చెట్ల బెరడుతో ఆభరణాలు.. అదే సుప్రియ స్పెషాలిటీ!

‘కాదేదీ కళకనర్హం’ అన్నట్లు.. ప్రకృతిలో లభించే ప్రతి వస్తువునూ మన జీవనశైలికి అనుగుణంగా, ఉపయుక్తంగా మలుస్తున్నారు ఈ కాలపు డిజైనర్లు. ముంబయికి చెందిన సుప్రియా శిర్సాత్‌ సతమ్‌ కూడా ఇందుకు...

Published : 02 May 2023 12:22 IST

(Photos: Instagram)

‘కాదేదీ కళకనర్హం’ అన్నట్లు.. ప్రకృతిలో లభించే ప్రతి వస్తువునూ మన జీవనశైలికి అనుగుణంగా, ఉపయుక్తంగా మలుస్తున్నారు ఈ కాలపు డిజైనర్లు. ముంబయికి చెందిన సుప్రియా శిర్సాత్‌ సతమ్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. కళలు-చేతి వృత్తుల కళాకారుల కుటుంబంలో పుట్టిపెరిగిన ఆమె.. కళల్ని స్వయంగా ఒంటబట్టించుకుంది.. మరోవైపు పర్యావరణమంటే ఆమెకు ఎనలేని ప్రేమ. ఈ రెండు ఆసక్తుల్ని ముడిపెట్టి ఓ ఆభరణాల బ్రాండ్‌ను ప్రారంభించిందామె. ఇందుకు విమానయాన రంగంలో తాను చేస్తున్న ఉద్యోగాన్ని సైతం వదులుకుందామె. అధునాతన స్టైల్స్‌ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా, పర్యావరణహితంగా ఆమె తయారుచేస్తోన్న ట్రెండీ జ్యుయలరీ ఎంతోమంది ఫ్యాషన్‌ ప్రియుల మనసు దోచుకుంటున్నాయి. అంతేకాదు.. పెటా ఇండియా నుంచి ఇటీవలే ‘వీగన్‌ ఫ్యాషన్‌ అవార్డు - 2022’ సైతం తెచ్చిపెట్టాయి. మరి, ఈ యువ డిజైనర్‌ వ్యాపార ప్రయాణం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం రండి..

ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ చదివిన సుప్రియ.. మార్కెటింగ్‌ విభాగంలో ఎంబీఏ పూర్తిచేసింది. చదువు పూర్తయ్యాక జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానయాన సంస్థలో ‘మొబైల్ కామర్స్‌ హెడ్‌’గా పనిచేసిన ఆమె.. తన కెరీర్‌లో వ్యాపార రంగంలోనే స్థిరపడాలనుకుంది. అయితే తాను పెరిగి పెద్దయ్యే క్రమంలో తన తల్లిదండ్రులు చేసే దుస్తుల వ్యాపారం చూసి.. తానూ ఈ రంగంలోకి రావాలనుకున్నానంటోంది.

అమ్మానాన్నల స్ఫూర్తితో..!

‘అమ్మానాన్నలు దుస్తుల రీసైక్లింగ్‌ వ్యాపారం చేసేవారు. వీటితో విభిన్న డిజైనర్‌ దుస్తుల్ని రూపొందించేవారు. అందమైన క్రాఫ్ట్స్‌ తయారుచేసేవారు. ఇలా పర్యావరణహితం కోరి వారు చేసే పని నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. ఈ క్రమంలో నాకూ పర్యావరణంపై మక్కువ పెరిగింది.. కళలపై అభిరుచి ఏర్పడింది. అందుకే ఎదిగే క్రమంలో నేను ఎంచుకునే దుస్తులు, ఆహారం, సౌందర్యోత్పత్తులు.. ఇలా ప్రతిదీ ఎకో-ఫ్రెండ్లీగానే ఉండేలా జాగ్రత్తపడేదాన్ని. ఇక విమానయాన సంస్థలో పనిచేస్తున్నప్పుడు పర్యావరణానికి హాని కలిగించే గ్రీన్‌హౌస్‌ వాయువులపై ఓ చిన్న పాటి అధ్యయనం చేశా. ఈ క్రమంలో విమానాల కంటే ఫ్యాషన్‌ పరిశ్రమ వల్లే పర్యావరణానికి ఎక్కువ హాని కలుగుతుందన్న విషయం అర్థమైంది. దీన్ని తగ్గించాలన్న ఉద్దేశంతోనే పర్యావరణహిత ఆభరణాలు తయారుచేయాలని ఆలోచన చేశా. ఇదే ‘FOReT’ అనే సంస్థకు బీజం వేసింది. చెట్ల బెరడును రీసైక్లింగ్‌ చేసి వివిధ రకాల ఆభరణాలు తయారుచేయడమే మా బ్రాండ్‌ ముఖ్యోద్దేశం..’ అంటూ చెప్పుకొచ్చింది సుప్రియ.

స్టైల్స్‌లో రాజీపడకుండా..!

సంప్రదాయబద్ధమైన ఆభరణాల కంటే స్టైలిష్‌గా, ట్రెండీగా ఉండే జ్యుయలరీకే ఓటేస్తున్నారు ఈ కాలపు అమ్మాయిలు. అందుకే తాను రూపొందించే ఆభరణాల విషయంలోనూ ఇదే సూత్రాన్ని పాటిస్తున్నానంటోంది సుప్రియ.

‘ఆభరణాల తయారీ కోసం రీసైక్లింగ్‌ చేసిన కార్క్‌ ఓక్‌, అరటి చెట్ల బెరడును ఉపయోగిస్తున్నాం. ఇది చాలా మృదువుగా ఉంటుంది. పైగా దీనిపై సహజసిద్ధంగా ఉండే గీతలు నగకు సహజత్వాన్ని అందిస్తాయి. ప్రస్తుతం వీటితో మెడ ఆభరణాలు, గాజులు, హ్యాండ్‌ కఫ్స్‌, చెవిదిద్దులు, నెక్లెస్, ఉంగరాలు, బ్రేస్‌లెట్స్‌.. వంటి విభిన్న ఆభరణాలు తయారుచేస్తున్నాం. ఇక లాకెట్స్‌ కోసం స్టీల్‌, సెరామిక్‌, ఇతర లోహాలతో తయారుచేసిన బీడ్స్‌ని ఉపయోగిస్తున్నాం. అలాగే కార్క్‌ ఓక్‌ చెట్ల బెరడుతో వ్యాలెట్స్‌, బ్యాగ్స్‌.. అరటి చెట్టు బెరడుతో హ్యాండ్‌ బ్యాగ్స్‌ కూడా మా వద్ద లభిస్తున్నాయి. ఇలా ఆయా మెటీరియల్‌తో మేము తయారుచేసే ఆభరణాలు, ఇతర యాక్సెసరీస్‌ ఈ కాలపు అమ్మాయిలకు నచ్చేలా ఆధునిక స్టైల్స్‌లో ఉండేలా జాగ్రత్తపడుతున్నాం. మా బ్రాండ్‌ ఎక్కువమంది వినియోగదారుల్ని ఆకట్టుకోవడానికి ఇదే ముఖ్య కారణం.. ఇక మా ఉత్పత్తులు పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీల మనసు దోచుకున్నాయి కూడా!’ అంటోందీ ముంబయి డిజైనర్.

నమ్మకమే నడిపిస్తుంది!

ప్రస్తుతం మహిళలకు విభిన్న ఆభరణాలు, వస్తువులు తయారుచేయడమే కాదు.. పురుషులు, పిల్లల కోసం ఈ చెట్ల బెరడుతో రూపొందించిన పలు ఉత్పత్తుల్ని అందుబాటులో ఉంచారు సుప్రియ. వీగన్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌గా పేరు పొందిన తన సంస్థ ద్వారా ఉత్పత్తి చేసే వస్తువులను ప్యాక్‌ చేయడానికి కూడా.. రీసైక్లింగ్‌ చేసిన అందమైన ప్రింటెడ్‌ పేపర్‌ బ్యాగ్స్‌ని ఉపయోగిస్తున్నారామె. ‘జీరో వేస్ట్‌’ నినాదంతో పూర్తి పర్యావరణహితంగా తయారవుతోన్న తన ఉత్పత్తులకు పెటా ఇండియా నుంచి వీగన్‌ సర్టిఫికేషన్‌ లభించింది. అలాగే ఇటీవలే ‘వీగన్‌ ఫ్యాషన్‌ అవార్డు’ కూడా అందుకుంది సుప్రియ.

‘నా ఆలోచనలెప్పుడూ ఆభరణాల డిజైనింగ్‌ చుట్టూనే తిరుగుతుంటాయి. ఈ ప్రకృతిలో నా కంట పడే ఆకులు, లతలు, మేఘాలు.. ఇలా ప్రతిదీ స్ఫూర్తిగా తీసుకొని డిజైన్‌ స్కెచ్‌ వేస్తాను. మా వద్ద ఉండే నిపుణులైన చేతి వృత్తి కళాకారులు వాటికి అందమైన రూపమిస్తారు..’ అంటోన్న ఈ ముంబయి డిజైనర్‌.. మన నమ్మకమే మనల్ని లక్ష్యం వైపు నడిపిస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నారు. అంతేకాదు.. ఇలా తన పనితనంతో పర్యావరణంపై మక్కువను చాటడమే కాదు.. రీసైక్లింగ్‌పై అందరిలో అవగాహన పెంచడానికి పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు సుప్రియ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్