తన చిన్నారికి డైపర్ ర్యాషెస్.. అంకుర సంస్థతో పరిష్కారం!

ఈ రోజుల్లో వినూత్నమైన ఆలోచనలతో స్టార్టప్‌లను నెలకొల్పే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఒకవైపు సమస్యలకు పరిష్కారం వెతుకుతూనే మరోవైపు పర్యావరణహిత ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. ముంబయికి చెందిన పల్లవి ఉతగి ఇదే కోవకు చెందుతుంది. చిన్నారులకు డైపర్లను ఉపయోగించడం వల్ల ర్యాషెస్‌ రావడంతో పాటు పర్యావరణానికి హాని....

Published : 13 Jan 2023 12:46 IST

(Photos: Facebook)

ఈ రోజుల్లో వినూత్నమైన ఆలోచనలతో స్టార్టప్‌లను నెలకొల్పే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఒకవైపు సమస్యలకు పరిష్కారం వెతుకుతూనే మరోవైపు పర్యావరణహిత ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. ముంబయికి చెందిన పల్లవి ఉతగి ఇదే కోవకు చెందుతుంది. చిన్నారులకు డైపర్లను ఉపయోగించడం వల్ల ర్యాషెస్‌ రావడంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతోందని గమనించింది. తన చిన్నారి విషయంలో సైతం అదే సమస్య ఎదురవడంతో పరిష్కారాన్ని వెతకడం ప్రారంభించింది. ఈ క్రమంలో ‘సూపర్‌ బాటమ్స్‌’ అనే అంకుర సంస్థను నెలకొల్పి క్లాత్‌ డైపర్లను తయారుచేస్తోంది. తద్వారా ఎంతోమంది వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈక్రమంలో పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

ర్యాషెస్‌ రావడంతో..

ముంబయికి చెందిన పల్లవి ఉతగి బీఈ చేసి, ఆ తర్వాత జమ్నాలాల్‌ బజాజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో ఎమ్‌ఎమ్‌ఎస్ పూర్తి చేసింది. చదువు పూర్తైన తర్వాత ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అలా కొంతకాలం పనిచేసిన తర్వాత బాబు పుట్టడంతో ఇంటి దగ్గరే ఉంది. అయితే బాబుకు డిస్పోజబుల్‌ డైపర్లను ఉపయోగించడం వల్ల ర్యాషెస్‌ వస్తున్నాయని గమనించింది. మరోవైపు వీటిని ఉపయోగించడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని భర్త చెప్పడం తనను ఆలోచనలో పడేసింది. వీటికి పరిష్కారం కనుగొనాలని భావించింది. ఈక్రమంలో బాబుకి డైపర్లకు బదులు పాతపద్ధతిలో లంగోటీలు ఉపయోగించాలనుకుంది. కానీ, వాటిని తరచూ మార్చాలంటే చాలా ఇబ్బంది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి తెలిసిన వారితో కొన్ని క్లాత్ డైపర్లు తెప్పించుకుని ఉపయోగించడంతో తన సమస్య చాలావరకు తీరింది. అయితే ఆ డైపర్ల సైజు ఇక్కడి అందరి పిల్లలకు సరిపోవు. అందుకని వాటిని కొద్దిగా మార్చి ఉపయోగించడం మొదలుపెట్టింది. అయితే ఈ సమస్య తనక్కొదానిదే కాదని, చాలామంది తల్లులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకుంది. ఈక్రమంలో తనే సొంతంగా క్లాత్‌ డైపర్లను తయారుచేసే సంస్థను నెలకొల్పాలనుకుంది.

పరిశోధన చేసి..

ఆలోచనైతే వచ్చింది కానీ దాన్ని అమలు చేయడం అంత సులువు కాదన్న విషయం పల్లవికి తెలుసు. అందుకే దీనికి సంబంధించిన ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవాలని భావించింది. ఇందుకోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంది. మొదటగా డైపర్ల తయారీ గురించి తెలుసుకోవాలనుకుంది. ఇందుకోసం స్ట్రైడ్స్‌ అర్కోల్యాబ్, పిరమల్‌ హెల్త్‌కేర్‌ సంస్థల్లో పని చేసింది. ఇందులో భాగంగా వివిధ విభాగాల్లో మేనేజర్‌గా పని చేసి ప్రొడక్షన్‌, సేల్స్‌ వంటి వాటికి సంబంధించిన వివరాలను తెలుసుకుంది. ఇక డైపర్లు తయారుచేయాలంటే క్లాత్‌ అవసరం కాబట్టి దానిపై దృష్టి పెట్టింది. తనకు తెలిసిన కొంతమంది టెక్ట్స్‌టైల్‌ నిపుణులను సంప్రదించి వివరాలను సేకరించింది. వారి సూచనల మేరకు, మరింత సమాచారం కోసం చైనా వెళ్లింది. అమెరికాలో తయారయ్యే క్లాత్ డైపర్ల డిజైన్‌లో కొన్ని మార్పులు చేసి, కొన్ని డైపర్లను సొంతంగా తయారు చేసింది. వాటిని తన బాబుతో పాటు మరికొంతమంది స్నేహితుల పిల్లల చేత వాడించింది. వారి నుంచి సానుకూల స్పందన రావడంతో 2018లో ‘సూపర్‌ బాటమ్స్‌’ పేరుతో ఆన్‌లైన్ వేదికను నెలకొల్పి, దాని ద్వారా డైపర్లను విక్రయించడం మొదలుపెట్టింది.

సవాళ్లు దాటుకుని...

పల్లవి అనుకున్నట్లుగా డైపర్లను తయారుచేసింది. కానీ, ఈక్రమంలో ఆమెకు రెండు ప్రధాన సవాళ్లు ఎదురయ్యాయి. ఒకటి క్లాత్‌ డైపర్ల గురించి పేరెంట్స్‌కు అవగాహన లేకపోవడం. రెండోది స్టార్టప్‌ కావడంతో తక్కువ నైపుణ్యం ఉన్న మానవ వనరులతో మార్కెటింగ్‌ చేయించడం. ఇందుకోసం కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంది. మొదటగా తన ఉత్పత్తులను వాట్సప్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కొంతమందికి పరిచయం చేయగలిగింది. ఈక్రమంలో మొదటి డైపర్‌ తీసుకున్న వారికి నచ్చకపోతే నెలరోజుల్లో రిటర్న్‌ చేసే ఆఫర్‌ని ప్రకటించింది. అలాగే పేరెంట్స్‌కి వచ్చే సందేహాలను నివృత్తి చేయడం కోసం వాట్సప్‌ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. వీటి ద్వారా క్రమంగా వినియోగదారుల్లో నమ్మకం పెరిగింది. అలా కొంతకాలానికే సుమారు 20 లక్షల పేరెంట్స్‌కి ‘సూపర్‌ బాటమ్స్‌’ ఉత్పత్తులను పరిచయం చేయగలిగింది.

ఇతర ఉత్పత్తులు కూడా...

క్లాత్‌ డైపర్లు విజయవంతం కావడంతో కొంతమంది ‘సూపర్‌ బాటమ్స్’లో పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. వారితో కలిసి పల్లవి మరిన్ని ఉత్పత్తులను వినియోగదారులకు పరిచయం చేసింది. ఇందులో భాగంగా క్లాత్‌ లంగోటీలు, డైపర్ ప్యాంట్స్‌తో పాటు మహిళల కోసం పిరియడ్ ప్యాంట్స్, క్లాత్ ప్యాడ్స్ వంటి వాటిని ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. ఈ ఉత్పత్తులను కేవలం తన వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే కాకుండా వివిధ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల ద్వారా కూడా విక్రయిస్తూ లాభాలను ఆర్జిస్తోంది. బిజినెస్‌లో రాణించాలనుకునే ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్