సూర్యవంశం సాధించిన విజయం

తనలో వెల్లువెత్తే భావాలను అక్షరాల్లో పొదిగి అందించే ప్రసిద్ధ రచయితకు తన పాఠకులతో ఉండే భావోద్వేగ ఆత్మీయానుబంధం ఎలా ఉంటుంది? స్వీయానుభవాల మాలికగా ‘సూర్య వంశం’ పేరుతో దీన్ని హృద్యంగా చిత్రించిన చెన్నైకి చెందిన తమిళ రచయిత్రి  శివశంకరిని ప్రతిష్ఠాత్మక సరస్వతీ సమ్మాన్‌ -2022 పురస్కారం వరించింది.

Updated : 18 Mar 2023 12:54 IST

తనలో వెల్లువెత్తే భావాలను అక్షరాల్లో పొదిగి అందించే ప్రసిద్ధ రచయితకు తన పాఠకులతో ఉండే భావోద్వేగ ఆత్మీయానుబంధం ఎలా ఉంటుంది? స్వీయానుభవాల మాలికగా ‘సూర్య వంశం’ పేరుతో దీన్ని హృద్యంగా చిత్రించిన చెన్నైకి చెందిన తమిళ రచయిత్రి  శివశంకరిని ప్రతిష్ఠాత్మక సరస్వతీ సమ్మాన్‌ -2022 పురస్కారం వరించింది. కేకే బిర్లా ఫౌండేషన్‌ అందించే ఈ పురస్కారానికి భారతీయ సాహిత్య చరిత్రలో ఉత్తమ స్థానం ఉంది. విజేతకు రూ.15 లక్షల నగదుతో పాటు మెమెంటో, ప్రశంసాపత్రం అందజేస్తారు.

2019లో వెలువడిన ‘సూర్యవంశం’లో పాఠకులూ, కొందరు వ్యక్తులూ తననెంత కదిలించి గాఢంగా ప్రభావితం చేశారో, కొన్ని సంఘటనలు తన దృష్టి కోణాన్ని మార్చివేసి అవగాహన స్థాయిని ఎలా పెంచాయో శివశంకరి ఆసక్తికరంగా అక్షర బద్ధం చేశారు.

దాదాపు యాభై సంవత్సరాల తన రచనా ప్రస్థానంలో ఆమె 36 నవలలు, 48 నవలికలు, 150 కథానికలు, 15 యాత్రా కథనాలు, వ్యాసాలు రాశారు. ఆమె కలం నుంచి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితచరిత్ర వెలువడింది. స్వీయ చరిత్రను వీడియో, ఆడియో టేపుల ద్వారా ప్రకటించిన తొలి రచయితగా పేరు పొందారు. తన మాగ్నం ఓపస్‌ రచనగా సాహిత్య పరిశోధనా పుస్తకం ‘నిట్‌ ఇండియా త్రూ లిటరేచర్‌’ను 4 భాగాలుగా తీసుకువచ్చారు. దీనిలో భారతీయ భాషలకు చెందిన 18 మంది సుప్రసిద్ధ రచయితల ఇంటర్‌వ్యూలను పొందుపరిచారు. ఆమె రచనలు భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్‌, జపనీస్‌, ఉక్రేనియన్‌ భాషల్లోకి అనువాదమయ్యాయి.

రచనా వ్యాసంగంతో పాటు స్వచ్ఛంద సంస్థ ‘అగ్ని (అవేకెన్డ్‌ గ్రూప్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌) ట్రస్ట్‌’ను 1986లో సహ రచయిత మాలన్‌తో కలిసి స్థాపించారు. వ్యక్తులను మేల్కొలిపితే సమాజోన్నతి సాధ్యమని నమ్మే ఈ సంస్థ వివిధ సమావేశాలూ, వర్క్‌ షాపులు, సెమినార్లు నిర్వహించి సానుకూల దృక్పథం, దేశభక్తి, సరైన విలువల కోసం పాటుపడింది. సాంఘిక సమస్యలపై కృషి చేసిన ఈ సంస్థ కార్యకలాపాలు పాతికేళ్లపాటు 2012 వరకూ సాగాయి. శివశంకరి రాసిన కథ ఆధారంగానే 1981లో కె.బాలచందర్‌ దర్శకత్వంలో చిరంజీవి, జయప్రదలతో ‘47 రోజులు’ సినిమా రూపొందింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్