టెన్షన్‌గా ఉందా? ఇలా రిలాక్సవ్వండి!

టెన్షన్‌, ఒత్తిడి మనలో చాలామందికి కామనే. అటు ఇంటి పని, ఇటు ఆఫీస్‌ పనులు బ్యాలన్స్‌ చేసుకోలేక.. మనకంటూ కాస్త సమయం కేటాయించుకోలేక.. కాసేపైనా విశ్రాంతి తీసుకునే సమయం దొరక్క.. తెగ టెన్షన్‌ పడిపోతుంటాం.

Published : 25 Nov 2023 19:11 IST

టెన్షన్‌, ఒత్తిడి మనలో చాలామందికి కామనే. అటు ఇంటి పని, ఇటు ఆఫీస్‌ పనులు బ్యాలన్స్‌ చేసుకోలేక.. మనకంటూ కాస్త సమయం కేటాయించుకోలేక.. కాసేపైనా విశ్రాంతి తీసుకునే సమయం దొరక్క.. తెగ టెన్షన్‌ పడిపోతుంటాం. అయితే ఇది ఎప్పుడో ఒకసారి అంటే పర్లేదు కానీ.. ప్రతి దానికీ ఇలా టెన్షన్‌ పడిపోతుంటే మాత్రం దాని ప్రభావం మానసిక ఆరోగ్యంపై పడుతుందంటున్నారు నిపుణులు. అందుకే కాస్త టెన్షన్‌గా అనిపించినప్పుడల్లా దాన్నుంచి వెంటనే విముక్తి పొందడానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటించాలని సలహా ఇస్తున్నారు. ఇంతకీ అవేంటో మనమూ తెలుసుకుందామా?!

మూడంకెలు లెక్కపెట్టండి!

టెన్షన్‌గా అనిపించినప్పుడల్లా దాన్నుంచి ఉపశమనం పొందడానికి గట్టిగా గాలి పీల్చి వదలడం మనలో చాలామంది చేసేదే! అయితే అలా చేసే క్రమంలో అంకెలు కూడా లెక్కపెట్టమని సలహా ఇస్తున్నారు నిపుణులు. అదెలాగంటే.. గట్టిగా గాలి పీల్చే క్రమంలో ముందుగా మూడంకెలు లెక్కపెట్టండి.. మరో మూడంకెలు లెక్కపెట్టే దాకా గాలిని అలాగే నిలిపి ఉంచండి.. ఆపై వదిలే క్రమంలో కూడా మరోసారి మూడంకెలు లెక్కపెట్టండి.. ఇలాగే మీరు కూర్చున్న చోటే ఓ పది సార్లు చేశారంటే ఎలాంటి టెన్షన్‌ అయినా హుష్‌కాకి అయిపోవాల్సిందే! ఇలా లెక్కించే క్రమంలో మన ఒత్తిడికి కారణమైన సమస్యను పక్కన పెట్టి సరిగ్గా లెక్కిస్తున్నామా లేదా అన్న దానిపైనే దృష్టిపెడతాం. తద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. ఇక టెన్షన్‌ పడుతున్నప్పుడు గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది.. కాబట్టి గాలి పీల్చి వదిలే క్రమంలో ఈ వేగం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. తద్వారా టెన్షన్‌ తగ్గుతుంది.

లేత రంగులతో ఒత్తిడి మాయం!

కొన్ని రంగులు మన మనసుకు ప్రశాంతతను అందిస్తాయని సైన్స్‌ చెబుతోంది. ముఖ్యంగా ముదురు వర్ణాల కంటే లేత రంగులు ఇందుకు దోహదం చేస్తాయట! కాబట్టి ఒత్తిడిగా అనిపించినప్పుడు లేత రంగులు, వాటి షేడ్స్‌ని చూస్తే మానసికంగా, ఎమోషనల్‌గా, శారీరకంగా రిలాక్సవుతామంటున్నారు నిపుణులు. అందుకే ఇంటి గోడలకు లేత వర్ణాలతో పెయింట్‌ చేసుకోవడం, మీ ఆఫీస్‌ గదిలో లేత రంగుల్లో చిత్రీకరించిన అందమైన పెయింటింగ్స్‌, బొమ్మలు వంటివి అమర్చుకోవడం వల్ల టెన్షన్‌గా అనిపించినప్పుడల్లా వాటిని చూడచ్చు.. తద్వారా వెంటనే టెన్షన్‌ తగ్గి మనసు రిలాక్సవుతుంది.

అరోమా థెరపీ!

మనం బాగా టెన్షన్‌లో ఉన్నప్పుడు వంటింట్లో నుంచి సువాసనలు మన ముక్కును తాకాయనుకోండి.. వెంటనే మన మనసు దాని వైపు మళ్లుతుంది. అదేంటో తెలుసుకోవాలన్న ఆరాటంతో గబగబా వంటింట్లోకి పరిగెడతాం. అలా సువాసనలకు కూడా మనలోని ఒత్తిళ్లను దూరం చేసే శక్తి ఉందని పలు అధ్యయనాలు కూడా స్పష్టం చేశాయి. దీన్నే అరోమా థెరపీ అంటారు. అందుకే మీరు ఎక్కడ పనిచేస్తున్నా మీ చుట్టూ మీకు నచ్చిన ఫ్లేవర్లతో తయారైన సెంటెడ్‌ క్యాండిల్స్‌, అత్యవసర నూనెలు, పూల మొక్కలు అందుబాటులో ఉంచుకోండి. ఒత్తిడిగా అనిపించినప్పుడల్లా వాటి వాసన చూస్తే మనసుకు ఎంతో రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది.

టీ/కాఫీ వద్దు..

టెన్షన్‌గా అనిపించినా, అలసిపోయినా తక్షణ శక్తి కోసం/రిలాక్స్‌ అవడం కోసం ఓ కప్పు టీ/కాఫీ తాగేద్దాం అనుకుంటుంటారు చాలామంది. ఆ అలవాటునే కాస్త ఆరోగ్యకరంగా మార్చుకోమని సలహా ఇస్తున్నారు నిపుణులు. పదే పదే టీ/కాఫీలకు బదులుగా గ్రీన్‌ టీని ఎంచుకోమంటున్నారు. ఇందుకూ కారణం లేకపోలేదు. గ్రీన్‌ టీ మన శరీరంలో సెరటోనిన్‌ స్థాయుల్ని పెంచడంలో దోహదం చేస్తుంది. హ్యాపీ కెమికల్‌గా పిలిచే సెరటోనిన్‌తో మనకు ఆరోగ్యమే కాదు.. ఒత్తిడి సైతం తగ్గుతుందట!

పరిగెత్తితే పోయేదేముంది!

మనం టెన్షన్‌ పడడానికి మన శరీరంలో అధికంగా విడుదలయ్యే కార్టిసాల్‌ హార్మోనే కారణం. ఒత్తిడిని కలిగించే ఈ హార్మోన్‌తో పోరాడి మనల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలంటే అందుకు శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవ్వాలి. అలా జరగాలంటే ఉన్న చోటు నుంచి బయటికొచ్చి ఓ పదిహేను నిమిషాల పాటు పరిగెత్తాలంటున్నారు నిపుణులు. తద్వారా విడుదలయ్యే ఎండార్ఫిన్లు మనసులోని ఒత్తిడిని మాయం చేస్తాయి. దీంతో పాటు యోగా, కార్డియో వ్యాయామాలు, డ్యాన్సింగ్‌, ఈత.. వంటివి కూడా టెన్షన్‌ను తగ్గిస్తాయి.

అందుకే టెన్షన్‌ పడద్దు!

ప్రస్తుత లైఫ్‌స్టైల్లో ఒత్తిడి ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. దీనివల్ల నిద్రలేమి, ఛాతీలో నొప్పి, గుండె సంబంధిత సమస్యలు, ఆందోళన, ఒంటరితనం, చెడు అలవాట్లకు బానిసవడం, చేసే పనిలో నాణ్యత కొరవడడం.. ఇలా అన్ని రకాలుగా మన రోజువారీ జీవనవిధానంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి ఒత్తిడిని నిర్లక్ష్యం చేయకుండా ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ దాన్నుంచి రిలాక్సవ్వాలి. తద్వారా ఆరోగ్యపరంగానే కాదు.. మానసిక సమస్యలకూ దూరంగా ఉండచ్చు.. పాజిటివిటీ పెరుగుతుంది.. నిర్ణయాలు తీసుకునే శక్తి మెరుగుపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్