5 వేలతో మొదలుపెట్టి.. కోట్ల ఆదాయం!

ఈ సృష్టిలో వృథా అనేదే ఉండదు. ఆఖరికి వ్యర్థం అంటూ పడేసే వాటినీ మనం నిత్యం ఉపయోగించే వస్తువులుగా తీర్చిదిద్దుకోవచ్చు.. ఇదే చేసి చూపిస్తోంది సూరత్‌ అమ్మాయి రాశీ అగర్వాల్‌. ఆర్కిటెక్చర్‌ చదివిన రాశి ఇవే డిజైనింగ్‌ నైపుణ్యాల్ని పర్యావరణహితమైన వస్తువుల ఉత్పత్తి కోసం వినియోగిస్తోంది....

Published : 18 May 2024 17:33 IST

(Photos : Instagram)

ఈ సృష్టిలో వృథా అనేదే ఉండదు. ఆఖరికి వ్యర్థం అంటూ పడేసే వాటినీ మనం నిత్యం ఉపయోగించే వస్తువులుగా తీర్చిదిద్దుకోవచ్చు.. ఇదే చేసి చూపిస్తోంది సూరత్‌ అమ్మాయి రాశీ అగర్వాల్‌. ఆర్కిటెక్చర్‌ చదివిన రాశి ఇవే డిజైనింగ్‌ నైపుణ్యాల్ని పర్యావరణహితమైన వస్తువుల ఉత్పత్తి కోసం వినియోగిస్తోంది. కాటన్‌ వ్యర్థాలతో అందమైన స్టేషనరీ ఉత్పత్తుల్ని తయారుచేస్తూ ఏడాది తిరిగేసరికి కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది.. అంతేనా.. తన వ్యాపారంతో ఓవైపు కళాకారుల్ని ప్రోత్సహిస్తూనే.. మరోవైపు వారికి ఉపాధి కల్పిస్తూ సమాజాభివృద్ధికీ పాటుపడుతున్న రాశి బిజినెస్ జర్నీ గురించి తెలుసుకుందాం..

రాశికి చిన్నప్పట్నుంచి డిజైనింగ్‌ అంటే మక్కువ. ఈ ఇష్టంతోనే ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌.. వంటివి తయారుచేసేది. వాటిని స్నేహితులకు బహుమతిగా అందించడం, స్కూల్లో జరిగే ఎగ్జిబిషన్లలో ప్రదర్శించడం, డిజైనింగ్‌కు సంబంధించిన పోటీల్లో పాల్గొనడం.. ఇలా తన డిజైనింగ్‌ నైపుణ్యాల్ని మరింతగా మెరుగుపరచుకుంది. ఎప్పటికైనా తనలో ఉన్న ఈ డిజైనింగ్‌ నైపుణ్యాలతో వ్యాపారం ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న రాశి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ పూర్తి చేసింది.

వాళ్లను కలిశాకే..!
ఆర్కిటెక్చర్‌ చదివే క్రమంలోనే భారతదేశ కళలు, క్రాఫ్ట్స్‌, డిజైనింగ్‌ నైపుణ్యాల గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే దిల్లీ నుంచి జైపూర్‌, కచ్‌ నుంచి అహ్మదాబాద్‌, పుదుచ్చేరి నుంచి పుణే వరకు ప్రయాణించి.. ఆయా ప్రాంతాల్లో ఉన్న కళాకారుల్ని కలుసుకుంది. వారిలో ఉన్న కళా నైపుణ్యాల గురించి తెలుసుకొని వాటిపై అవగాహన పెంచుకుంది. అంతేకాదు.. ప్రింటింగ్‌ మెషీన్లు వచ్చాక చేత్తో రూపొందించే కళలకు డిమాండ్‌ తగ్గుతోందన్న విషయం కూడా తన అధ్యయనంలో భాగంగా తెలుసుకున్న ఆమె.. ఈ అంశాలన్నీ రంగరించి థీసిస్‌గా రూపొందించి కాలేజీలో సమర్పించింది రాశి. చదువు పూర్తయ్యాకా రాశిని ఒకే ఒక ప్రశ్న వేధించేది. ‘తాను కలిసిన చేతి వృత్తి కళాకారులకు తానెలా ఉపాధి కల్పించగలను?’ అని! ఈ ఆలోచనే 2020లో ‘రూహానీ రంగ్‌ డిజైన్‌ స్టూడియో’ను ప్రారంభించేలా చేసిందంటోంది.

కాటన్‌ వ్యర్థాలతో..!
‘నేను కలిసిన కళాకారుల్లో చాలావరకు పేపర్‌ తయారీలో నైపుణ్యాలున్న వారే ఉన్నారు. మరి, పేపర్‌ తయారీ అంటే చెట్ల కలపను ఉపయోగించాలి.. దీనివల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుంది. అందుకే పర్యావరణహితంగానే పేపర్‌, ఇతర స్టేషనరీ వస్తువులు తయారుచేయాలనుకున్నా. ఈ ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నప్పుడే కాటన్‌ వ్యర్థాలు గుర్తొచ్చాయి. అనుకున్నదే తడవుగా ఈ వ్యర్థాల్ని సేకరించి.. రీసైక్లింగ్‌ చేసి.. మొదట డైరీలకు కవర్‌ పేజీలు తయారుచేయడం, వాటిపై పెయింటింగ్‌తో హంగులద్దడం ప్రారంభించా. స్నేహితులు, తెలిసిన వారి నుంచి వీటికి మంచి స్పందన రావడంతో.. పేపర్‌ తయారీలో నైపుణ్యాలున్న కళాకారుల్ని రిక్రూట్‌ చేసుకొని స్టేషనరీ ఉత్పత్తుల తయారీ మొదలుపెట్టా. ఇలా డైరీలతో మొదలుపెట్టి.. ప్రస్తుతం ప్లానర్స్‌, క్యాలండర్స్‌, పాకెట్‌ నోట్‌బుక్స్‌, నోట్‌ప్యాడ్‌ సెట్స్‌, స్కెచ్‌బుక్స్‌.. వంటి స్టేషనరీ ఐటమ్స్‌ ఎన్నో తయారుచేస్తున్నాం. వీటిపై మినియేచర్‌ పెయింటింగ్‌, గోంద్‌ ఆర్ట్‌, మధుబనీ ఆర్ట్‌, తంజావూర్ పెయింటింగ్‌.. వంటి ప్రాచీన కళారీతులతో హంగులద్దుతున్నా..’ అంటూ తన వ్యాపార ప్రయాణం గురించి చెప్పుకొచ్చింది రాశి.

5 వేలతో మొదలుపెట్టి..!
తాను రూపొందించే స్టేషనరీ ఐటమ్స్‌ కోసం.. టెక్స్‌టైల్‌ ఫ్యాక్టరీల నుంచి కాటన్‌ వ్యర్థాల్ని సేకరిస్తోంది రాశి.
‘దారాలు, దుస్తులు తయారుచేసే క్రమంలో మిగిలిపోయిన చిన్న చిన్న కాటన్‌ వ్యర్థాల్ని పేపర్‌ తయారీ కోసం ఉపయోగిస్తున్నాం. ఇవి ప్రాథమికంగానే తెలుపు రంగులో ఉంటాయి కాబట్టి వీటిని తిరిగి శుద్ధి చేయడానికి రసాయనాల అవసరం ఉండదు. కాటన్‌ వ్యర్థాల్ని రీసైక్లింగ్‌ చేయడం దగ్గర్నుంచి వాటిని ఆరబెట్టడం, ప్రింటింగ్‌, పేపర్‌ తయారీ, బైండింగ్‌, ప్యాకింగ్‌.. ఇలా ప్రతి దశలోనూ మెషీన్ల వినియోగం లేకుండా చేత్తోనే తయారుచేయిస్తున్నాం. చేత్తో తయారుచేసే పేపర్‌ కంటే మిల్లులో తయారుచేసే పేపర్‌కు నీటిని ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. పైగా మా వద్ద పేపర్‌ తయారీలో ఎలాంటి రసాయనాలూ ఉపయోగించం. ఇలా ఇప్పటివరకు సుమారు 9 వేల కిలోలకు పైగా కాటన్‌ వ్యర్థాలతో 15 వేల స్టేషనరీ ఉత్పత్తుల్ని తయారుచేసి విక్రయించాం. అంటే.. సుమారు 100 అడవుల కలపను రక్షించగలిగాం. ప్రస్తుతం మా వద్ద 50 మంది కళాకారులు, 15 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఓవైపు పర్యావరణాన్ని కాపాడుతూనే.. మరోవైపు చేతివృత్తుల కళాకారులకు ఉపాధి కల్పించడం సంతోషంగా ఉంది..’ అంటోంది రాశి. ప్రస్తుతం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ వేదికగా తన స్టేషనరీ ఉత్పత్తుల్ని విక్రయిస్తోన్న ఆమె.. తొలుత 5 వేలతో ప్రారంభించిన ఈ వ్యాపారంలో.. ప్రస్తుతం కోట్ల రూపాయలు ఆర్జిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్