Neend App: కథలతో నిద్రపుచ్చే యాప్‌ని రూపొందించింది!

ఇలా పడుకోగానే అలా క్షణాల్లో నిద్రలోకి జారుకునే వాళ్లను చూసి.. ‘తనకంటే అదృష్టవంతులు లేరు!’ అనుకుంటాం. ప్రస్తుతమున్న జీవన విధానంలో సుఖ నిద్రకు అంత విలువ పెరిగిపోయింది మరి! వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాలు చాలామందిని ప్రశాంతమైన నిద్రకు దూరం చేస్తున్నాయి. తద్వారా లేనిపోని అనారోగ్యాల....

Updated : 21 Nov 2022 16:49 IST

(Photo: LinkedIn)

ఇలా పడుకోగానే అలా క్షణాల్లో నిద్రలోకి జారుకునే వాళ్లను చూసి.. ‘తనకంటే అదృష్టవంతులు లేరు!’ అనుకుంటాం. ప్రస్తుతమున్న జీవన విధానంలో సుఖ నిద్రకు అంత విలువ పెరిగిపోయింది మరి! వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాలు చాలామందిని ప్రశాంతమైన నిద్రకు దూరం చేస్తున్నాయి. తద్వారా లేనిపోని అనారోగ్యాల పాల్జేస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితిని మనం తేలిగ్గా తీసుకోవచ్చు.. కానీ రాజస్థాన్‌కు చెందిన సురభి జైన్‌ మాత్రం ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం కనుక్కోవాలనుకుంది. ఈ మేధోమథనంలో నుంచి పుట్టిందే ‘నీంద్‌ యాప్‌’. దీని ద్వారా ఆసక్తికరమైన కథలు చెప్తూ, బ్యాక్‌గ్రౌండ్‌లో వినసొంపైన సంగీతంతో మెడిటేట్‌ చేస్తూ.. ఎంతోమందికి సుఖ నిద్ర అనే వరాన్ని ప్రసాదిస్తోందామె. ఈ నేపథ్యంలో సురభి తన యాప్‌ గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి..

చిన్నతనంలో అమ్మమ్మలు, నాన్నమ్మలు చెప్పే కథలు వింటూ నిద్రలోకి జారుకునే వాళ్లం. తన పసి వయసులో సురభి కూడా అంతే! తన బామ్మ చెప్పే కథలు వింటూ తనను తానే మైమరచిపోయేది. గాఢ నిద్రలోకి జారుకునేది. అయితే ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్లో ఆ అదృష్టం చాలామంది పిల్లలకు దక్కట్లేదనే చెప్పాలి. పైగా వివిధ వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాలు, మానసిక సమస్యల రీత్యా ఎంతోమందికి సుఖ నిద్ర కరువవుతోంది. స్వీయానుభవంతో ఈ విషయాన్ని గ్రహించిన సురభి.. ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని నిర్ణయించుకుంది.

‘చదువు’ పాట్లు తప్పలేదు!

రాజస్థాన్‌లోని లావా అనే చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన సురభిది సంప్రదాయ మార్వాడీ కుటుంబం. అయితే స్థానికంగా సరైన విద్యా సదుపాయాలు లేకపోవడంతో ప్రాథమిక విద్య విషయంలో కొన్నేళ్ల పాటు పలు ఇబ్బందుల్ని ఎదుర్కొందామె. ఈ క్రమంలో చదువుపై ఆసక్తి ఉండడంతో సొంతంగానే ప్రిపేరై ఎలాగోలా స్కూలింగ్‌ పూర్తిచేసిందామె. ఆ తర్వాత ఐఐటీ-జేఈఈ కోచింగ్‌ తీసుకొని మంచి ప్రతిభ కనబరిచింది. దీంతో ఐఐటీ-ముంబయిలో మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌లో సీటు సంపాదించింది. అయితే అప్పటికే ఆమె కుటుంబంలో వ్యాపార మూలాలుండడంతో తానూ బిజినెస్‌పై ప్రేమ పెంచుకుంది. ఇక చదువు పూర్తి చేశాక కొన్ని కంపెనీల్లో కన్సల్టెంట్‌గా పనిచేసిన ఆమెకు.. ఈ పని నైపుణ్యాలు వ్యాపారంలో బాగా ఉపయోగపడ్డాయని చెబుతోంది.

కొవిడ్‌తో కార్యరూపం!

సురభి ముందు నుంచీ వ్యాపారమైతే చేయాలనుకుంది.. కానీ ఎలాంటి బిజినెస్‌ చేయాలన్న దానిపై ఆమెకు స్పష్టత లేదు. ఇలాంటి తరుణంలో కొవిడ్‌ పరిస్థితులే తనకో దారి చూపాయని చెబుతోందామె. ‘మాది మార్వాడీ కుటుంబం. మా ఇంట్లో చాలా వరకు వివిధ వ్యాపారాల్లోనే స్థిరపడ్డారు. దాంతో నాకూ అదే దిశగా అడుగులు వేయాలనిపించింది. ఇలా ఆలోచిస్తోన్న తరుణంలోనే అనుకోకుండా మా కుటుంబమంతా కొవిడ్‌ బారిన పడింది. ఇది మా జీవనశైలిపై ప్రతికూల ప్రభావం చూపింది. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. తీరా ఈ మహమ్మారి నుంచి బయటపడినా నిద్ర సమయాల్లో మాత్రం మార్పు రాలేదు. కొన్నిసార్లైతే ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టేది కాదు. నిద్ర సమస్యలున్న వారి అవస్థలేంటో అప్పుడు నాకు అర్థమైంది. అందుకే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని నిర్ణయించుకున్నా. దీన్ని నా వ్యాపార ఆలోచనతో ఎలా ముడిపెట్టాలన్న విషయంపై ఓ చిన్నపాటి మేధోమథనం చేశా. మరోవైపు నెలల పాటు పరిశోధనలు చేశా. చివరగా గతేడాది ‘నీంద్‌ యాప్‌’ను ప్రారంభించా..’ అని చెబుతోంది సురభి.

కథ, సంగీతం కలగలిపి..!

మానసికంగా, శారీరకంగా ఎన్ని సమస్యలున్నా.. వాటిని మైమరచిపోయి రిలాక్సవుతూ.. సుఖ నిద్రకు ప్రేరేపించే యాప్‌ ఇది. ‘మన జీవనశైలిలో నిద్రకు భంగం కలిగించే అంశాలు బోలెడుంటాయి. మానసిక, శారీరక సమస్యలు కావచ్చు.. చుట్టూ ఉన్న వాతావరణం కావచ్చు.. వ్యక్తిగతంగా ఉన్న అలవాట్లు, జీవన శైలి కావచ్చు.. వీటన్నింటి నుంచి బయటపడి విశ్రాంతి పొందాలంటే బెడ్‌టైమ్‌ స్టోరీస్‌, వినసొంపైన సంగీతం.. చాలా ముఖ్యం. నీంద్‌ యాప్‌ ముఖ్యోద్దేశం కూడా ఇదే! ఆసక్తికరమైన లఘు కథలతో పాటు వాటికి బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అయ్యే మంద్రస్థాయి సంగీతం మనసుకు మెడిటేషన్‌లా పనిచేస్తుంది. ఏకకాలంలో ఈ రెండూ కలగలిపి వినడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఇదే క్రమంగా గాఢ నిద్రలోకి జారుకునేలా చేస్తుంది. ప్రస్తుతం ఇలాంటి ఆసక్తికరమైన కంటెంట్‌ని రూపొందించడానికి మా వద్ద నిపుణులతో కూడిన బృందం పనిచేస్తోంది..’ అంటూ చెప్పుకొచ్చిందీ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్.

మాతృభాషలోనే..!

సాధారణంగా మనం మన మాతృభాషలోనే కథలు వినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటాం. అందుకే ప్రస్తుతం హిందీ, ఆంగ్ల భాషల్లో మాత్రమే అందిస్తోన్న తన సేవల్ని మరిన్ని ప్రాంతీయ భాషల్లోకి విస్తరించాలనుకుంటున్నట్లు చెబుతోంది సురభి. పైగా ప్రాంతీయ భాషల్లో బెడ్‌టైమ్‌ స్టోరీస్‌ సేవల్ని ఉచితంగా ఆన్‌లైన్‌లో అందిస్తోన్న తొలి భారతీయ యాప్‌ ఇది.

‘నా చిన్నతనంలో మా బామ్మ నాకు బోలెడన్ని బెడ్‌టైమ్‌ స్టోరీస్‌ చెప్పేది. కథలైనా, పాటలైనా మన మాతృభాషలో రూపొందించిన వాటిని వినడానికే ఆసక్తి చూపుతాం. అందుకే నా యాప్‌ను మరిన్ని భాషల్లోకి విస్తరించాలని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లోనే ఇది అందుబాటులో ఉంది. కానీ త్వరలో మరాఠీ, తమిళం, తెలుగు, బెంగాలీ.. వంటి భాషల్లో ఆసక్తికరమైన కథల్ని తీసుకురావాలన్న ఆలోచన చేస్తున్నా. ఈ క్రమంలో ప్రి-సీడ్‌ రౌండ్‌లో భాగంగా సుమారు 5 కోట్లకు పైగా పెట్టుబడుల్ని కూడా సేకరించాం. అంతేకాదు.. ఒత్తిడిని దూరం చేసి విశ్రాంతిని అందించే కొన్ని ఉత్పత్తులు ప్రస్తుతం మా వద్ద లభిస్తున్నాయి. ఇలాంటి మరికొన్ని ఉత్పత్తులు త్వరలోనే మార్కెట్లోకి తీసుకురావాలనుకుంటున్నా..’ అంటూ తన భవిష్యత్‌ లక్ష్యాల గురించి పంచుకుంది నీంద్‌ సృష్టికర్త.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్