కమ్మలమ్మి... కుట్టుపని నేర్చుకుని!

ఊళ్లో ఏడోతరగతి వరకే ఉంది...పైచదువులకి వెళ్లాలంటే బస్సు సదుపాయం లేని పల్లెటూరు. అయితేనేం... కుట్టుపని నేర్చుకుని.. వ్యాపారవేత్తగా ఎదిగారు లత నడుకుడ. ఉచిత శిక్షణ- ఉపాధి కల్పన అనే నినాదంతో మహిళలకు అండగా నిలుస్తున్న ఆమె విజయగాథ ఇది.

Published : 30 May 2024 05:14 IST

ఊళ్లో ఏడోతరగతి వరకే ఉంది...పైచదువులకి వెళ్లాలంటే బస్సు సదుపాయం లేని పల్లెటూరు. అయితేనేం... కుట్టుపని నేర్చుకుని.. వ్యాపారవేత్తగా ఎదిగారు లత నడుకుడ. ఉచిత శిక్షణ- ఉపాధి కల్పన అనే నినాదంతో మహిళలకు అండగా నిలుస్తున్న ఆమె విజయగాథ ఇది..

జగిత్యాల జిల్లాలోని యూసుఫ్‌నగర్‌లో ఉండేవాళ్లం. ఇద్దరన్నయ్యల తర్వాత నేను. ఏడో తరగతి వరకే చదువుకున్నా. ఆపై చదువుకుందామని ఉన్నా... మండల కేంద్రం కోరుట్లకి వెళ్లాలి. కానీ బస్సు సదుపాయం లేకపోవడంతో ఆ ఆలోచన మానుకున్నా. ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక కుట్టుపని నేర్చుకుందామనుకున్నా. ఆ పనికీ చేతిలో డబ్బుల్లేవు. దాంతో నా చెవికమ్మలు తాకట్టు పెట్టి ఫీజు కట్టాను. ఇష్టంగా నేర్చుకున్నానేమో బ్లవుజులు, డ్రెస్సులు ఏవైనా ఇట్టే కుట్టేసేదాన్ని. ఆసక్తి ఉన్నవాళ్లకి ఫీజు తీసుకుని నేర్పించేదాన్ని. మావారు దేవేందర్‌ది నిజామాబాద్‌ జిల్లాలోని మోతే గ్రామం. హోంగార్డుగా పనిచేసేవారు. అనుకోని కారణాలతో ఆయన ఉద్యోగం కోల్పోయారు. అప్పటికే మాకో పాప. దాంతో ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో నేను నేర్చుకున్న టైలరింగే నా కుటుంబానికి బాసటగా నిలిచింది. బ్యాంకు రుణం తీసుకొని 2014లో ఇంట్లోనే ‘శ్రీలత లేడీస్‌ టైలర్స్‌ అండ్‌ గార్మెంట్స్‌’ని ప్రారంభించా. చిన్నచిన్న ఆర్డర్లనీ వదలకుండా బ్లవుజులు, దుస్తులు కుట్టేదాన్ని. ప్రభుత్వ పాఠశాలల యూనిఫామ్స్, టై, బెల్టులు... ఆర్డర్స్‌ తీసుకుని నలుగురు మహిళలతో కుట్టించేదాన్ని. ఇంతలో నాకు మూడోసారి ప్రెగ్నెన్సీ వచ్చి, గర్భస్రావం అయ్యింది. ఆ సమయంలో ఆపరేషన్‌ చేయించుకోవడానికి రూ.లక్ష ఖర్చవుతుందన్నారు. చేతిలో అంత డబ్బులేదు. మా డాక్టరమ్మ మంచిది కాబట్టి డబ్బులేకపోయినా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడింది. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని.. ఆ సమయంలో మహిళలకి ఉచిత శిక్షణ ఇవ్వాలని అనుకున్నా. అప్పట్నుంచీ పెద్ద మొత్తంలో ఆర్డర్లు తీసుకుని, తోటి మహిళలకి ఉపాధి కల్పిస్తున్నా.

కొవిడ్‌ మార్చేసింది...

కొవిడ్‌ సమయంలో మాస్క్‌లకు గిరాకీ పెరిగింది కదా! అప్పుడు జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు 15 రోజుల్లో లక్ష మాస్కులు కుట్టివ్వాలన్నారు. అందుకు అవసరమైన ముడిసరకు కోసం బంగారం తాకట్టు పెట్టి, మెషినరీ సమకూర్చుకున్నా. అప్పుడే మొదటిసారి రూ. 3లక్షల ఆదాయం లభించింది. అందులోంచి లక్ష రూపాయలతో మా దగ్గరున్న మహిళలకు ఇంటి సరకులు పంపిణీ చేశా. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని వైద్యులకు పీపీఈ కిట్లు కుట్టాం. ఆ తర్వాత తెలంగాణలోని 15 జిల్లాల్లోని 20 వేల మంది ఆశావర్కర్లకు బ్లవుజులు కుట్టడానికి ఆర్డర్‌ వచ్చింది. వాటిని సకాలంలో అందించడంతో... ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు కావాల్సిన బెడ్‌ షీట్స్, పిల్లో కవర్స్‌ కుట్టేందుకు ఆర్డర్లు వచ్చాయి. అలా ఆర్డర్లని సకాలంలో అందిస్తూ ప్రస్తుతం దాదాపు వెయ్యి మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాం. వీరికి నెలకి రూ. 15 నుంచి 20 వేల ఆదాయం లభిస్తుంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఉత్తమ వ్యాపారవేత్తగా అవార్డునీ అందుకున్నా. భవిష్యత్‌లో మరింత మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా.

మంత్రి భాస్కర్, ఈటీవీ

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్