Celebrity Brides : నగల్లోనూ ‘నయా’ ట్రెండ్‌!

పెళ్లిలో తమ అభిరుచులకు తగినట్లుగా బంగారు నగల్ని డిజైన్‌ చేయించుకొని మెరిసిపోతుంటారు నవ వధువులు. కానీ రాన్రానూ దుస్తుల్లాగే నగల ట్రెండూ మారుతోంది. బంగారాన్ని పక్కన పెట్టి వజ్రాలు, కెంపులు, పచ్చలు.. వంటివి ఎంచుకుంటున్నారు మోడ్రన్‌ బ్రైడ్స్‌. తాజాగా వివాహబంధంలోకి అడుగుపెట్టిన నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా తన పెళ్లిలో ఇదే ట్రెండ్‌ను ఫాలో అయింది....

Updated : 24 Feb 2024 13:56 IST

పెళ్లిలో తమ అభిరుచులకు తగినట్లుగా బంగారు నగల్ని డిజైన్‌ చేయించుకొని మెరిసిపోతుంటారు నవ వధువులు. కానీ రాన్రానూ దుస్తుల్లాగే నగల ట్రెండూ మారుతోంది. బంగారాన్ని పక్కన పెట్టి వజ్రాలు, కెంపులు, పచ్చలు.. వంటివి ఎంచుకుంటున్నారు మోడ్రన్‌ బ్రైడ్స్‌. తాజాగా వివాహబంధంలోకి అడుగుపెట్టిన నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా తన పెళ్లిలో ఇదే ట్రెండ్‌ను ఫాలో అయింది. పేస్టల్‌ షేడెడ్‌ లెహెంగాకు జతగా భారీ డైమండ్‌ జ్యుయలరీని ఎంచుకొని మెరిసిపోయింది. రకుల్‌ మాత్రమే కాదు.. ఈ మధ్యే పెళ్లిపీటలెక్కిన పలువురు బాలీవుడ్‌ బ్రైడ్స్‌ కూడా తమ పెళ్లిలో ఇలాంటి నయా నగల ట్రెండ్‌నే అనుసరించారు. మరి, వాళ్లెవరు? వాళ్లు ధరించిన బ్రైడల్‌ జ్యుయలరీపై ఓ లుక్కేసేద్దాం రండి..

రకుల్‌.. ‘పోల్కీ’ స్టైల్‌!

తమ పెళ్లిలో డైమండ్‌ జ్యుయలరీకి ప్రాధాన్యమిచ్చే సెలబ్రిటీ వధువుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రకుల్‌ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. గోవా వేదికగా జరిగిన తన వివాహానికి భారీగా డిజైన్‌ చేసిన బ్లష్‌ పింక్‌ లెహెంగాను ఎంచుకున్న ఆమె.. ఆభరణాల విషయంలోనూ తగ్గేదేలేదన్నట్లుగా వ్యవహరించింది. పెద్ద పెద్ద పోల్కీ డైమండ్స్‌తో రూపొందించిన కుందన్‌ పోల్కీ చోకర్‌ నెక్లెస్‌ను ఎంచుకున్న ఆమె.. మ్యాచింగ్‌ ఇయర్‌ రింగ్స్‌, పాపిడబిళ్ల ధరించి సింప్లీ సూపర్బ్‌ అనిపించుకుంది. ఇలా తన లుక్‌తో అందరినీ కట్టిపడేసిన రకుల్‌.. ‘బ్రైడ్‌ ఆఫ్‌ ది సీజన్‌’గా ప్రశంసలందుకుంటోంది.


పరిణీతి.. ‘పచ్చల’ హారాలు!

నవరత్నాల్లో ఒకటైన పచ్చల్ని బంగారు ఆభరణాల్లో అక్కడక్కడా అమర్చుకొని మెరిసిపోయేవారు పాత కాలం వారు. కానీ ఆ తర్వాత్తర్వాత పూర్తిస్థాయిలో పచ్చలతోనే వివిధ డిజైన్లలో హారాలు రూపొందించుకొని ధరించడం అతివలకు అలవాటైపోయింది. ఇక ఇప్పుడు ఇవే పచ్చల్ని, వజ్రాలతో కలిపి సరికొత్త హారాల్ని డిజైన్‌ చేయించుకుంటున్నారు మోడ్రన్‌ బ్రైడ్స్‌. బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా కూడా తన పెళ్లిలో డైమండ్‌-ఎమరాల్డ్‌ జ్యుయలరీ ధరించి మెరుపులు మెరిపించింది. రష్యన్‌, జాంబియన్‌ పచ్చలతో మల్టీలేయర్డ్‌ అన్‌కట్‌ నెక్లెస్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుందామె. మ్యాచింగ్‌ ఇయర్‌ స్టడ్స్‌కి తోడు.. మొజాంబిక్‌ రూబీస్‌తో రూపొందించిన పాపిడబిళ్ల ధరించి దేవకన్యలా కనిపించిందీ ముద్దుగుమ్మ. ఇలా తన వెడ్డింగ్‌ జ్యుయలరీతో తన ఫ్యాషన్‌ సెన్స్‌ని మరోసారి చాటుకుందీ చక్కనమ్మ.


కియారా.. ది ‘రాయల్‌’ బ్రైడ్‌!

ప్రతి వేడుకలోనూ ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవడం బాలీవుడ్‌ బేబ్‌ కియారా అడ్వాణీకి అలవాటే! అందుకు తగ్గట్లుగా ట్రెడిషనల్‌/మోడ్రన్‌ జ్యుయలరీని ఎంచుకుంటూ ఈతరం అమ్మాయిలకు సరికొత్త ఫ్యాషన్‌ పాఠాలు నేర్పుతుంటుందీ ముద్దుగుమ్మ. తన పెళ్లిలోనూ ఇదే సీన్‌ రిపీట్‌ చేసింది కియారా. పేస్టల్‌ షేడెడ్‌ లెహెంగా సెట్‌తో అదరగొట్టిన ఈ చక్కనమ్మ.. దానికి జతగా మనీష్‌ మల్హోత్రా జ్యుయలరీ కలెక్షన్‌ నుంచి ఓ భారీ డైమండ్‌ నెక్లెస్‌ను ఎంచుకుంది. వజ్రాలు, పెద్ద పెద్ద పచ్చలతో ఈ చోకర్‌ను డిజైన్‌ చేశారు. దీనికి మ్యాచింగ్‌ ఇయర్‌ స్టడ్స్‌, పాపిడిబిళ్ల ధరించి అందరిచేతా బ్యూటిఫుల్‌ బ్రైడ్‌ అంటూ కితాబునందుకుందీ మిసెస్‌ మల్హోత్రా. సింగిల్‌ పీసే అయినా హెవీగా రూపొందించిన ఈ నగ ఆమెకు రాయల్‌ లుక్‌ని అందించిందని చెప్పచ్చు.


ఆలియా.. ‘కుందన్‌’ మేనియా!

విభిన్న డిజైన్లలో భారీగా రూపొందించిన రత్నాభరణాలు అతివలకు అదనపు అందాన్ని జోడిస్తాయి. అందుకే అలాంటి రత్నాభరణాల్నే తన పెళ్లికీ ఎంచుకొని మెరిసిపోయింది అందాల తార ఆలియా భట్‌. ఐవరీ కలర్‌ శారీలో, తక్కువ మేకప్‌తో సింపుల్‌ బ్రైడ్‌గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. తన ఆభరణాలతో అందరినీ కట్టిపడేసింది. ‘సబ్యసాచి హెరిటేజ్‌ జ్యుయలరీ’ నుంచి కుందన్‌ స్టోన్స్‌తో రూపొందించిన హెవీ నెక్‌పీస్‌ను ఎంచుకున్న ఆలియా.. చాంద్‌బాలీ జుంకాలు, గాజులు, పాపిడబిళ్ల, మాతాపట్టి.. ఇలా ప్రతిదీ కుందన్‌ స్టోన్‌తోనే ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంది. 2022లో పెళ్లిపీటలెక్కిన ఆలియా బ్రైడల్‌ లుక్‌ అప్పట్లో వైరల్‌గా మారింది.


కత్రినా.. ‘మోడ్రన్‌’ టచ్‌!

మన పెళ్లిళ్లలో ఎరుపు రంగును సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే చాలామంది అమ్మాయిలు తమ పెళ్లి కోసం ఎరుపు రంగులో ఉండే చీర/లెహెంగాను ఎంచుకుంటారు. కత్రినా కూడా తన పెళ్లిలో ఇదే ట్రెండ్‌ని ఫాలో అయింది. ఎరుపు రంగు, గోల్డెన్‌ జరీతో రూపొందించిన భారీ లెహెంగాను ఎంచుకున్న ఆమె.. తన నగలతో తన అటైర్‌కు మోడ్రన్‌ టచ్‌ ఇచ్చింది. బంగారం, అన్‌కట్‌ డైమండ్స్‌, ముత్యాలు.. ఈ మూడింటినీ జతచేసి రూపొందించిన భారీ చోకర్‌ నెక్లెస్‌, జుంకా ఇయర్‌ రింగ్స్‌తో ట్రెడిషనల్‌ కమ్‌ మోడ్రన్‌ బ్రైడ్‌లా మెరిసిపోయింది కత్రినా. ఇక తాను ధరించిన మాతాపట్టి, గాజులు, నత్‌.. వంటివీ ఆమె లుక్‌ని మరింత రాయల్‌గా మార్చేశాయని చెప్పచ్చు. ఇలా ఆమె బ్రైడల్‌ లుక్‌ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది అమ్మాయిలు తమ పెళ్లిళ్లలో సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారని చెప్పడంలో సందేహం లేదు.

వీళ్లతో పాటు రిచా చద్దా, అతియా శెట్టి, అనుష్కా శర్మ, సోనమ్‌ కపూర్‌.. వంటి బాలీవుడ్‌ భామలంతా తమ పెళ్లిళ్లలో సరికొత్త జ్యుయలరీ ట్రెండ్స్‌ని పాటిస్తూ మెరిసిపోయారు. ఈతరం వధువుల్లో స్ఫూర్తి నింపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్