‘అడవి తల్లి’ చలవే!

ఆ అడవి... ఎన్నో ఊళ్ల పాలిట కల్పతరువు. అక్కడ దొరికే పండ్లే వాళ్లకి ఆదాయ వనరు. అయితే అందరూ అనుకున్నట్లు ఈ అడవి ప్రకృతి ప్రసాదించినది కాదు... దీన్ని సృష్టించింది చిలకపల్లి అనసూయమ్మ... వందలు, వేలు, లక్షలకొద్దీ మొక్కల్ని నాటి వాటిని పెంచి ఎందరో పేదల ఆకలి తీరుస్తుందీ అడవి తల్లి. ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ సందర్భంగా ఆమెను ‘వసుంధర’ పలకరించగా...

Published : 05 Jun 2024 04:34 IST

ఆ అడవి... ఎన్నో ఊళ్ల పాలిట కల్పతరువు. అక్కడ దొరికే పండ్లే వాళ్లకి ఆదాయ వనరు. అయితే అందరూ అనుకున్నట్లు ఈ అడవి ప్రకృతి ప్రసాదించినది కాదు... దీన్ని సృష్టించింది చిలకపల్లి అనసూయమ్మ... వందలు, వేలు, లక్షలకొద్దీ మొక్కల్ని నాటి వాటిని పెంచి ఎందరో పేదల ఆకలి తీరుస్తుందీ అడవి తల్లి. ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ సందర్భంగా ఆమెను ‘వసుంధర’ పలకరించగా...

‘చెట్టు తల్లిలాంటిది. దాన్ని పరిరక్షిస్తే... అది మనల్ని జీవితమంతా రక్షిస్తుంది. ఈ ఆలోచన ఎలాగో తెలియదు కానీ చిన్నతనంలోనే నాలో నాటుకుంది. మాది మెదక్‌ జిల్లా పస్తాపూర్‌. నాన్న నాగప్ప, అమ్మ లచ్చమ్మ. పదేళ్లు నిండకుండానే పెళ్లైంది. అత్తింట నిరాదరణకు గురై 15 ఏళ్లకే పుట్టింటికొచ్చేశా. అమ్మానాన్నలతో కూలిపనులకి వెళ్లేదాన్ని. ఆ తరవాత ఓ నర్సరీలో చేరి శిక్షణ తీసుకున్నా. అప్పుడే నాకు మొక్కలపై అవగాహన కలిగింది. తర్వాత చుట్టుపక్కల గ్రామాల మహిళలకు నర్సరీలో మొక్కల పెంపకం గురించి శిక్షణ ఇచ్చేదాన్ని. వాళ్లు పెంచిన మొక్కల్ని పొలాల చుట్టూ ఊరి సరిహద్దుల్లోనూ నాటించేదాన్ని. అలా పంటలకు అనుగుణంగా లేని భూములను గుర్తించి మొక్కలు నాటడం నాకు వ్యాపకంగా మారింది.

1993 అనుకుంటా... ఆ ఏడు కురిసిన భారీవర్షాలతో సంగారెడ్డి జిల్లాలో కొన్ని గ్రామాలు నీటమునిగాయి. జనమంతా కట్టుబట్టలతో దగ్గర్లోని గుబ్బడి అనే ఎత్తైన దిబ్బలమీదకెళ్లారు. వాళ్లకోసం ప్రభుత్వం చేపట్టిన సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఊళ్లలో పంట భూములన్నీ పాడై, గుబ్బలే మిగిలాయి. అదంతా సున్నపురాయి, నల్లరాయితో నిండిన నేల... ఆ గుట్టలపై మొక్కలు నాటితేనో అనిపించింది. నా ఆలోచనకి అంతా నవ్వారు. కానీ నేను వెనకడుగు వేయలేదు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నా. గడ్డపార దిగని ఆ గుబ్బలపై గుంటలు తీయడానికి కూలీ ఇచ్చిమరీ పనికి పిలిచేదాన్ని. గంటకు రెండు రూపాయల చొప్పున రోజుకి 10 రూ. ఇచ్చేదాన్ని. మూడు నెలల్లో సుమారు 60 వేల గుంటలు సిద్ధం చేయించా. వాటిలో మొక్కలు నాటడంతోపాటు పరిరక్షించడంలో స్థానికులకు అవగాహన కలిగించేదాన్ని. అప్పట్లో రవాణా సౌకర్యం ఉండేది కాదు. ఎండలోనే మైళ్ల దూరం నడిచి... ఊళ్లన్నీ తిరిగేదాన్ని. అలా 1200 ఎకరాలకు పైగా నేను నాటిన మొక్కలు ఇప్పుడు మహా వృక్షాలయ్యాయి. అంతా దట్టమైన అటవీప్రాంతంగా మారింది. చింత, వేప, జామ, మామిడి, సీతాఫలం, నేరేడు, టేకు, ఉసిరి, తంగేడు, నిద్రగన్నేరు... వంటి చెట్లతో రకరకాల జంతువులకీ పక్షులకీ ఆవాసమైంది. నా కష్టానికి ఫలితం కళ్లెదుట కనిపిస్తోంది. అంతేకాదు, ఆ అడవిమీద స్థానికులకు ప్రభుత్వ పట్టా వచ్చేలా కృషి చేశా. అందువల్లే నేడు ఇందూరు, హున్నాపుర్, మరియంపుర్, సంగాపుర్, రాఘవాపుర్, మలగి, టేకూర్‌... ఇలా సుమారు 16 గ్రామాలకు చెందిన మహిళా సంఘాలన్నీ ఆ చెట్లమీద వచ్చే ఆదాయాన్ని అందుకోగలుగుతున్నాయి. అది చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇందుకుగానూ ఐక్యరాజ్యసమితి నుంచి ‘ఈక్వేటర్‌ ప్రైజ్‌’నీ అందుకున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్