిగా ఉన్న దారాలు, బీడెడ్‌ టై-అప్స్‌, లేస్‌ టై-అప్స్‌, బౌ తరహా టై-అప్స్‌, టాజిల్‌ టై-అప్స్‌.. ఇలా బోలెడన్ని డిజైన్లలో మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిని ఉపయోగిస్తే బ్యాక్‌లెస్‌ బ్లౌజ్‌ ధరించినా వీపును కవర్‌ చేసేసుకోవచ్చు.. మరోవైపు సింపుల్‌ బ్లౌజే అయినా స్టైలిష్‌గానూ కనిపించేయచ్చు. అలాగే ఈ తరహా డిజైనర్‌ బ్లౌజ్‌తో శరీరానికి కాస్త గాలి తగిలి సౌకర్యవంతంగానూ మెరిసిపోవచ్చు.


‘షీర్‌ ప్యానల్‌’.. ఆ స్టైలే వేరు!

షీర్‌ ఫ్యాబ్రిక్‌.. అటు సౌకర్యాన్నిస్తూనే, ఇటు స్టైలిష్‌గా కనిపించేలా చేస్తుందిది. తేలిగ్గా, పారదర్శకంగా ఉండే ఈ మెటీరియల్‌తో చీరలే కాదు.. మ్యాచింగ్‌ బ్లౌజుల్నీ డిజైన్‌ చేయించుకుంటున్నారు ఫ్యాషన్‌ ప్రియులు. అవసరమైన చోట లైనింగ్‌తో కవర్‌ చేసుకొని.. మెడ, స్లీవ్స్‌ని ఇదే మెటీరియల్‌తో కుట్టించుకుంటే లుక్‌ ఇనుమడిస్తుంది. పైగా ఈ తరహా బ్లౌజ్‌ శరీరానికి అతుక్కున్నట్లున్నా.. పల్చగా ఉండడంతో శరీరానికి గాలి తగులుతుంది. తద్వారా అసౌకర్యానికి గురవకుండా జాగ్రత్తపడచ్చు. ఈ తరహా ఫ్యాబ్రిక్‌తో హైనెక్, టర్టిల్ నెక్‌, ఫుల్‌ స్లీవ్స్‌.. వంటివి ప్రయత్నించినా ఈ కాలంలో కంఫర్టబుల్‌గా, స్టైలిష్‌గా మెరిసిపోవచ్చు.


‘కలంకారీ’ కళ!

ఎన్ని ఫ్యాబ్రిక్స్‌ పుట్టుకొచ్చినా కాటన్‌ కలంకారీ సొగసే వేరు. ఆకర్షణీయమైన ప్రింట్లలో లభించే ఈ ఫ్యాబ్రిక్తో బ్లౌజులు కుట్టించుకోవడానికి చాలామంది అమ్మాయిలు, మహిళలు ఆసక్తి చూపుతున్నారు. పైగా ఈ తరహా బ్లౌజులు ఎలాంటి చీరల మీదకైనా ఇట్టే నప్పేస్తాయి. ప్లెయిన్‌, అక్కడక్కడా ప్రింట్లున్న శారీల పైకి వీటిని మ్యాచ్‌ చేసుకోవచ్చు.. ఫ్యాన్సీ చీరలకైనా జత చేసుకోవచ్చు. ఇది ఎలాగూ కాటన్‌ మెటీరియల్‌ కాబట్టి వేసవిలో కంఫర్టబుల్‌గానూ ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్